Natyam ad

ఆనంకు పొగ పెట్టేశారా…

నెల్లూరు ముచ్చట్లు:


అధికారపార్టీలో జరుగుతున్న పరిణామాలపై మాజీ మంత్రి.. ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి గరంగరంగా ఉన్నారు. తనను పక్కన పెట్టడంపై ఆయన రగిలిపోతున్నారు. చెప్పాల్సింది చాలా ఉందంటున్న ఆనం.. తన ఆక్రోశాన్ని త్వరలో బయట పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. సన్నిహితులతో ఆయన సమాలోచనలు చేస్తున్నారు. అవమానాలు భరిస్తూ వైసీపీలో ఉండలేమన్నది ఆనం వాదన. తన రాజకీయ భవిష్యత్‌పై మార్చిలో నిర్ణయం తీసుకుంటానని అనుచరులకు ఆనం చెబుతున్నారట. అయితే తానే పోటీలో ఉండాలా? లేక వారసులను బరిలో దింపాలా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. అలాగే ఆత్మకూరులో పోటీ చేస్తారా లేక నెల్లూరు సిటీ నుంచి బరిలో ఉండాలో మాజీ మంత్రి తర్జన భర్జన పడుతున్నట్టు సమాచారం.2019లో వైసీపీ నుంచి వెంకటగిరిలో పోటీ చేసి గెలిచారు ఆనం. సీనియర్‌గా తనకు అధికార పార్టీలో ప్రాధాన్యం దక్కుతుందని ఆయన ఆశించినా అలా జరగలేదు. అప్పటి నుంచి అడపాదడపా తన అసంతృప్తిని బయట పెడుతూనే ఉన్నారు. అదీ సొంత పార్టీ వైసీపీపైనా.. వైసీపీ ప్రభుత్వంపైనా బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు ఈ మాజీ మంత్రి. మొదట్లో పార్టీ పెద్దలు పిలిచి మాట్లాడటంతో కొంతకాలం సైలెంటైనా.. తర్వాత మళ్లీ పాత పద్ధతిలోకి వచ్చేశారు రామనారాయణరెడ్డి. ఈసారి సొంత పార్టీపైనా.. రాష్ట్ర ప్రభుత్వంపైనా ఆయన విమర్శలు మరింత పదునెక్కాయి. ఇన్నాళ్లూ ఓపికగా వేచి చూసిన వైసీపీ అధిష్ఠానం లాభం లేదనుకుని యాక్షన్‌లోకి దిగింది. రామనారాయణరెడ్డి అధికారాలకు కత్తెర వేస్తోంది.

 

 

ఇటీవలే వెంకటగిరి వైసీపీ సమన్వయకర్తగా నేదురమల్లి రాంకుమార్‌రెడ్డికి పగ్గాలు అప్పగించింది పార్టీ అధిష్ఠానం. ఆ వెనువెంటనే ఆనం రామనారాయణరెడ్డి భద్రతను టు ప్లస్‌ టు నుంచి వన్‌ ప్లస్‌ వన్‌కు కుదించింది. తాజాగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వెళ్లొద్దని పరోక్షంగా మాజీ మంత్రికి సంకేతాలు పంపించింది అధికారపార్టీ. ఒకవేళ ఆనం ఆ కార్యక్రమాన్ని నిర్వహించినా వార్డు, గ్రామ సచివాలయ సిబ్బంది ఎవరూ వెళ్లొద్దని మౌఖికంగా ఆదేశాలు వెళ్లాయి. ఇదేకాదు.. వెంకటగిరిలో ఆనం బలాన్ని తగ్గించే దిశగా మరిన్ని చర్యలకు అధికారపార్టీ దిగుతోంది. వెంకటగిరి మున్సిపల్ కమిషనర్‌ గంగా ప్రసాద్‌, రాపూరు CI నాగమల్లేశ్వరరావును బదిలీ చేశారు. వీరిద్దరూ మాజీ మంత్రి ఆనం సిఫారసుపై వచ్చిన ఆఫీసర్లు కావడంతో వారిని ఇక్కడి నుంచి పంపేశారట. ఇలాంటి అధికారుల జాబితాను సిద్ధంగా చేసి.. వారిని కూడా వెంకటగిరి నుంచి బదిలీ చేస్తారని అనుకుంటున్నారు.ఈ వరుస పరిణామాలపై మాజీ మంత్రి ఆనం వర్గం రగిలిపోతున్నట్టు సమాచారం. గతంలో ఇదే విధంగా కామెంట్స్‌ చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని పార్టీ పెద్దలు పిలిచి మాట్లాడారని..

 

 

 

Post Midle

అదేవిధంగా పిలిచి మాట్లాడతారని ఆనం వర్గం భావించిందట. కానీ.. కోటంరెడ్డిని.. ఆనంను ఒకే గాటన చూడలేదు పార్టీ అధిష్ఠానం. దాంతో మాజీ మంత్రి సైతం తన రాజకీయ భవిష్యత్‌పై ఆలోచనలు చేస్తున్నారట. జరుగుతున్న పరిణామాలపై ఇప్పటికిప్పుడు స్పందించకుండా.. సమయం చూసుకుని ఆనం బరస్ట్‌ అవుతారని తెలుస్తోంది. టీడీపీకి మాజీ మంత్రి మళ్లీ దగ్గరవుతున్నారట. ఆత్మకూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్‌లో టీడీపీకి బలమైన నేతలు లేరని.. ఆ మూడింటిలో ఏదో ఒకచోట రామనారాయణరెడ్డి పోటీ చేయొచ్చని చెవులు కొరుక్కుంటున్నారు. మార్చి నాటికి రాజకీయ కార్యాచరణ ప్రకటిస్తారని తెలుస్తోంది. అలాగే వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేయాలా లేక వారసులను బరిలో దింపాలా అనే ఆలోచనలోనూ ఆనం ఉన్నారట. మరి.. మాజీ మంత్రి ఏం చేస్తారో చూడాలి.

 

Tags:Did you smoke him?

Post Midle