తెలంగాణ నేతల్లో కలవరం

Disturbing Telangana leaders
Date:13/07/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
తెలంగాణలో మరోసారి అధికారంలోకి రావాలనుకుంటోంది తెలంగాణ రాష్ట్ర సమితి. అందుకోసం ఎప్పటి నుంచో ప్రణాళికలు రూపొందించుకుంటోంది. గత ఎన్నికల సమయానికీ, ఇప్పటికీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోయాయి. టీడీపీ సంగతి పక్కన పెడితే.. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ బాగా బలపడింది. అంతేకాదు అంతకుముందు ఎన్నికల్లో కేసీఆర్తో కలిసి ఉన్న ప్రొఫెసర్ కోదండరాం పార్టీని ఏర్పాటు చేయడంతో, అప్పటి వరకు ధీమాగా ఉన్న టీఆర్ఎస్లో కలవరం మొదలైంది. దీంతో మరోసారి ‘ఆపరేషన్ ఆకర్ష్’ను ప్రయోగించాలని ఆ పార్టీ డిసైడ్ అయిపోయింది. అనుకున్నట్లుగానే కాంగ్రెస్, బీజేపీల్లోని కీలక నేతలను తమ పార్టీలోకి లాక్కోగలుగుతున్నారు.2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రాజకీయ పునరేకీకరణ పేరుతో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, ఇతర పార్టీల నుంచి వివిధ స్థాయిల నేతలను తమ పార్టీలోకి ఆహ్వానించారు. వీరిలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయి నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు ఉన్నారు. దీంతో గులాబీ గూటిలో హౌస్ఫుల్ అయిపోయింది. ఈ చేరికల వల్ల మిగిలిన స్థానాల సంగతి ఎలా ఉన్నప్పటికీ టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలున్న చోట మాత్రం పార్టీ అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది. దీనిని గమనించిన కేసీఆర్.. కొందరికి నామినేటెడ్ పదవులు ఇచ్చి, మరికొందరికి మంచి అవకాశాలు కల్పిస్తామని హామీలు ఇచ్చారు.అయితే, అవకాశం రాని వారు మాత్రం వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఆశిస్తున్నారు. దీంతో ఆయా స్థానాల్లో ఒక్కో అసెంబ్లీ సీటు కోసం ఇద్దరు, ముగ్గురు పోటీ పడడం.. ఒకరి గురించి మరొకరు చెడుగా ప్రచారం చేసుకోవడం వంటివి చేస్తున్నారు. నేతల చర్యల వల్ల కేసీఆర్కు కొత్త తలనొప్పి మొదలైందట. విభజన సమయంలో తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెంచే అవకాశం ఉందని ప్రచారం జరగడంతోనే కేసీఆర్ ఇతర పార్టీల నేతలను తమ పార్టీలో చేర్చుకున్నాడు. తీరా ఇప్పుడు అసెంబ్లీ సీట్ల పెంపు లేదని కేంద్రం తేల్చి చెప్పడంతో వచ్చే ఎన్నికల్లో ఏం చేయాలి అనే దానిపై కేసీఆర్ మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం. మరి ఆయన ఈ గండం నుంచి ఎలా గట్టెక్కుతారో చూడాలి.
తెలంగాణ నేతల్లో కలవరం https://www.telugumuchatlu.com/disturbing-telangana-leaders/
Tags:Disturbing Telangana leaders