ఓఆర్‌ పడిపోవడంతో ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది తొలగింపు

Date:26/10/2020

వ‌రంగ‌ల్  ముచ్చట్లు:

ఆర్టీసీ సమ్మె అనంతరం అధికారుల ప్రవర్తనలో వచ్చిన మార్పు కార్మికులకు సంకటంగా మారింది. కరోనా వైరస్‌తో రెండు నెలలు ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు. దాంతో కార్మికులు కష్టాల ఊబిలో కూరుకుపోయారు. సర్వీసులు తగ్గడంతో కార్మికులు స్పేర్‌ (అదనపు సిబ్బంది)గా ఉండాల్సి వచ్చింది. వారికి మస్టర్‌ ఇవ్వాల్సి ఉన్నా అధికారులు ఇవ్వకుండా లీవ్‌లో వెళ్లమనడంతో కార్మికులు తీవ్రంగా నష్టపోనున్నారు. ఇదంతా టీఎస్‌ ఆర్టీసీ వరంగల్‌ రీజియన్‌లో కార్మికుల ధైన్యస్థితి. అంతేకాదు, సర్వీసులు తిరక్క అక్యుపెన్సీ తగ్గడంతో కాంట్రాక్టు కార్మికులను తొలగించి ఆఫీస్‌ వర్క్‌ని కూడా కార్మికులతోనే చేయిస్తున్న పరిస్థితి. కోవిడ్‌ అనంతరం సర్వీసులు ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు వరంగల్‌-2 డిపోలో డ్యూటీ ఛార్ట్‌లో కార్మికులు సంతకాలు పెట్టకుండా డిపో మేనేజర్‌ అడ్డుకోవడం గమనార్హం. వరంగల్‌ ఆర్టీసీ రీజియన్‌లోని 9 డిపోల్లో 4,085 మంది కార్మికులున్నారు. 712 బస్సులుండగా, 380 అద్దెబస్సులున్నాయి. ప్రతిరోజు 7,280 ట్రిప్పులు బస్సుల ద్వారా 10 లక్షల మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చుతుంది. కోవిడ్‌తో అద్దె బస్సుల్లో 25శాతం మాత్రమే తిరుగుతున్నాయి. అంతర్రాష్ట్ర సర్వీసులు ఇంకా ప్రారంభం కాకపోవడంతో 42 సర్వీసులు, ‘వజ్ర’ 15 సర్వీసులు నడవడం లేదు.

 

 

 

దాంతో పలువురు కార్మికులు స్పేర్‌లో ఉండాల్సి వస్తోంది. ఆర్‌టీసీ నిబంధనాల ప్రకారం స్పేర్‌లో ఉంచిన కార్మికుడికి విధుల్లోకి యాజమాన్యం పంపించలేని పక్షంలో సదరు కార్మికుడికి మస్టర్‌ ఇవ్వడమో లేదా మరో డ్యూటీ ఇవ్వడమో చేయాల్సి ఉంటుంది. కానీ అధికారులు మాత్రం మస్టర్‌ సైతం ఇవ్వకపోగా కార్మికులతో బలవంతంగా లీవ్‌ పెట్టిస్తున్నారు. దాంతో కార్మికులు ఈఎల్స్‌ను కోల్పోతున్నారు. రిటైర్మెంట్‌ అనంతరం వచ్చే బెనిఫిట్స్‌ని కోల్పోవాల్సి వస్తుందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లాక్‌డౌన్‌ అనంతరం సర్వీసులు ప్రారంభమైన మే 19 నుంచి నేటి వరకు 3 రోజులు డ్యూటీలు ఇస్తే, 3 రోజులు డ్యూటీలు ఇవ్వడం లేదని, స్పేర్‌లో ఉంచినా మస్టర్‌ ఇవ్వడం లీవ్‌ మాత్రమే ఇస్తున్నారనీ కార్మికులు ఆరోపిస్తున్నారు. రాష్ట్రమంతా దాదాపు ఇదే పరిస్థితిని ఆర్‌టీసీ కార్మికులు ఎదుర్కొంటున్నారు.

 

వరంగల్‌-2 డిపోలో లాక్‌డౌన్‌ అనంతరం మే 19వ తేదీ నుంచి నేటి వరకు డ్రైవర్లు, కండక్టర్లను కోవిడ్‌ నెపంతో డ్యూటీ ఛార్ట్‌లో సంతకాలు పెట్టనివ్వకపోవడం వివాదాస్పదంగా మారింది. ఇక్కడ 500 మందికిపైగా కార్మికులున్నారు. వారంతా డ్యూటీలు చేస్తున్నా లీవ్‌ వేశారు.రీజియన్‌లో ఆక్యుపెన్సీ రేషియో పడిపోవడంతో ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందిని తొలగించి వారి స్థానంలో కార్మికులతోనే ప్రస్తుతం పనిచేయిస్తున్నారు. 12 మంది టైపిస్టులు, 27 మంది పార్కింగ్‌ డ్రైవర్లు, ఆయిల్‌ బంకుల్లో 39 మంది, కార్గోలో 75 మంది, సెక్యూరిటీ, గ్యారేజీల్లో ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందిని తొలగించి వారి స్థానంలో ఉన్న కార్మికులతో నియమించి పనులు చేయిస్తున్నారు. కోవిడ్‌ నేపథ్యంలో ఆర్టీసీ సర్వీసులు తగ్గడంతో ఆక్యుపెన్సీ రేషియో గణనీయంగా తగ్గింది. 712 ఆర్టీసీ బస్సులతోపాటు అద్దె బస్సుల్లో కేవలం 25 శాతం అంటే 90 బస్సులను మాత్రమే నడుపుతున్నారు.

ఆసుపత్రి కంటే ఇల్లే పదిలం.. ముఖం చాటేస్తున్న రోగులు

Tags: Dismissal of outsourcing staff with OR drop

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *