నిఘా మధ్యలోనే విత్తనాల పంపిణీ

ఖమ్మం ముచ్చట్లు :

 

ఖరీఫ్ లో ప్రతి విత్తుకు లెక్కలు సిద్ధం చేస్తున్నారు. రాయితీ విత్తనాల ధర తక్కువగా ఉంటుంది. వీటికి బహిరంగ మార్కెట్‌లో ఎక్కువ డిమాండ్‌ ఉంది. దీంతో చాలా మంది అవసరం లేకున్నా అన్నదాతల పేరిట సంచులు కొనుగోలు చేస్తుంటారు. వాటిని బహిరంగ విపణిలో ఎక్కువ ధరకు విక్రయిస్తుంటారు. వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో గతంలో పంపిణీ ఏజెన్సీల ద్వారా జరిగేది. జవాబుదారీతనం ఉండాలనే ఉద్దేశంతో సహకార కేంద్రాల ద్వారా పంపిణీకి ఆదేశాలు జారీ చేశారు. గ్రామాలలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కార్యాలయాలతో పాటు తెలంగాణ సీడ్స్‌, మన గ్రోమోర్‌ కేంద్రాల్లో ఇస్తారు. ఒక్కొక్క వ్యవసాయ విస్తరణాధికారి పరిధిలో నాలుగైదు గ్రామాలుంటాయి. ఆయా గ్రామాల రైతులు ఏఈవో దగ్గర కూపన్‌ పొంది సమీపంలోని సహకార కేంద్రం, తెలంగాణ సీడ్స్‌, మనగ్రోమోర్‌ కేంద్రాల నుంచి విత్తనాలు పొందాల్సి ఉంటుంది.ఈ విషయం రాష్ట్ర వ్యవసాయాధికారుల దృష్టికి వచ్చింది. పంపిణీలో జరిగే అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయించారు. గత యాసంగిలో ప్రయోగాత్మకంగా ఆన్‌లైన్‌ విధానాన్ని అమల్లోకి తెచ్చారు.

ఈ విధానం సత్ఫలితాలు ఇచ్చింది. దీని వల్ల  ప్రతి విత్తుకూ లెక్క ఉంటుంది.  వ్యవసాయశాఖ విస్తరణాధికారులకు ప్రత్యేకంగా ట్యాబ్‌లు అందించారు. ఖరీఫ్‌లో సాగు చేసే పంటలకు అవసరమైన రాయితీ విత్తనాలను ఆన్‌లైన్‌ విధానంలోనే ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా గ్రామాలలోనే పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అక్కడక్కడ వర్షాలు కురుస్తుండటంతో సాగు పనుల్లో అన్నదాతలు నిమగ్నమయ్యారు. ఈ సీజన్‌లో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 6.50 లక్షల హెక్టార్లలో పంటలను సాగు చేస్తారని అధికారులు ప్రతిపాదించారు. అందుకు అనుగుణంగా రాయితీ విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచారు.వరి, కంది, మినుములు, వేరు శెనగలు, మొక్కజొన్న రాయితీ విత్తన కూపన్లు పొందిన రైతులు 24 గంటల్లో తీసుకోవాలి. మరుసటి రోజుకు ఆ కూపన్లు చెల్లవు. ఆలస్యమైతే వ్యవసాయ విస్తరణాధికారి దగ్గరికి వెళ్లి మళ్లీ కూపన్‌ పొందాల్సి ఉంటుంది. గత సంవత్సరం వరకు సాగుభూమితో సంబంధం లేకుండా ఇష్టానుసారంగా కూపన్లు జారీ చేసేవారు. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు.. వారు చెప్పిన మేరకు కూపన్లు ఇచ్చేవారు. గతంలో మండల కేంద్రంలోని వ్యవసాయాధికారి కార్యాలయంలో తీసుకునేవారు. అందరూ మండల కేంద్రాలకు రావడానికి ఇబ్బందులు పడేవారు. దూరాభారంతో పాటు వెళ్లిన సమయంలో అధికారి లేకుంటే కూపన్లు తీసుకోవడానికి రోజంతా నిరీక్షించాల్సి వచ్చేది.

 

ఈసారి నుంచి గ్రామాల్లోనే ఇవ్వనున్నారు. వ్యవసాయ విస్తరణ అధికారులు అందుబాటులో ఉంటారు. వారి వద్ద ఉండే ట్యాబ్‌ల ద్వారా కూపన్లను జారీ చేస్తున్నారు.రైతులు తప్పకుండా పట్టాదారు పాసుపుస్తకం, బ్యాంకు ఖాతా నంబర్‌, ఆధార్‌కార్డు జిరాక్స్‌లు తీసుకెళ్లాలి. వాటిని పరిశీలించిన అధికారులు.. ప్రత్యేకంగా రూపొందించిన వెబ్‌సైట్‌లో వివరాలను నమోదు చేస్తారు. దీంతో ఆ రైతుకు సంబంధించిన భూమి వివరాలు, సర్వే నంబర్‌, గత ఏడాది వేసిన పంట తదితర వివరాలు వెల్లడవుతాయి. రైతుకు ఉన్న భూమికి అవసరమైన మేరకే విత్తన సంచులను ఆన్‌లైన్‌లో నమోదు చేసి కూపన్‌ నెంబర్‌ జారీ చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తికాగానే రైతు సెల్ ఫోన్ కి కూపన్‌ నెంబర్‌ వస్తుంది. ఆ నంబర్‌ విత్తన కేంద్రంలో చూపించి, రాయితీ పోను మిగత డబ్బులు చెల్లిస్తే వెంటనే విత్తనాలు ఇస్తారు. ఒకసారి కూపన్‌ పొందిన వారు మళ్లీ తీసుకోవడానికి వీలుండదు. ఏ మండలం, ఏయే గ్రామాల్లో ఎంత మంది రైతులు విత్తనాలు పొందారు , ఇంకా ఎంత మేరకు నిల్వలు ఉన్నాయనే వివరాలు ప్రతి రోజు సాయంత్రం జిల్లా, రాష్ట్ర వ్యవసాయశాఖ ఉన్నతాధికారులకు ఆన్‌లైన్‌లో పంపిస్తారు.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags:Distribution of seeds in the middle of surveillance

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *