నిండుకుండలా గోదావరి

Do not fill up the Godavari

Do not fill up the Godavari

Date:15/08/2018
రాజమండ్రి ముచ్చట్లు:
గోదావరి, కృష్ణా నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు దిగువ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని ధవళేశ్వరం వరకూ గోదావరి నిండుకుండలా ప్రవహిస్తుంటే.. పులిచింతల ప్రాజెక్టు దిగువ నుంచి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 4,35,061 క్యూసెక్కుల గోదావరి వరద నీళ్లు సముద్రంలోకి వదులుతుండగా.. ప్రకాశం బ్యారేజీ నుంచి 45 వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తోండటంతో కడెం, ర్యాలీ, గొల్లవాగులు, ప్రాణహిత, ఇంద్రా వతి, శబరి, తాలిపేరు, కిన్నెరసాని, సీలేరు వంటి ఉపనదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో గోదావరికి వరద పోటెత్తింది.
తెలంగాణలో ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండిపోవడంతో వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే, ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, కిన్నెరసాని, తాలిపేరు నదుల నుంచి వరద భారీగా వస్తుండటంతో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. మరోవైపు.. ఉపనదులు పొంగిపొర్లుతుండటంతో ధవళేశ్వరం బ్యారేజీ వద్దకు సోమవారం 4,42,661 క్యూసెక్కుల ప్రవాహం వచ్చింది. ఇందులో 7,600 క్యూసెక్కులు డెల్టా కాలువలకు విడుదల చేసి.. మిగతా 4,35,061 క్యూసెక్కులు సముద్రంలోకి వదిలారు.
దాంతో ఈ సీజన్‌లో ఇప్పటివరకూ.. 681.015 టీఎంసీల గోదావరి జలాలు కడలిపాలయ్యాయి.కృష్ణా నదిలో ఎగువన వరద ప్రవాహం నిలకడగా ఉంది. ఆల్మట్టి, నారాయణపూర్‌ జలాశయాల్లోకి వచ్చిన వరదను కాలువలకు విడుదల చేసి, మిగులుగా ఉన్న జలాలను విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాలకు 25,636 క్యూసెక్కులు రాగా కాలువలు, బీమా, కోయిల్‌సాగర్, బీమా ఎత్తిపోతలు.. విద్యుదుత్పత్తి కేంద్రం ద్వారా 28,240 క్యూసెక్కులు వదులుతున్నారు. తుంగభద్రలో వరద తగ్గుముఖం పట్టింది. తుంగభద్ర జలాశయంలోకి 56,893 క్యూసెక్కులు రాగా.. 66,721 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ జలాలు సుంకేసుల బ్యారేజీ మీదుగా కృష్ణా నదలోకి చేరుతున్నాయి. జూరాల, తుంగభద్ర జలాశయాల నుంచి విడుదల చేసిన వరద జలాల్లో శ్రీశైలం జలాశయంలోకి 63,369 క్యూసెక్కులు చేరుతుండగా.. పోతిరెడ్డిపాడు, హంద్రీ–నీవా, కల్వకుర్తి ఎత్తిపోతలకు, విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా నాగార్జునసాగర్‌కు 45,790 క్యూసెక్కులు వదులుతున్నారు.
ప్రస్తుతం శ్రీశైలంలో 870.9 అడుగుల్లో 145.50 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. నాగార్జునసాగర్‌లోకి 23,485 క్యూసెక్కులు వస్తుండగా.. కుడి కాలువ, ఏమ్మార్పీల ద్వారా 3,944 క్యూసెక్కులు వదలుతున్నారు. ప్రస్తుతం నాగార్జునసాగర్‌లో 521.2 అడుగుల్లో 151.47 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. గుంటూరు, కృష్ణా జిల్లాలో కురుస్తున్న వర్షాలకు మున్నేరు, వైరా, కట్టలేరు వాగులు పొంగిపొర్లుతున్నాయి. దాంతో పులిచింతలకు దిగువన కృష్ణా నది పరవళ్లు తొక్కుతోంది. సోమవారం సాయంత్రం ఐదు గంటలకు ప్రకాశం బ్యారేజీలోకి 51,168 క్యూసెక్కులు చేరుతుండగా.. కాలువలకు 10,618 క్యూసెక్కులు విడుదల చేసి మిగిలినవి దిగువకు వదిలారు. దాంతో ఈ సీజన్‌లో ఇప్పటివరకూ 3.246 టీఎంసీల కృష్ణా జలాలను ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలోకి విడుదల చేసినట్లయింది. అలాగే, వంశధార నదిలో వరద ఉధృతి పెరిగింది. గొట్టా బ్యారేజీలోకి 9,866 క్యూసెక్కులు వస్తుండగా.. 7,220 క్యూసెక్కులను కడలిలోకి వదిలారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకూ 22.76 టీఎంసీల వంశధార జలాలు సముద్రం పాలయ్యాయి.
పశ్చిమగోదావరి జిల్లాలో పోలవరం మండలం కొత్తూరు గ్రామం వద్ద లోలెవల్‌ కాజ్‌వేలో మూడడుగులు వరదనీరు ప్రవహిస్తోంది. ఈ కారణంగా ఏజెన్సీలోని 19 గ్రామాలకు రాకపోకలు సోమవారం నిలిచిపోయాయి. పలు కాలువలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ సీజన్‌లో గరిష్టంగా 5,92,410 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వరద సోమవారం రికార్డయ్యింది. ఎగువ ప్రాంతం నుంచి వరదనీరు భారీగా వస్తుండంతో ధవళేళ్వరం ఆనకట్ట వద్ద 175 గేట్లను ఎత్తివేసేందుకు అధికారులు ఏర్పాట్లుచేస్తున్నారు. గోదావరి జిల్లాలోని మూడు డెల్టాలకు 7,700 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.నర్సాపురంలో 400 ఎకరాలు, పెనుమంట్ర మండలంలో 500 ఎకరాలు నీటమునిగాయి. పలు ప్రాంతాల్లో డ్రెయిన్లు పొంగి పొర్లుతున్నాయి. కాగా, తూర్పు గోదావరి జిల్లా వీఆర్‌పురం మండలాన్ని ఆనుకొని ప్రవహిస్తున్న శబరి నదికి ఎగపోటు తగిలింది. ఇది మరింత పెరిగితే వీఆర్‌ పురం, కూనవరం మండలాల్లోని 30కి పైగా గ్రామాలు నీట మునిగే ప్రమాదం ఉంది. కృష్ణా జిల్లాలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వరద నీటితో పశ్చిమ కృష్ణా ప్రాంతంలో వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో రాకపోకలు స్తంభించిపోయాయి.
Tags:Do not fill up the Godavari

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *