Natyam ad

చిన్న‌శేష వాహనసేవలో ఆధ్యాత్మిక పుస్త‌కాల ఆవిష్క‌ర‌ణ‌

తిరుమ‌ల‌ ముచ్చట్లు:

శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన సోమ‌వారం ఉదయం చిన్న‌శేష వాహనసేవలో మూడు ఆధ్యాత్మిక పుస్తకాలను టీటీడీ ఛైర్మన్   భూమన కరుణాకర రెడ్డి, ఈవో   ఎవి.ధ‌ర్మారెడ్డి ఆవిష్కరించారు.శ్రీ ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసం.పరిష్కర్త శ్రీ వైద్యం వేంకటేశ్వరాచార్యులు. వేదవ్యాస విరచిత అష్టాదశ పురాణాలలోని ఎనిమిది పురాణాలలో, నాలుగు ఉపపురాణాలలో వెంకటాచల మాహాత్యం వర్ణితమై ఉంది. వాటిలో వేంకటాచటంలోని వివిధ తీర్ధాది విశేషాలున్నాయి. కాగా వరాహపురాణ, భవిష్యోత్తర పురాణాలలో పద్మావతీ శ్రీనివాసుల వివాహగాథ ఉంది. శ్రీవారి వివాహగాథ ప్రధాన ఇతివృత్తంగా రచితమైన మహాప్రబంధం శ్రీ ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసం. ఈ మహాకావ్యాన్ని రచించిన శ్రీ గణపవరపు వేంకటకవి క్రీ.శ. 1630-1680 ప్రాంతానికి చెందినవారు. ఇది 909 పద్య, గేయాలతో కూడిన ఏకాశ్వాస ప్రబంధం. ఈ ప్రబంధరాజానికి గల కాగిత లిఖితప్రతులు, తాళపత్ర ప్రతులు, 1892, 1977 సంవత్సరాలలో ముద్రితమైన ప్రతులు పరిశీలించి, పరిష్కరించి పాఠభేదాలతో అందిస్తున్నారు గ్రంథపరిష్కర్త శ్రీమాన్ వైద్యం వేంకటేశ్వరాచార్యులు. వేంకటకవి ఈ కావ్యాన్ని బంధచిత్రాలలో ఇమిడేవిధంగా రచించారేకానీ, వాటికి చిత్రాలు సమకూర్చలేదు. వైద్యం వేంకటేశ్వరాచార్యులు తొలిసారిగా ఈ కావ్యంలోని పద్యాలకు చక్కటి బంధచిత్రాలను గీయించి, అద్వితీయమైన పీఠికతో శ్రీవారికి మొక్కుబడిగా అందిచారు.

Post Midle

అంబ్రాసిల్ గ్లోరీ ఆఫ్ తిరుమ‌ల

–   అంబికా అనంత్

కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామివారు తిరుమలలో అర్చామూర్తిగా అవతరించిన విషయం అందరికీ తెలిసినదే. స్వామివారి మహాత్యాలను, లీలా విశేషాలను, వేంకటాద్రిలో వెలసిన వివిధ తీర్ధాల విశేషాలను తెలియజేస్తూ టీటీడీ పూర్వ ఈవో  పి.వి.ఆర్.కె. ప్రసాద్ తెలుగులో “తిరుమల లీలామృతం’ అనే పేరుతో ఒక పుస్తకాన్ని ప్రచురించారు. పాఠకుల విశేషాదరణను పొందిన ఆ పుస్తకాన్ని ప్రముఖ పాత్రికేయులు, రచయిత్రి, అనువాదకురాలు   అంబికా అనంత్ ఇంగ్లీషులో అనువాదం చేసి టీటీడీకి సమర్పించారు.

మహర్షులు లోకోపకారం వ్రతం

–  చివుకుల రమాకాంత శర్మ

భారతీయులు అగ్ని ఆరాధకులు, సూర్యోపాసకులు. మన మహర్షులు యజ్ఞయాగాదులతో దేవతలకు హవిస్సులనందించి వారిని ప్రసన్నచిత్తుల్ని చేసుకుని లోకకళ్యాణానికి కారకుల‌య్యారు. మహర్షులు తమ తపోశక్తితో శ్రుతులను స్మృతులను మానవాళికి అందించి వారిని మహోన్నతులుగా తీర్చిదిద్దారు. తమకు వినిపించిన దివ్య సందేశాలను శ్రుతులు అన్నారు. తమకు కనిపించిన దివ్యజ్ఞానాన్ని స్మృతులు అన్నారు. అందుకే మన వేదాలకు శ్రుతులు, స్మృతులు అని పేరు. వేదము అంటేనే అపూర్వ విజ్ఞానాన్ని తెలియజేయునది అని అర్థం. ఇదే మహర్షులు – లోకోపకారానికి చేసిన వ్రతం! ఈ గ్రంథ రచయిత  చివుకుల రమాకాంత శర్మ. “మహర్షులు లోకోపకారవ్రతం” అనే ఈ గ్రంథంలో వ‌శిష్ఠమహర్షి నుండి కణ్వమహర్షి వరకు 24 మంది మహర్షుల జీవితవిశేషాలను, వారి రచనలను, తపోమహిమలను విశదంగా వివరించారు.ఈ కార్య‌క్ర‌మంలో ఢిల్లీ స్థానిక స‌ల‌హా మండ‌లి అధ్య‌క్షురాలు   వేమిరెడ్డి ప్ర‌శాంతిరెడ్డి, జెఈవో   సదా భార్గవి, ఎస్ఈ -2   జగదీశ్వర్ రెడ్డి, అన్న‌మాచార్య ప్రాజెక్టు సంచాల‌కులు   విభీష‌ణ శ‌ర్మ‌, ఉప సంపాదకులు డా|| నరసింహాచార్య పాల్గొన్నారు.

 

Tags: Discovery of spiritual books in Chinnashesha Vahanaseva

Post Midle