ఈటెలతో  షా భేటీపై చర్చ..రచ్చ

హైదరాబాద్ ముచ్చట్లు:


వచ్చే నెలలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్‌ వేదికైన తరుణంలోనే ఒక్కసారిగా చర్చల్లోకి వచ్చారు ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌. 2, 3 తేదాల్లో జరిగే సమావేశాల ఏర్పాట్లలో ఈటలకు కూడా బాధ్యతలు అప్పగించింది పార్టీ. కానీ.. కొన్నాళ్లుగా బీజేపీలో తనకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదనే భావనలో మాజీ మంత్రి ఉన్నట్టు టాక్‌. ముందరి కాళ్లకు బంధాలేస్తున్నారనే ఫీలింగ్‌లో ఉన్నారట. బీజేపీలోని కొందరు నాయకుల వైఖరి పట్ల కినుకతో ఉన్నట్టు చెబుతున్నారు. దాంతో బీజేపీలో ఈటల రాజేందర్‌ ఇమడగలరా? అనే చర్చ జోరందుకుంది. ఈటలతోపాటు కాషాయ కండువా కప్పుకొన్న వారెవరీకి బీజేపీలో గుర్తింపు లేదని అడపాదడపా వాయిస్‌ వినిపిస్తూనే ఉంది. ఇలాంటి తరుణంలో ఈటల రాజేందర్‌ హస్తినకు వెళ్లడం.. బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో భేటీ కావడం హాట్‌ టాపిక్‌గా మారిపోయింది.ఆ మధ్య అమిత్ షా ఢిల్లీ వచ్చినప్పుడు కూడా ఈటల కలిసి మాట్లాడారట. ఆ సమయంలో ప్రస్తావనకు వచ్చిన అంశాల ఆధారంగానే ఢిల్లీకి రమ్మని షా సూచించారని.. అది గుర్తుపెట్టుకుని అపాయింట్‌మెంట్ ఇవ్వడంతో ఈటల హస్తిన వెళ్లారని తెలుస్తోంది. తెలంగాణ రాజకీయాలపై ఇద్దరూ చర్చించారని.. రాష్ట్రంపై ఢిల్లీ నాయకత్వం ఫోకస్‌ గురించి తెలిపారని బయటకు చెబుతున్నా.. లోపల జరిగిన టాక్స్‌ ఇంకోటని కాషాయ శిబిరం చెవులు కొరుక్కుంటోంది.

 

 

 

బీజేపీలో తాను చేరిన తర్వాత ఎదురైన సంఘటనలు.. అనుభవాలు.. అవమానాల గురించి ఈటల రాజేందర్‌ పూసగుచ్చినట్టు అమిత్ షాకు వెల్లడించారట. అంతా ఆలకించిన అమిత్ షా.. దిద్దుబాటు చర్యలు ఉంటాయని చెప్పినట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో ఈటలకు పార్టీ పరంగా కీలక పదవి ఇస్తారనే ప్రచారం కూడా ఊపందుకుంది. ఆ పదవి ఏంటన్నదే కాషాయ శిబిరంలో ఆసక్తి రేకెత్తిస్తోంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి ఖాళీ లేదు. అలాగే బీజేపీ ఫ్లోర్‌ లీడర్‌ పదవి ఇచ్చినా అదేమీ ఈటల స్థాయికి తగ్గ పదవి కాదనే చర్చ జరుగుతోందట. ఈటల సేవలను రాష్ట్రావ్యాప్తంగా ఉపయోగించుకునేలా పదవి ఇస్తారని అనుకుంటున్నారట. అదేంటన్నదే ఉత్కంఠగా మారింది.బీజేపీ నేతగా రాష్ట్రమంతా తిరగాలి అనుకుంటే.. ప్రచార కమిటీ ఛైర్మన్‌ పోస్ట్‌ను ఈటలకు కట్టబెట్టొచ్చని చర్చ సాగుతోంది. ఎన్నికల ముంగిట్లో ఉన్న రాష్ట్రాల్లో ఈ కమిటీని ఏర్పాటు చేస్తుంది బీజేపీ. పార్టీ సీనియర్‌ నేతను ఆ పోస్ట్‌కు ఎంపిక చేస్తారు. తెలంగాణలో ఎన్నికల వాతావరణం క్రమేపీ బలపడుతుండటంతో ప్రచార కమిటీని ప్రకటించొచ్చని.. దానిని ఈటలకు ఇస్తారని చర్చ సాగుతోంది. ఆ విధంగా ఈటల అండ్‌ కోలో నెలకొన్ని అసంతృప్తిని చల్లారుస్తారని టాక్‌. మరి.. ఈటల విషయంలో ఢిల్లీ బీజేపీ నాయకత్వం మదిలో ఏముందో చూడాలి.

 

Post Midle

Tags: Discussion on Shah’s meeting with Spears

Post Midle
Natyam ad