30 శాతం పూర్తి కాని పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ

Date:17/03/2018
నల్గొండ ముచ్చట్లు:
 రాష్ట్రంలో కొత్తగా అత్యంత భద్రత ప్రమాణాలు కలిగిన పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా భూ యజమానుల ఆధార్‌ సంఖ్య, ఫొటో, చరవాణి సంఖ్య, బ్యాంకు ఖాతాలను ఎల్‌ఆర్‌యూపీలో నమోదు చేయాలని సూచించింది. వీటిని గ్రామస్థాయిలోని రెవెన్యూ సిబ్బందికి అందజేయాలని పేర్కొంది. కొత్త పాసుపుస్తకాలు ముద్రణకు తహసిల్దార్‌ డిజిటల్‌ సంతకాన్ని అనుసంధించాల్సి రావడంతో ఈ ప్రక్రియ ఉమ్మడి జిల్లాలో నెమ్మదిగా సాగుతోంది. దీనిని ముగిస్తేనే సదరు ఖాతా సంఖ్యలను ముద్రణకు పంపుతారు. దీని ఆధారంగానే రైతులకు పెట్టుబడి రాయితీలను చెక్కుల రూపంలో అందిస్తారు. నల్గొండలో 2,77524 ఖాతాలకు చెందిన 1.06లక్షల, యాదాద్రిలో 72,734 ఖాతాల 2.14 లక్షల, సూర్యాపేటలో 73,866 ఖాతాల 1.81లక్షల ఎకరాలకు డిజిటల్‌ సంతకాల అనుసంధానం పూర్తయింది. ఈ ప్రక్రియ పూర్తయితేనే కొత్త పట్టాదారు పాసు పుస్తకాల ముద్రణ సాధ్యమవుతుంది. అన్ని పూర్తయిన ఖాతాలకు తహసీల్దార్ల డిజిటల్‌ సంతకాలు అనుసంధానం చేయాల్సి ఉంటుంది. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ కార్యక్రమం నెమ్మదిగా సాగుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 70 తహసీల్దార్‌ కార్యాలయాలు, నల్గొండ, భువనగిరి, సూర్యాపేట కలెక్టరేట్‌లలో ఏర్పాటుచేసిన ప్రత్యేక కేంద్రాల్లో ఈ ప్రక్రియ సాగుతోంది. ఇందుకోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించారు. వారితో భూదస్త్రాలకు ఆధార్‌, చరవాణి, బ్యాంకు ఖాతా సంఖ్య అనుసంధానిస్తున్నారు. క్షేత్రస్థాయిలో భూదస్త్రాల ప్రక్షాళన గతేడాది డిసెంబర్‌ చివరికే ముగిసింది. వెంటనే ఆధార్‌ సీడింగ్‌ ప్రక్రియను చేపట్టారు. ఇది ప్రారంభమై రెండున్నర నెలలు గడుస్తోంది. రాష్ట్రంలో జగిత్యాల జిల్లా 90.16 శాతంతో మొదటి స్థానంలో, 44.82 శాతంతో మేడ్చల్‌ చివరి స్థానంలో ఉంది. విభాజ్య నల్గొండ (76.84 శాతం) 11వ, యాదాద్రి(80శాతం) 13వ, సూర్యాపేట(76శాతం) 16వ స్థానాల్లో ఉన్నాయి. చరవాణి సంఖ్య అనుసంధానం నల్గొండలో 55.3శాతం, యాదాద్రిలో 56.16శాతం, సూర్యాపేటలో 49.36 శాతమే పూర్తయింది. ప్రస్తుతానికి బ్యాంకు ఖాతా సంఖ్యలు అందుబాటులో ఉన్నవాటిని మాత్రమే నమోదు చేస్తున్నారు.మార్చి 11 నుంచే కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. గడువు ముగిసినా రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా పంపిణీ ప్రారంభం కాలేదు. పాసుపుస్తకాల ముద్రణలో జాప్యం కారణమని అధికారులు తెలిపారు. ఇదేకాక ఆధార్‌ సంఖ్య అనుసంధానంలో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. క్షేత్రస్థాయిలో ఆధార్‌ సంఖ్యల సేకరణలోనూ ఆలస్యమవుతుంది. ఇప్పటికే చాలా మంది ఆధార్‌ నకళ్లను అందజేసినా బినామీలుగా ఉన్నవారు ముందుకు రావడం లేదు. పాసుపుస్తకాలపై రైతుల ఛాయాచిత్రాలు ముద్రించేందుకు ఆధార్‌ డాటా నుంచి సేకరిస్తున్న 40 శాతం చిత్రాల్లో స్పష్టత ఉండటం లేదు. దీంతో మరోసారి ఫొటో స్కాన్‌ చేయాల్సి వస్తోంది. దీనికి సమయం ఎక్కువ అవసరం అవుతున్నట్లు ఆపరేటర్లు వాపోతున్నారు.
Tags: Distribution of non-graduate pass books by 30 percent

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *