పరిపాలనపై దృష్టి పెట్టరా….

Date:25/12/2018
మెదక్ ముచ్చట్లు:
ఎన్నికల హడావిడిలో మునిగిన జిల్లా అధికారులు అవి ముగిసి పది రోజులు అవుతున్నా ఇంకా పాలనపై దృష్టి సారించడం లేదు. గ్రామీణ ప్రాంతంలోని గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో ఆరోగ్య లక్ష్మి పథకం కింద పూర్తి స్థాయి భోజనం అందించాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. ఆ ఆదేశాలకు భిన్నంగా పక్షం రోజులుగా అంగన్‌వాడీ కేంద్రాల్లో గుడ్లు, పాలు అందుబాటులో లేకపోవడంతో అక్కడికి వచ్చే వారంతా సాధారణ భోజనం చేసి వెళుతున్నారు. కేంద్రాల్లోని చిన్నారులకు సైతం గుడ్లు అందని పరిస్థితి నెలకొంది. అదేమని ప్రశ్నిస్తే కుంటి సాకులు చెబుతున్నారు. మహిళలు, చిన్నపిల్లల ఆరోగ్య సంరక్షణకు పెద్దపీట వేస్తున్నట్లు ప్రకటిస్తున్న ప్రభుత్వం కేంద్రాలకు పాలు, గుడ్లు అందించడంలో మాత్రం ఆలస్యం చేస్తోంది. ఈ పరిస్థితి జిల్లావ్యాప్తంగా ఉండటంతో గర్భిణులు, బాలింతలు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు.
మెదక్‌ జిల్లాలోని నాలుగు ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో 1076 అంగన్‌వాడీ కేంద్రాలు, 191 మినీ అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా నిత్యం ఆరోగ్యలక్ష్మీ కింద పూర్తిస్థాయి భోజనం అందిస్తున్నారు. వీటి పరిధిలో అన్ని కేంద్రాల్లో కలిపి 73,772 మంది చిన్నారులు, 6,295 మంది గర్భిణులు, 6,534 మంది బాలింతలు ఉన్నారు. కేంద్రాలకు వచ్చే గర్బిణులు, బాలింతలకు ప్రతి రోజూ 200 మిల్లీలీటర్ల పాలు, ఒక గుడ్డు చొప్పున ఇవ్వాలి. ప్రతి బుధవారం రెండు గుడ్లు ఇవ్వాలి. వారితోపాటు చిన్నారులకు కూడా ప్రతి రోజూ ఒక గుడ్డు చొప్పున, ప్రతి బుధవారం రెండు గుడ్లు ఇవ్వాలి.
జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలకు 15 రోజులుగా పాలు, గుడ్లు సరఫరా లేకపోవడంతో లబ్ధిదారులు సాధారణ భోజనం చేసి వెళుతున్నారు. చిన్నారులకు కూడా గుడ్లు లేకపోవడంతో నిరాశగా ఉన్నారు. జిల్లా అంతటా ఇదే పరిస్థితి నెలకొని ఉండడంతో కేంద్రాల టీచర్లు సమాధానం చెప్పలేకపోతున్నారు. మండలంలోని పలు అంగన్‌వాడీ కేంద్రాల్లో పప్పు, బియ్యం కొరత కూడా నెలకొనడంతో నిల్వ ఉన్న కేంద్రాల నుంచి బియ్యం, పప్పు తీసుకొచ్చి వంట చేసి పెడుతున్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు స్పందించి అవసరమైన చర్యలు తీసుకొని గుడ్లు, పాలు వెంటనే సరఫరా చేయాల్సిన అవసరం ఉంది.
Tags:Do not focus on administration …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *