Date:23/11/2020
పుంగనూరు ముచ్చట్లు:
మండలంలోని ఎంసి.పల్లెకు చెందిన ఒక వ్యక్తి తన కుటుంబ సభ్యుల పేరుతో 70 ఎకరాలు ప్రభుత్వ భూములను కబ్జా చేసి, రికార్డులు నమోదు చేసుకోవడంపై ఎంఆర్పీఎస్ నాయకులు ధర్నా చేశారు.సోమవారం ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు నరసింహులు ఆధ్వర్యంలో తహశీల్ధార్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా నరసింహులు మాట్లాడుతూ తహశీల్ధార్ ఆఫీసులో పనిచేస్తున్న వ్యక్తి తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని 70 ఎకరాలు పేద ప్రజల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి , రికార్డులు మార్చుకున్నారని ఆరోపించారు. అవినీతి అక్రమాలకు కొంత మంది రెవెన్యూ అధికారులు సహకరిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తక్షణం చర్యలు తీసుకోకపోతే ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగభూషణం, అమరనాథ్, విజయకుమార్, శ్రీనివాసులు, అశోక్, రామకృష్ణ, బుడ్డన్న తదితరులు పాల్గొన్నారు.
Tags; Dharna over occupation of government lands