– ఆపదలో ఉన్నవారు.. సహాయం కోరేవారు.. మాత్రమే పోలీస్ స్టేషన్కు వస్తారు.. వారి నమ్మకాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత మనదే.
– విజిబుల్ పోలీసింగ్ ద్వారా ఎన్ఫోర్స్మెంట్ విధులను పెంచాలి.
– చంద్రగిరి నియోజకవర్గం చాలా సున్నితమైన ప్రాంతం.. సార్వత్రిక ఎన్నికలు-2024 దృష్ట్యా పాత నేరస్తులు బైండోవర్.
– భాకరాపేట ఘాట్ రోడ్డు లో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ అమలు.
– చిత్తూరు-తిరుపతి హైవే రహదారి వెంబడి డాబాలు, హోటళ్ల వద్ద వాహనాలు హైవే రహదారిపై నిలపకుండా ఉండేందుకు కఠిన చర్యలు.
– క్రమశిక్షణతో విధులు నిర్వర్తిస్తూ, ప్రజలతో ఆత్మీయంగా మాట్లాడి సమస్యలకు పరిష్కార మార్గం.
– గ్రామాల యందు వీపీఓ (విలేజ్ పోలీస్ ఆఫీసర్) ల ద్వారా గ్రూపు తగాదాలు ఏర్పడకుండా తక్షణ పరిష్కారం.
జిల్లా ఎస్పీ మలిక గర్గ్ ఐపీఎస్.,
తిరుపతి ముచ్చట్లు:
తిరుపతి జిల్లా ఎస్పీ గా బాధ్యతలు తీసుకున్న మలిక గర్గ్ ఐపీఎస్.సమర్థవంతంగా సార్వత్రిక ఎన్నికలు-2024 నిర్వహణ ధ్యేయంగా నిత్యం క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలిస్తూ తన కార్యాచరణను అమలు చేస్తున్నారు. అందులో భాగంగా గురువారం నాడు జిల్లా ఎస్పీ మలిక గర్గ్ ఐపీఎస్., తిరుపతి జిల్లా, చంద్రగిరి సబ్ డివిజన్, చంద్రగిరి పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసి పోలీస్ స్టేషన్ పరిసరాలు, వివిధ గదులను పరిశీలించారు. అనంతరం ఎస్.హెచ్.ఓ. మరియు స్టేషన్ సిబ్బంది యొక్క పనితీరును సమీక్షించి జనరల్ డైరీ, కేసు డైరీ, కోర్టు క్యాలెండర్ వంటి పలు రికార్డులను తనిఖీ చేసి పరిశీలించారు.పోలీస్ స్టేషన్ నందు పెండింగ్లో ఉన్న కేసులను సకాలంలో దర్యాప్తు చేయుటకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి బాధితులకు సరైన న్యాయం చేయాలనీ, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, మహిళా సంబంధిత నేరాల పట్ల వెంటనే స్పందించి న్యాయం చేయాలన్నారు. చంద్రగిరి పోలీస్ స్టేషన్ పరిధి గుండా ప్రధాన జాతీయ రహదారులు వెళుతున్నందున నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా రంగంపేట-భాకరాపేట ఘాట్ రోడ్డు జాతీయ రహదారి (NH-71) మార్గం నందు ప్రమాదకరమైన మలుపులు, రోడ్ క్రాసింగ్ లను గుర్తించి అక్కడ సూచిక బోర్డులు, వార్నింగ్ సిగ్నల్ వ్యవస్థ, స్టాపర్లు ఏర్పాటు చేసి రోడ్డు ప్రమాదాల నివారణ కొరకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలి. అలాగే గాదంకి టోల్ ప్లాజా, రంగంపేట చెక్ పోస్ట్ వద్ద ఆకస్మికంగా వాహనాల తనిఖీలను నిర్వహించి, ఎర్ర చందనం, మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికడుతూ, హైవే పెట్రోలింగ్ వాహనాలు నిరంతరం రహదారుల యందు తిరుగుతూ నేరాలు జరగకుండా నివారించాలన్నారు.
