-జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి
Date:26/11/2020
నిజామాబాద్ ముచ్చట్లు:
సాగులో యంత్రాల ఉపయోగం, ఖర్చు తగ్గించుకోవడం, దిగుబడి పెంచుకోవడంపై రైతులకు జిల్లా స్థాయిలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి తెలిపారు.
గురువారం తన చాంబర్లో వ్యవసాయ అధికారులు, కంపెనీల ప్రతినిధులు, శాస్త్రవేత్తలతో అవగాహన కార్యక్రమం ఏర్పాటు, చేపట్టవలసిన చర్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ముఖ్యమైన వ్యవసాయ పనులు నిర్వహించుకునే సమయంలో రైతులకు నాటు వేయడం, కలుపు తీయడం, పంటలు కోయడం తదితర విషయాలు, కూలీల సమస్య, ఇతర సమస్యలను కూడా ఎదుర్కొంటున్నారని దానిని నివారించడానికి యాంత్రీకరణ ఎంతైనా తప్పనిసరి అవసరంగా గుర్తించడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా ఈ పనులకు సంబంధిత యంత్రాలను తయారుచేసిన కంపెనీల ప్రతినిధులను, యంత్రాలను రప్పించి వాటి పనితీరు పై రైతులకు జిల్లా స్థాయిలో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమం వచ్చే నెలలో ఏర్పాటు చేయడానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని తెలిపారు.
ఇందులో భాగంగా యంత్రాల ఉపయోగం వల్ల సమాన లైన్లలో నాట్లు వేయడం ద్వారా పంట దిగుబడి కూడా పెరుగుతుందని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారని, ముందు ముందు వ్యవసాయ పనులకు కూలీల కొరతను దృష్టిలో పెట్టుకొని మరియు పెరిగిన కూలి రేట్లకు బదులుగా అంతకంటే తక్కువ ఖర్చుతోనే యంత్రాలతో వ్యవసాయ పనులు చేసుకోవడం ద్వారా రైతులకు సమయం, కూలి ఖర్చులు ఆదా కావడంతోపాటు అధిక దిగుబడి కూడా వస్తుందని తెలిపారు. ఈ యంత్రాల కొనుగోలుకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
యాంత్రీకరణ తోపాటు రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్తల చేత పంట దిగుబడి పెంచుకోవడానికి, నాణ్యమైన పంటను సాధించడానికి తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించడంతోపాటు పెట్టుబడి ఖర్చులు తగ్గించుకోవడానికి, క్రిమిసంహారక, రసాయన ఎరువుల వాడకం పై కూడా రైతులకు నేరుగా వివరించనున్నామని కలెక్టర్ తెలిపారు.ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి గోవిందు, వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ బాలాజీ నాయక్, డాక్టర్ నవీన్, కంపెనీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Tags: District level awareness for farmers on mechanization