DK Srinivasu Daratu

డీకే శ్రీనివాసులు దారెటు

Date:27/11/2020

తిరుపతి ముచ్చట్లు

డీకే ఆదికేశ‌వులు నాయుడు ఉమ్మడి రాష్ట్రంలో పేరున్న లిక్క‌ర్ కింగ్‌. వందల కోట్ల వ్యాపార సామ్రాజ్యాధిన‌త అయిన ఆయ‌న కాంగ్రెస్‌లో కీల‌క నేత‌గా ఉండేవారు. 2004 ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీలో చేరి 2004లో చిత్తూరు ఎంపీగా గెలిచారు. చంద్రబాబు 2007లో జ‌రిపిన మీకోసం యాత్ర ఖ‌ర్చంతా ఆయ‌నే భ‌రించారు. ఆ త‌ర్వాత నాటి యూపీఏ ప్రభుత్వంపై ప్రతిప‌క్షాలు ప్రవేశ‌పెట్టిన అవిశ్వాస తీర్మానం స‌మ‌యంలో డీకే టీడీపీ నిర్ణయానికి వ్యతిరేకంగా నాటి మ‌న్మోహ‌న్‌సింగ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసి పార్టీ నుంచి బ‌హిష్కర‌ణ‌కు గుర‌వ్వడంతో పాటు కాంగ్రెస్‌కు చేరువ అయ్యారు. ఆ త‌ర్వాత వైఎస్ అండ‌దండ‌ల‌తో టీటీడీ చైర్మన్‌గా ప‌నిచేసిన ఆయ‌న 2009లో మృతి చెందారు.తాజాగా డీకే ఆదికేశవులునాయుడు భార్య మాజీ ఎమ్మెల్యే అయిన స‌త్యప్రభ కూడా మృతి చెంద‌డంతో ఆ కుటుంబ రాజ‌కీయాల‌కు శుభం కార్డు ప‌డిన‌ట్టేనా ? లేదా డీకే ఫ్యామిలీ వార‌సుడు శ్రీనివాస్ రాజ‌కీయం కొత్తగా చిగురిస్తుందా ? అన్నది ఆసక్తిగా మారింది. టీడీపీ ప్రతిప‌క్షంలో ఉన్నప్పుడే డీకే కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేశారు.

 

2014 ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ డీకే భార్య స‌త్యప్రభ చంద్రబాబు విన్నపం మేర‌కు పార్టీ కోసం భారీగా విరాళం ఇచ్చారు. ప‌దేళ్లు ప్రతిప‌క్షంలో ఉన్న టీడీపీని ఆదుకునేందుకు చంద్రబాబే స‌త్యప్రభ‌ను ఫండింగ్ అడిగార‌ని టీడీపీ వాళ్లే చెపుతారు. ఆ ఎన్నిక‌ల్లో స‌త్యప్రభ‌కు చిత్తూరు అసెంబ్లీ సీటు ఇవ్వగా ఆమె విజ‌యం సాధించారు. ఐదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న ఆమె వివాదాల‌కు దూరంగానే ఉండేవారు. అయితే గ‌త ఎన్నిక‌ల్లో మాత్రం చంద్రబాబు డీకే ఫ్యామిలీని ముప్పుతిప్పలు పెట్టారు.స‌త్యప్రభ తాను చిత్తూరు నుంచే పోటీ చేస్తాన‌ని చెప్పినా బాబు ఆమెకు ఇష్టంలేక‌పోయినా రాజంపేట పార్లమెంట‌కు పోటీ చేయించారు. తాను ఓడిపోతాన‌ని తెలిసి కూడా స‌త్యప్రభ అయిష్టంగానే అక్కడ పోటీ చేసి ఓడిపోవ‌డంతో పాటు ఆర్థికంగా న‌ష్టపోయారు. ఐదేళ్లు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నా స‌త్యప్రభ సంపాదించింది లేక‌పోగా బాగా న‌ష్టపోయిన ప‌రిస్థితి. ఇక ఎన్నిక‌ల్లో ఓడిపోయాక పార్టీతో ఆమె అంటీముట్టన‌ట్టుగానే ఉంటున్నారు.

 

ఇటీవ‌ల ప్రక‌టించిన పార్టీ క‌మిటీల్లో మాత్రం స‌త్యప్రభ‌ను పార్టీ ఉపాధ్యక్షురాలిగా నియ‌మించారు.ఎంపీ, ఎమ్మెల్యేలుగా గెలిచిన డీకే దంప‌తులు ఇద్దరు మృతి చెంద‌డంతో వీరి రాజ‌కీయ వార‌స‌త్వాన్ని వీరి త‌న‌యుడు శ్రీనివాస్ అంది పుచ్చుకుంటారా ? అన్నదానిపై చిత్తూరు జిల్లాలోనే కాకుండా ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చలు జ‌రుగుతున్నాయి. ఇందుకు కొన్ని ప‌రిణామాలు కూడా కార‌ణంగా ఉన్నాయి. ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత డీకే కుటుంబ వ్యాపారాల‌పై ఐటీ దాడులు జ‌రిగాయి. ఆ స‌మ‌యంలో వారు చంద్రబాబు సాయాన్ని కోరినా ఆయ‌న నిస్సహాయ‌త వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తిరుప‌తి వ‌చ్చిన సీఎం జ‌గ‌న్‌ను డీకే శ్రీనివాస్ క‌లిశారు. రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి స్వయంగా శ్రీనివాస్‌ను వెంట బెట్టుకుని మ‌రీ జ‌గ‌న్ వ‌ద్దకు తీసుకువెళ్లారు. ఇప్పుడు స‌త్యప్రభ కూడా మృతి చెంద‌డంతో శ్రీనివాస్ ఖ‌చ్చితంగా అయితే టీడీపీలో ఉండ‌ర‌నే అంటున్నారు. మ‌రి ఆయ‌న పాలిటిక్స్‌లో రాణించాల‌నుకుంటే వైసీపీలోకి వెళ‌తారా ? లేదా వ్యాపారాల్లో బిజీ అవుతారా ? అన్నది స‌స్పెన్స్‌.. బ‌య‌ట చ‌ర్చల ప్రకారం పెద్దిరెడ్డి ఫ్యామిలీ డీకే శ్రీనివాస్‌కు చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే సీటు ఇప్పించేలా తెర‌వెన‌క పావులు క‌దుపుతోంద‌ట‌.

 

 విమానశ్రయాల్లో గిరిజన స్టాల్స్

Tags:DK Srinivasu Daratu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *