డీజిల్ పై ఒకేసారి రూ.75 పెంపు.. లీటరు పెట్రోల్ రూ.254

కొలంబో: ఉక్రెయిన్-రష్యా యుద్ధం అంతర్జాతీయంగా ముడిచమురు సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఫలితంగా పలు దేశాల్లో చమురు ధరలు అమాంతం పెరుగుతున్నాయి. శ్రీలంకలోని చమురు విక్రయ సంస్థ లంక ఇండియన్ ఆయిల్ కంపెనీ (ఎలస్ఐఓసీ) ఇంధన ధరలను భారీగా పెంచింది. దీంతో ఆ దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు డబుల్ సెంచరీని దాటేశాయి. లీటర్ డీజిల్ పై రూ.75(శ్రీలంక రూపాయి), పెట్రోల్పై రూ. 50 చొప్పున పెంచినట్లు ఎల్ఐఓసీ తాజాగా వెల్లడించింది. ఫలితంగా లీటరు పెట్రోల్ ధర రూ.254కు చేరగా.. డీజిల్ ధర రూ.214కు ఎగబాకింది. శ్రీలంక రూపాయి విలువ భారీగా పతనమైన నేపథ్యంలో ఎస్ఐఓసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

శ్రీలంకలో ఒకే నెలలో ఇంధన ధరలను పెంచడం ఇది మూడోసారి. తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ద్వీప దేశంలో ఇంధన ధరలు గరిష్ఠ స్థాయికి చేరడం మూలిగే నక్కపై తాటికాయ పడినట్లయ్యింది. ధరల పెంపుపై ఎల్ ఐఓసీ మేనేజింగ్ డైరెక్టర్ మనోజ్ గుప్తా స్పందించారు. శ్రీలంక రూపాయి విలువ భారీగా పతనమై డాలర్తో పోలిస్తే రూ.57కు తగ్గింది. ఈ విధంగా రూపాయి విలువ క్షీణించడం ఏడు రోజుల్లో ఇది రెండోసారి. ఇది చమురు, గ్యాసోలిన్ ఉత్పత్తుల ధరలను నేరుగా ప్రభావితం చేసింది. ఇంధన ధరల పెరుగుదలకు దారి తీసింది. దాంతో పాటు రష్యాను ఒంటరిని చేసేందుకు అమెరికా సహా ఐరోపా దేశాలు ఆంక్షలు విధించడం చమురు, గ్యాస్ ధరలు పెరుగుదలకు కారణమవుతున్నాయి’ అని ఆయన వెల్లడించారు.

శ్రీలంక సర్కారు నుంచి ఎల్ఎస్ఐఓసీ ఎలాంటి రాయితీలు పొందదని.. ఫలితంగా అంతర్జాతీయంగా చోటుచేసుకున్న పరిణామాలతో సంస్థ నష్టపోతోందని మనోజ్ పేర్కొన్నారు. ఈ నష్టాల నుంచి బయటపడాలంటే.. ఇంధన ధరలు పెంచడం తప్ప వేరే మార్గం లేదన్నారు. ధరలు పెంచినప్పటికీ.. భారీ నష్టాలు తప్పడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. శ్రీలంక చమురు సంస్థ సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్.. చమురు ధర పెంపునకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం..

Leave A Reply

Your email address will not be published.