అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి ఘన నివాళి అర్పించిన జిల్లా కలెక్టర్
తిరుపతి,]ముచ్చట్లు:
అమర జీవి పొట్టి శ్రీరాములు ఒక గొప్ప త్యాగ మూర్తి, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆద్యుడు మహనీయుడు అని జిల్లా కలెక్టర్ కే వెంకట రమణారెడ్డి అన్నారు.

గురువారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి చిత్రపటానికి జే సి డికే బాలాజీ తో కలిసి పుష్పాంజలి ఘటించారు. అనంతరం మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు 1901 మార్చి 16 న జన్మించి 1952 డిసెంబరు 15న అమరులయ్యారని అన్నారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించి, అమరజీవి యైన మహాపురుషుడని ఆయన త్యాగ ఫలితమే ఆంధ్ర రాష్ట్రం 1956 నవంబర్1 న ఏర్పడిందని అన్నారు. పొట్టి శ్రీరాములు 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుశిక్ష అనుభవించాడని, తర్వాత మళ్ళీ 1941-42 సంవత్సర కాలంలో సత్యాగ్రహాలు, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొనడం వల్ల మూడుసార్లు జైలుశిక్ష అనుభవించాడని అన్నారు
ఆంధ్రులకు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణ భూతుడైనవారని, మహాత్మా గాంధీ బోధించిన సత్యము, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాలకొరకు జీవితాంతం కృషిచేసిన మహనీయుడని కొనియాడారు. ఈ మహనీయుని జ్ఞాపకార్థం రాష్ట్ర ప్రభుత్వం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం స్థాపించిందని, నెల్లూరు జిల్లా పేరును 2008లో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా మార్చారని, అమరజీవి పొట్టి శ్రీరాములు గారి గౌరవార్దం తపాల శాఖ వారు 2000 మార్చి 16 లో ఒక ప్రత్యేక తపాల బిళ్ళను విడుదల చేసారని, మహనీయుల జయంతి వర్ధంతి కార్యక్రమాల ద్వారా వారి జీవిత విశేషాల నుండి స్ఫూర్తి పొంది యువత సన్మార్గంలో దేశ భక్తితో మెలగాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా బిసి సంక్షేమ మరియు సాధికార ఇన్చార్జి అధికారి భాస్కర్ రెడ్డి, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి బాలకొండయ్య, కలెక్టరేట్ ఏవో జయరాములు వివిధ శాఖల సిబ్బంది అధికారులు పాల్గొన్నారు.
Tags;District Collector paid tribute to Amarjeevi Potti Sriramulu