బహిరంగ ప్రదేశాల యందు మద్యపానం సేవించకుండా అరికట్టడానికి ప్రత్యేక భద్రతా దళాలతో పెట్రోలింగ్ చేయాలి. చంద్రగిరి కోట గ్రామం, శ్రీనివాస మంగాపురం, శ్రీవారి మెట్లు మార్గం, తొండవాడ పరిసర ప్రాంతాల నుండి హైవే రహదారుల వరకు నిరంతరం గస్తీ కాచుటకు బ్లూ colts, బీట్ సిస్టంను బలోపేతం చేసి, మరింత సమర్థవంతంగా పనిచేసి నేర నివారణ చేయాలని ఆదేశించారు. స్టేషన్ పరిధిలో ఉన్న కేడీలు, బీసీలు, డిసీలు, పాత నేరస్తులు, అనుమానితుల కదలికలపై ప్రత్యేకమైన నిఘా ఉంచుతూ, సాంప్రదాయకమైన వేగు వ్యవస్థను బలోపేతం చేసుకుని, రానున్న సార్వత్రిక ఎన్నికలకు ఎప్పుడు సిద్ధంగా ఉండాలన్నారు. ఇప్పటివరకు బైండోవర్ చేసిన వారి వివరాలను తనిఖీ చేసి, ఇంకా ఎవరైనా తప్పిపోయి ఉంటే వారిని కూడా బైండోవర్ చేయాలన్నారు. పోలీస్ స్టేషన్ కి వచ్చే ఫిర్యాదుదారుల యొక్క ఫిర్యాదులను స్వీకరించి చిన్న సమస్య గా ఉన్నప్పుడే ఇరుపక్షాలను పిలిపించి, వారితో మాట్లాడి, వారిని రాజీ చేయించి, ఎటువంటి నేరం జరగకుండా నివారణ చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా గ్రామాల నుండి వచ్చే ప్రతి సమస్యను సమగ్రంగా విచారించి, గ్రూపు తగాదాలు జరగకుండా సామరస్యంగా పరిష్కార మార్గం చూపాలన్నారు.
పోలీస్ స్టేషన్ సిబ్బందితో సమావేశమై వారి సాధకబాధకాలను అడిగి తెలుసుకొని సిబ్బందితో మాట్లాడుతూ విధి నిర్వహణలో క్రమశిక్షణ తో నడుచుకుంటూ అలసత్వం ప్రదర్శించకుండా, ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా, మానవతా దృక్పథంతో ఉండి, స్టేషన్ కు వచ్చే బాధితులతో మర్యాదగా ప్రవర్తిస్తూ వారికి మేమున్నామనే ధైర్యాన్ని ఇచ్చి ఫిర్యాదుదారులకు భరోసా ను కల్పించాలన్నారు. పోలీస్ స్టేషన్ విలేజ్ పోలీస్ ఆఫీసర్ (V.P.O.)లు మరియు మహిళా సిబ్బంది నేటి సమాజంలో గృహ నిర్బంధ మహిళా సంబంధిత విషయాలను, బాలికలు ఎదుర్కొంటున్న ఈవ్ టీజింగ్, గుడ్ టచ్-బ్యాడ్ టచ్ మరియు పోక్సో చట్టం, సైబర్ నేరాలు వంటి విషయాల గురించి సంబంధిత విద్యా సంస్థల యందు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి చైతన్యవంతులను చేసి, కళాశాల, పాఠశాలల్లో బాలికల పట్ల ఉపాధ్యాయుల అసభ్య ప్రవర్తన గురించి విద్యార్థులతో మాట్లాడి తెలుసుకొని ఏదైనా అనుకోని సంఘటనలు జరిగి ఉంటే తమ ఎస్.హెచ్.ఓ. కి తెలియపరచాలని V.P.O. లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి డిఎస్పి శరత్ రాజ్ కుమార్, చంద్రగిరి సీఐ రామయ్య, ఎస్ఐలు మరియు చంద్రగిరి పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
Tags:District SP Malika Garg IPS, who made a surprise inspection of the Chandragiri police station.