-ప్రైవేటు టీవీ న్యూస్ చానళ్లకు కేంద్రం ఆదేశం
అమరావతి ముచ్చట్లు:
ప్రకృతి విపత్తులు, భారీ ప్రమాదాల దృశ్యాలను ప్రసారం చేసేటప్పుడు వాటిపై తేదీ, సమయానికి సంబంధించిన స్టాంపు ప్రసారమయ్యేలా చూడాలని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు టీవీ న్యూస్ చానళ్లను ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసార శాఖ సోమవారం ఒక సూచన జారీ చేసింది.ప్రకృతి విపత్తులు, భారీ ప్రమాదాలు సంభవించి నప్పుడు టీవీ చానళ్లు రోజుల తరబడి నిరంతర కవరేజీ ఇస్తుంటాయని, అయితే, తొలిరోజు దృశ్యాలను ఫుటేజ్‌లో చూపిస్తూనే ఉండటం వల్ల వీక్షకులకు అనవసర గందరగోళం, భయాందోళనలు కలిగే అవకాశం ఉందని తెలిపింది.‘అందువల్ల వీక్షకులను అనవసరపు అపార్థాలకు గురిచేయకుండా నివారించేందుకు అలాంటి దృశ్యాలను ప్రసారం చేసేటప్పుడు ఫుటేజీ పైభాగంలో తేదీ, సమయం స్టాంపును ప్రముఖంగా ప్రదర్శించాలని అన్ని ప్రైవేటు శాటిలైట్ టీవీ చానళ్లకు సూచిస్తున్నాం’ అని స్పష్టం చేసింది. ఈ సూచనను పాటించడం వల్ల వాస్తవంగా ఏరోజు దృశ్యాలను ప్రసారం చేస్తున్నారో వీక్షకులకు స్పష్టమైన అవగాహన ఏర్పడుతుందని తెలిపింది. కేరళ, హిమాచల్‌ప్రదేశ్‌లలో ఇటీవల కొండచరియలు విరిగిపడి అనేకమంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలను టీవీ చానళ్లు విస్తృతంగా ప్రసారం చేసిన నేపథ్యంలో కేంద్రం నుంచి తాజా సూచన వెలువడింది.
Tags: Disaster scenes must have a date and time!