మంగళగిరి కోసం పక్కా ప్లాన్

గుంటూరు ముచ్చట్లు:


గుంటూరు జిల్లా మంగళగిరి. 2014 నుంచి మంగళగిరి రాష్ట్రంలో కీలక నియోజకవర్గంగా మారిపోయింది. సీఎం జగన్‌తోపాటు విపక్షనేత చంద్రబాబు కూడా ఇదే నియోజకవర్గంలో నివాసం ఉంటున్నారు. అందుకే మంగళగిరిపై పట్టుకోసం రెండు పార్టీలు వ్యూహాత్మకంగా మందుకెళ్తుంటాయి. 2019లో మంగళగిరి నుంచి నారా లోకేష్ పోటీ చెయ్యడంతో చాలా హైప్‌ వచ్చింది. ఆ ఎన్నికల్లో లోకేష్‌ ఓడిపోవడం.. ఆళ్ల రామకృష్ణారెడ్డి వరసగా గెలవడం పెద్ద చర్చకే దారితీసింది. వచ్చే ఎన్నికల్లో మరోసారి ఇక్కడి నుంచే పోటీ చేస్తానంటున్నారు లోకేష్‌. ఈక్రమంలో మంగళగిరిలో మరింత పట్టు బిగించేందుకు వైసీపీ వేస్తున్న ఎత్తుగడలు రాజకీయంగా ఆసక్తి కలిగిస్తున్నాయి. ఆ వ్యూహం చుట్టూనే చర్చ సాగుతోంది.మంగళగిరిలో పద్మశాలీ సామాజికవర్గం ఓటర్లు సుమారు 50వేల వరకూ ఉన్నారు. వీరంతా ఎటు మొగ్గు చూపితే వారికే గెలుపు అవకాశాలు ఎక్కువ. గత రెండు ఎన్నికల్లో గెలిచిన ఆర్కేకు మంగళగిరి టౌన్‌ మైనస్‌ అయ్యింది. రెండుసార్లూ ఆయనకు మెజారిటీ రాలేదు. తాడేపల్లి మండలంలో రెడ్డి సామాజికవర్గం ఓటర్లు ఎక్కువగా ఉండడంతో.. మంగళగిరి టౌన్‌లో ఎదురైన మైనస్‌ను అలా భర్తీ చేసుకుంటూ వచ్చారు. ఈసారి వైసీపీ ప్లాన్ మార్చిందని టాక్‌. మంగళగిరిలో ఉన్న బీసీ నేతలందరినీ క్యాప్చర్ చెయ్యాలని మాస్టర్ ప్లాన్ వేసింది. అందులో భాగంగానే పద్మశాలీ నేతగా ఉన్న చిల్లపల్లి మోహన్‌రావుకు ఆప్కో ఛైర్మన్ పదవి కట్టబెట్టింది. తెలుగుదేశానికి రాజీనామా చేసిన వైసీపీలో చేరకముందే మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావుకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టింది వైసీపీ. మంగళగిరి పట్టణ అధ్యక్ష పదవి కూడా చేనేత సామాజికవర్గానికి చెందిన మునగాల మల్లేశ్వరావుకు ఇచ్చారు. ఆయన భార్య భాగ్యలక్ష్మిని మంగళగిరి వ్యవసాయ మార్కెట్ యార్డు ఛైర్మన్ పదవి వరించింది.

 

 

మంగళగిరి యార్డు చరిత్రలో ఇప్పటివరకూ చేనేతలకు ఛైర్మన్ పదవి ఇవ్వలేదు. మొదటిసారిగా ఆ పదవిని చేనేతలకు కట్టబెట్టి ఆ సామాజికవర్గాన్ని ఆకర్షించే ఎత్తుగడ వేసింది.ఇంతటితో ఆగకుండా చేనేత సామాజికవర్గం ఓటర్లను పూర్తిస్థాయిలో తమవైపు తిప్పుకునేందుకు మరిన్ని పదవులు ఇవ్వాలని భావిస్తున్నట్లు మంగళగిరిలో ప్రచారం జరుగుతుంది. మంగళగిరి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కాండ్రు కమలకు కీలక పదవి ఇవ్వబోతున్నారట. తాడేపల్లి-మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్‌కు కమలను మేయర్‌ను చేస్తారని అనుకుంటున్నారు. కమల బరిలో ఉంటే గెలుపు ఈజీ అనే లెక్కలు వేస్తున్నారట. మురుగుడు హనుమంతరావుకు కాండ్రు కమల వియ్యపురాలు. హనుమంతరావు గతంలో మంగళగిరి మున్సిపల్ ఛైర్మన్‌గా పనిచేశారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాండ్రు కమల కూడా మంగళగిరి మున్సిపల్ ఛైర్మన్, మంగళగిరి ఎమ్మెల్యేగా పనిచేశారు. చేనేత సామాజికవర్గానికి చెందిన ఇద్దరు నేతలకు ఆ సామాజికవర్గంలో మంచి పట్టుంది. అందుకే ఇద్దరికీ ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ఆ సామాజికవర్గం మొత్తం వైసీపీకి అండగా ఉంటుందనేది అధిష్టానం ఆలోచన. అంతేకాదు ఎన్నికల సమయానికి టీడీపీలో ఉన్న చేనేత సామాజికవర్గానికి చెందిన కీలక నేతను కూడా వైసీపీలోకి తీసుకొచ్చే ప్రయత్నాల్లో వైసీపీ నేతలు బిజీగా ఉన్నారట. మరి.. ఈ వ్యూహం అధికారపార్టీకి ఏ మేరకు వర్కవుట్‌ అవుతుందో చూడాలి.

 

Tags: Diamond hunt begins ….

Leave A Reply

Your email address will not be published.