మిర్చి రైతులకు కష్టాలు…

గుంటూరు ముచ్చట్లు:
 
మిర్చి రైతులు ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో మిర్చికి తామర తెగులు సోకడంతో 80 శాతం మంది రైతులు తమ పంటను తొలగించారు. ప్రధానంగా గుంటూరు, కృష్ణాజిల్లాల్లో అధిక నష్టం వాటిల్లింది. 2020లో రైతులకు నష్టపరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం వైఎస్సార్‌ ఉచిత బీమా పథకాన్ని ప్రకటించింది. 2021-22 సంవత్సరంలో పంటలకు బీమా చేయకపోవడం వల్ల రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. తామర తెగులు వాతావరణ మార్పు వల్ల వచ్చిందని జాతీయ తెగుళ్ల అధ్యయన కమిటీ తన నివేదికలో వెల్లడించింది.జనవరిలో గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పర్యటించిన అధ్యయన బృందం తమ నివేదికను ఇటీవల కేంద్రానికి సమర్పించింది. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నేటికీ స్పందన లేదు. ముఖ్యమంత్రితో ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేసి త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని మంత్రులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు, మేకతోటి సుచరిత ప్రకటించి దాదాపు 40 రోజులవుతున్నా ఎటువంటి పురోగతీ లేదు. మూడేళ్లుగా ధరలు ఆశాజనకంగా ఉండటంతో ఈ ఏడాది గుంటూరు జిల్లాలో 2.66 లక్షల ఎకరాల్లో రైతులు మిర్చి సాగు చేశారు. తెగులు వల్ల 2.26 లక్షల ఎకరాల్లో పంట తుడిచిపెట్టుకుపోయింది. దాదాపు లక్ష మంది రైతులు నష్టపోయారు. మిర్చికి ఒక్కో ఎకరానికి రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు రైతులు పెట్టుబడి పెట్టారు. పెట్టుబడి ఖర్చులు కూడా రాక, చేసిన అప్పులు తీర్చే మార్గం లేక గుంటూరు జిల్లాలో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.
ఈ నేపథ్యంలో మిర్చి పంటకు నష్టపరిహారం కోరుతూ ఎపి రైతు, కౌలురైతు సంఘాల ఆధ్వర్యంలో రైతులు నెలరోజులుగా ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. పలుచోట్ల మిర్చి పైరును దహనం చేశారు. అయినా ప్రభుత్వం స్పందించకపోవడంతో గుంటూరు కలెక్టరేట్‌ వద్ద నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఎపి రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య తెలిపారు. ప్రభుత్వం ప్రీమియం చెల్లించి ఉంటే వాతావరణ బీమా ద్వారా రైతులకు పరిహారం వచ్చేదని ఆయన పేర్కొన్నారు.
 
Tags: Difficulties for chilli farmers …

Leave A Reply

Your email address will not be published.