వివాదాల..బాలినేని

ఒంగోలు  ముచ్చట్లు:


బాలినేని శ్రీనివాసరెడ్డి. ఇటీవల ఆయనేం మాట్లాడినా సంచలనంగా మారుతోంది. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. రెండుసార్లు మంత్రిగా చేసి్న ఆయనకు.. ఈ ఇరువై ఏళ్ల రాజకీయ ప్రస్ధానంలో ఎన్నడూ లేనంతగా వివాదాలు వెంటాడుతున్నాయి. వైఎస్‌ ఆశీర్వాదంతో రాజకీయాల్లోకి వచ్చిన బాలినేని.. ఆయనకు బంధువు కూడా. గతంలో బాలినేని మాట పెద్దగా వినిపించేది కాదు. ఇప్పుడు మాత్రం ఒక వివాదం నుంచి బయటకు వచ్చేలోపు ఇంకో వివాదం ముసురుతోంది. వాటికి వివరణలు ఇచ్చుకోవడానికే సమయం కేటాయించాల్సి వస్తోందని బాలినేని శిబిరం ఆందోళన చెందుతోందట.ప్రతిపక్ష పార్టీతోపాటు స్వపక్షంలోని అసమ్మతి వాదులకు బాలినేనే టార్గెట్‌ అవుతున్నారు. అనుచరుల వల్ల కొన్ని చిక్కులు వస్తే.. కొన్ని సార్లు ఆయన మాటలే రివర్స్‌ కొడుతున్నాయి. వైసీపీ కేబినెట్‌ పునర్‌వ్యవస్థీకరణలో వందశాతం మార్పులు ఉంటాయని ముందుగా బాంబు పేల్చింది ఆయనే. చికోటి ప్రవీణ్‌ వ్యవహారంలో బాలినేని పేరు మార్మోగింది. దాంతో తాను క్యాసినోకు వెళ్తానని.. స్నేహితులతో పేకాట ఆడతానని సూటిగా సుత్తిలేకుండా చెప్పేశారు. అయితే ఈ మధ్య తనతోపాటు తన కుమారుడు ప్రణీత్‌రెడ్డిని కూడా రాజకీయంగా టార్గెట్‌ చేయడంపై అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు బాలినేని. సొంత పార్టీ వాళ్లే తనపై కుట్ర చేస్తున్నారని.. తనదైన శైలిలో వార్నింగ్‌ ఇచ్చారు మాజీ మంత్రి.

 

 

 

తాజాగా ఒంగోలులో బార్‌ లైసెన్సుల అంశంలో బాలినేనితోపాటు ఆయన కుమారుడు ప్రణీత్‌రెడ్డి చక్రం తిప్పారని ఆరోపణలు వచ్చాయి. ఒంగోలు నగరంలోని 15 బార్లకు పోటీదారులు లేకపోవడం.. తక్కువ ప్రైస్‌కే టెండర్లు వేయడం వెనక వారి పాత్ర ఉందని జనసేన ఆరోపణలు చేసింది. దీంతో మళ్లీ ఫైర్‌ అయ్యారు మాజీ మంత్రి. రాజకీయంగా తనను ఎదుర్కోలేకే.. ప్రణీత్‌రెడ్డిని రోడ్డుపైకి లాగుతున్నారని మండిపడ్డారు. ఈ అంశంపై పవన్‌ కల్యాణ్‌ స్వయంగా విచారణ చేసుకోవచ్చని సవాల్‌ విసిరారు బాలినేని. ఇక్కడితో ఆగకుండా ఒంగోలులో బార్‌ లైసెన్సులు రద్దు చేయాలని నేరుగా సీఎంకే చెబుతానన్నారు. దాంతో బార్‌ లైసెన్సు పొందిన సిండికేట్‌ మెంబర్లకు టెన్షన్‌ మొదలైందట.లిక్కర్‌ సిండికేట్‌లో వైసీపీ, టీడీపీ నేతలు ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. లైసెన్సుల సమస్యను లౌక్యంగా పరిష్కరించారని వ్యాపారులు సంబర పడుతున్నారు. కానీ.. జనసేన నేతల ఆరోపణలు.. దానికి బాలినేని కౌంటర్‌ చూశాక సీన్‌ మారిపోయిందట. సిండికేట్‌ తీరుపై బాలినేని సైతం గుర్రుగా ఉన్నట్టు సమాచారం. అవసరమైతే మరోసారి బార్ల లైసెన్సులకు టెండర్ల పిలిచేలా బాలినేని అడుగులు ఉన్నట్టు అనుమానిస్తున్నారు వ్యాపారులు. ఆయన్ని ఎలా బుజ్జగించాలో.. ఏ విధంగా సర్దిచెప్పాలో వ్యాపారులకు అర్థం కావడం లేదట. మొత్తం మీద వరస వివాదాలు.. విమర్శలు బాలినేనిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయని టాక్‌. వైరిపక్షానికి స్వయంగా ఆయనే వార్నింగ్‌ ఇచ్చినా పరిస్థితిలో మార్పు రావడం లేదనే వాదన ఉంది. అందుకే మాజీ మంత్రిని రాజకీయంగా టార్గెట్ చేస్తోంది ఎవరు? దానివల్ల వారికి వచ్చే లాభం ఏంటి అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరి.. బాలినేని ఎప్పటిలా రెండు రోజుల తర్వాత కూల్‌ అవుతారో.. లేక తెగేవరకు సమస్యను ముందుకు తీసుకెళ్తారో చూడాలి.

 

Tags: Disputes..Balineni

Leave A Reply

Your email address will not be published.