నాయకుల మధ్య జిల్లాల విభజన

గుంటూరు  ముచ్చట్లు:

జిల్లాల విభజన తర్వాత ఉమ్మడి గుంటూరు జిల్లా.. పల్నాడు, బాపట్ల, గుంటూరుగా విడిపోయింది. దానికంటే ముందుగానే గుంటూరు, నరసరావుపే, బాపట్ల లోక్‌సభ పరిధిలో కమిటీలను విభజించేశాయి ప్రధాన పార్టీలు. ఈ మార్పులు.. చేర్పులు తర్వాత పార్టీ నేతల వైఖరిలోనూ ఛేంజ్‌ కనిపిస్తోంది. ఒకప్పుడు ఉమ్మడి జిల్లాలో కలిసి మెలిసి తిరిగిన నాయకుల మధ్య జిల్లాల విభజన పెద్ద రేఖే గీసిందట. పక్క జిల్లాకి వెళ్లాలంటేనే నాయకులు భయపడుతున్నారట. అక్కడికి వెళ్తే ఆ జిల్లా అధ్యక్షుడు బాధపడతారని ఎవరికి వారు గిరి గీసుకుని.. మడికట్టుకుని నియోజకవర్గాల్లోనే ఉండిపోతున్నారట.ఆయా జిల్లాల్లో అభిమానులు పిలిచినా వెళ్లడం లేదట ఇతర జిల్లాలకు చెందిన నాయకులు. మీకు మాకు చాలా దూరం.. ఎక్కడి వాళ్లు అక్కడ ఉంటేనే ఆరోగ్యం అని సెలవిస్తున్నారట. ఈ ఎఫెక్ట్ ప్రైవేట్‌ కార్యక్రమాలకూ పాకేసిందట. ఒకప్పుడు ఊ అంటే గుంటూరులో వాలిపోయే నాయకులు .. సిటీలోని ఇళ్లను సైతం ఖాళీ చేసే యోచనలో ఉన్నారట. ఇది ఒక్క అధికారపార్టీలోనే కాదు.. టీడీపీలోనూ ఇదే తంతు కొనసాగుతోందట. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా కమిటీలను విభజించి సమయంలోనే నాయకత్వం బలహీన పడుతోందని కామెంట్స్‌ వినిపించాయి.

 

 

 

కానీ ప్రధాన పార్టీలు ఒకేలా ఆలోచించడంతో సర్దుకోక తప్పలేదు.ఒకప్పుడు ఉమ్మడి జిల్లాలోని 17 నియోజకవర్గాలతో పార్టీ ఆఫీసులు కళకళలాడేవి. ఇప్పుడు ఎవరి దుకాణం వాళ్లదే. పల్నాడు నాయకులు గుంటూరు వచ్చేది లేదు… గుంటూరు నాయకులు బాపట్ల వెళ్లేది లేదు అన్నట్టుగా తయారైంది. అధికార పార్టీలో ఈ అంశంపై పైకి ఎవరూ మాట్లాడకపోయినా.. టీడీపీలో మాత్రం గట్టి చర్చే జరుగుతోందట. జిల్లాల విభజన తర్వాత నాయకత్వ లేమితో సతమతం అవుతున్నట్టు టీడీపీ నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు. జిల్లా పార్టీ ఆఫీసుల్లో కార్యక్రమాలు నిర్వహిస్తే ఒకరో ఇద్దరో వస్తున్నారు. అలా వచ్చిన వాళ్లను చూసి.. జిల్లాలో మన బలం ఇంతేనా అనే ఫీలింగ్‌ కలుగుతోందని చెవులు కొరుక్కుంటున్నాయి శ్రేణులు.ఉమ్మడి గుంటూరు జిల్లా మాదిరి నాయకత్వాలు పటిష్ఠంగా కనిపించాలంటే.. ఇంకేదో చేయాలని ప్రధాన పార్టీల శ్రేణులు కోరుతున్నాయట. అప్పట్లా పనిచేయాలంటే మరింత దృష్టిపెట్టి.. స్థానిక నాయకత్వాన్ని బలోపేతం చేయాలని టీడీపీ అధిష్ఠానానికి అర్జీ పెట్టారట. ఉమ్మడి నాయకత్వాన్ని కొనసాగించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని డిమాండ్‌ చేస్తున్నారట. లేకపోతే ఏ కార్యక్రమం చేపట్టినా చప్పగా సాగుతుందని.. బలంగా కనిపించలేమని.. ఇది కేడర్‌ మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తుందని చెబుతున్నారట. ఒక్క టీడీపీలోనే కాదు.. చాప కింద నీరులా వైసీపీలోనూ ఇదే డిమాండ్‌ పెరుగుతున్నట్టు సమాచారం. అయితే కేడర్‌ కోరుతున్నట్టుగా ఉమ్మడి నాయకత్వం సాధ్యమా అన్నది పెద్ద ప్రశ్న. అలా చేస్తే లేని పోని సమస్యలు రావొచ్చని పార్టీ నేతలు భావిస్తున్నారట. మరి.. కేడర్‌లో నెలకొన్న నిస్తేజాన్ని పోగొట్టడానికి ప్రధాన పార్టీలు ఎలాంటి మంత్రం వేస్తాయో చూడాలి.

 

Tags:Division of districts among leaders

Leave A Reply

Your email address will not be published.