Natyam ad

ఆర్కేకు అసమ్మతి సెగ

గుంటూరు ముచ్చట్లు:

ఊహించని అసమ్మతి సెగ అక్కడ అధికారపార్టీ ఎమ్మెల్యేను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. వలస నాయకులు ఏకు మేకులా మారితే.. ఇప్పుడు సొంత పార్టీ నాయకులే ముచ్చెమటలు పట్టిస్తున్నారు. దీంతో ఆయన ముందు జాగ్రత్త పడుతున్నారనే వాదనా ఉంది.ఆళ్ల రామకృష్ణారెడ్డి. మంగళగిరి నుంచి వరసగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అలాంటిది కొన్ని నెలలుగా ఆళ్లకు పార్టీలోనూ.. మంగళగిరిలోనూ పట్టు సడలుతుందనే ప్రచారం ఉంది. వైసీపీ నేతల నుంచే విమర్శలు ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది. సమస్యలను సర్దుబాటు చేసుకునే దిశగా చర్యలు చేపట్టలేదు. దాంతో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మంగళగిరిలోనే అసమ్మతి నేతలు సమావేశం పెట్టుకునే వరకు వ్యవహారం వెళ్లింది. ఆ భేటీ పార్టీ వర్గాల్లోనూ.. నియోజకవర్గం వైసీపీ శ్రేణుల్లోనూ కలకలం రేపుతోంది.అసమ్మతి నేతల సమావేశం తర్వాత మంగళగిరిలో ఆర్కేకు ప్రత్యామ్నాయం ఎవరనే చర్చ కూడా మొదలైంది. రెండుసార్లు ఎమ్మెల్యేగా చేసిన వారికి ప్రజల్లో అసమ్మతి ఉండటం సహజమైనా.. ఇక్కడ మాత్రం సొంత పార్టీలోని పార్టీకి అనుకూలమైన సామాజికవర్గం నుంచే ఆర్కేపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నియోజకవర్గాన్ని.. తాడేపల్లి ప్రాంతాన్ని అభివృద్ధికి దూరంగా పెట్టారని ఎమ్మెల్యేపై కస్సుమంటున్నారు నాయకులు. పైగా అసమ్మతి సమావేశానికి పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు హాజరయ్యారు. రాబోయే రోజుల్లో ఆర్కేను అడ్డుకోవాలని ఏకంగా తీర్మానమే చేశారట. వైసీపీ అధిష్ఠానానికి చెప్పి అభ్యర్థిని మార్పించే యోచనలో వైసీపీ కేడర్‌, లీడరర్స్‌ ఉన్నట్టు తెలుస్తోంది.మంగళగిరిలో వ్యతిరేకత వస్తున్న తరుణంలో పల్నాడులోని ఓ నియోజకవర్గానికి షిఫ్ట్‌ అయ్యే ఆలోచనలో ఆర్కే ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

 

 

 

 

ఆ విషయం తెలుసుకున్న స్థానిక వైసీపీ నాయకులు కర్చీఫ్‌ వేసేందుకు రెడీ అయ్యారు. ఆర్కేకు తామే ప్రత్యామ్నాయం అని ప్రచారం చేసుకుంటున్నారట. మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు ఇప్పటికే వైసీపీలో చేరి ఎమ్మెల్సీ అయ్యారు. ఆయన కుటుంబంలో మరొకరికి ఎమ్మెల్యే సీటు ఇస్తారనే వాదన ఉంది. ఈ మధ్య వైసీపీలో చేరిన గంజి చిరంజీవి సైతం టికెట్‌ ఆశిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో అసమ్మతి సమావేశం నిర్వహించడం మంగళగిరి రాజకీయాలను మరో లెవల్‌కు తీసుకెళ్లాయి.ఆర్కే అంశాన్ని ఏకంగా వైసీపీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లే యోచనలో ఉన్నారట అసమ్మతి నేతలు. తాడేపల్లి మండంలోని పార్టీ నేతలను ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని.. పనులు జరగడం లేదని.. నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాలనే అభివృద్ధి చేస్తున్నారని మండిపడుతున్నారట. ఎన్నికల్లో వైసీపీని గెలిపించిన వారిని విస్మరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు అసమ్మతి నేతలు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో జరుగుతున్న పనులను.. వాటిల్లో చూపెడుతున్న వ్యత్యాసాలపై గరంగరంగా ఉన్నారట. ముఖ్యంగా టీడీపీ పట్ల ఆయన వైఖరి జీర్ణించుకోలేకపోతున్నట్టు కొందరి వాదన. ఇప్పటం ఎపిసోడ్‌లోనూ పెదవి విప్పలేదని గుర్తు చేస్తున్నారు. మరి.. నేతల అసమ్మతి నియోజకవర్గంలో ఒక్క ప్రాంతానికే పరిమితం అవుతుందో.. మరింత విస్తరిస్తుందో చూడాలి.

 

Post Midle

Tags: Dissent to RK Sec

Post Midle