గోదారమ్మను దోచేస్తున్నారు

Date:15/04/2019

ఖమ్మం ముచ్చట్లు :
అశ్వాపురం మండలంలోని అమ్మగారిపల్లి, చింతిర్యాల, అమీర్దా, ఆనందాపురం గోదావరి ఇసుక రేవుల నుంచి కొద్దిరోజులుగా ఇసుక రవాణా జోరుగా కొనసాగుతోంది. రాత్రి 9 గంటలకు రవాణా ప్రారంభమవుతుంది. అర్ధరాత్రి వేళ వేగం పుంజుకుంటుంది. ఉదయం 5 గంటల వరకు ఈ తంతు కొనసాగుతుంది. అతివేగంగా, నిర్లక్ష్యంగా దూసుకుపోయే ట్రాక్టర్లతో అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అమాయక ప్రాణాలు బలవుతున్నాయి. వాహనాల వేగానికి పరిసర గ్రామాల ప్రజలు హడలిపోతున్నారు.
గత మార్చి 28న గొల్లగూడెం వద్ద మూల మలుపులో ప్రధాన రహదారిపై ఇసుక ట్రాక్టరు ప్రధాన రహదారిపై ఉన్న కల్వర్టును ఢీకొని బోల్తా పడిన సంఘటనలో ట్రాక్టర్‌ డ్రైవర్‌ బర్ల అనిల్‌కుమార్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. ఇటీవల మొండికుంట వద్ద మితిమీరిన వేగంతో అదుపు తప్పిన ఇసుక ట్రాక్టరు బోల్తాపడిన సంఘటనలో ట్రాక్టర్‌ డ్రైవర్‌ చాప పెద్దిరాజు అక్కడికక్కడే మృతిచెందాడు.  మొండికుంట వద్ద ప్రధాన కేంద్రంలో ఇసుక ట్రాక్టరు, లారీ ఢీకొన్న సంఘటనలో ఆ గ్రామానికి చెందిన ఓ నాయకుడికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ సంఘటనపై ఆయనకు, పోలీసులకు మధ్య వివాదం కూడా జరిగింది.  గతంలో చింతిర్యాల అడ్డరోడ్డు వద్ద ఇసుక లారీ ఎడ్లబండిని ఢీకొట్టిన సంఘటనలో చింతిర్యాలకు చెందిన ఇద్దరు దుర్మరణం చెందారు. జగ్గారం వద్ద ఓ ఇసుక లారీ ఎడ్లబండిని ఢీకొన్న సంఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడు నేటికీ మంచానికే పరిమితమయ్యాడు.
 ఆర్థిక లేమి, ఇతర పరిస్థితుల నేపథ్యంలో అతి పిన్న వయస్కులు ట్రాక్టర్‌ డ్రైవర్లుగా వ్యవహరిస్తున్నారు. వీరికి అతి తక్కువ జీతం ఇస్తున్నారు. లైసెన్సులు లేవు. డ్రైవింగులో పెద్దగా అనుభవం కూడా ఉండదు. గొల్లగూడెం, మొండికుంట వద్ద ప్రమాదంలో మృతిచెందిన ఇద్దరు ఇసుక ట్రాక్టర్ల డ్రైవర్లు బర్ల అనిల్‌కుమార్‌, చాప పెద్దిరాజు.. పద్దెనిమిదేళ్లు నిండని యువకులు. వాహనం నడపడంలో అనుభవం లేకే వీరు మృత్యువాతపడ్డారు. ఎవరైనా వాహనాన్ని అడ్డుకుంటారేమోనన్న భయం ట్రాక్టర్ల డ్రైవర్లను అనుక్షణం వెంటాడుతుంది. దీంతో వాహనాలను వేగంగా నడుపుతున్నారు. ఈ క్రమంలో వాహనాలు అదుపు తప్పుతున్నాయి. వాహనదారుల, పాదచారుల మీదకు దూసుకెళ్తున్నాయి. రాత్రంతా ఇసుక రవాణాకు పాల్పడుతుండటం వల్ల ట్రాక్టరు డ్రైవర్ల కంటిమీద కునుకు ఉండదు. వీరు పగలు నిద్రపోరు. తెల్లవారుజామున నిద్రమత్తు ఆవహిస్తుంది. రెప్పపాటు కాలంలో ఘోరమైన ప్రమాదాలకు అవకాశమేర్పడుతోంది. పది రోజుల వ్యవధిలోనే జరిగిన రెండు ప్రమాదాలు తెల్లవారుజామున జరిగినవే. వేగం, నిర్లక్ష్యంతో పాటు నిద్రమత్తు కూడా ఈ ప్రమాదాలకు కారణమని తెలుస్తోంది. ఇసుక రవాణాకు పాల్పడుతోన్న చాలా ట్రాక్టర్లకు నెంబర్లు ఉండవు. ఆ సమయంలో వీటివల్ల ఎక్కడ ఏ ఉపద్రవం వాటిల్లుతుందోనని ఆ మార్గాల్లో రాకపోకలు కొనసాగించే వారు హడలిపోతున్నారు. ఒకవేళ ప్రమాదాలు జరిగినా అందుకు బాధులెవరో గుర్తించేందుకు వీలుండదు. అన్నీ నెంబర్లు లేని ట్రాక్టర్లు కావడమే ఈ పరిస్థితికి కారణం.
Tags:Do not fall for God

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *