Date:13/01/2021
వరంగల్ ముచ్చట్లు:
బండి సంజయ్ మాటలు ప్రజలను, వారి మనోభావాలను, సెంటిమెంట్లను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభిప్రాయపడ్డారు. దయచేసి పిచ్చిపిచ్చిగా మాట్లాడొద్దని, ప్రజలను రెచ్చగొట్ట వద్దని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కి మరోసారి విజ్ఞప్తి చేశారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు సామాజిక బాధ్యతతో మెలగాలని హితవు పలికారు. రాయపర్తి మండలం మైలారం గ్రామంలో అర్హులైన నిరుపేదలకు సంక్రాంతి పండుగ కానుకగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అప్పగించిన సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానంగా మంత్రి ఈ విధంగా స్పందించారు.బండి సంజయ్ ఎంపీగా ఉన్నారు. బీజేపీ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. బీజేపీ పార్టీ కేంద్రంలో ఎన్డీఏ కూటమికి నేతృత్వం వహిస్తూ అధికారంలో ఉంది. ఇలాంటి స్థానంలో ఉన్న పార్టీ గాని, అలాంటి పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న నేతలు కానీ నోటికి వచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రజాస్వామ్యంపై గౌరవం పెరిగేలా మాటలు, విమర్శలు ఉంటే ప్రజలు హర్షిస్తారు. అధికారమే పరమావధి కాదని, ప్రజా సేవ, ప్రజల యోగక్షేమాలు, సమాజంలో శాంతియుత పద్ధతులు కొన సాగాలన్నారు.
అభివృద్ధి మీద తెలుసుకోవాలనుకుంటే.. ఎవరు ఏం చేశారన్నది ప్రజలకు తెలిసేలా అధికారికంగానే సమావేశం అవడానికి సిద్ధపడాలని మంత్రి బండి సంజయ్ కి సూచించారు. ఏవో కొన్ని మాటలతో రెచ్చగొట్టి, ప్రజలను మోస పుచ్చే మాటలు మంచివి కావని హితవుపలికారు. పదవుల్లో ఉన్నవారు ప్రజాస్వామిక పద్ధతిలో గౌరవం పెరిగేలా మాట్లాడుకుంటే మంచిదని మంత్రి చెప్పారు. ప్రజలు నేతల మాటలనే కాక, పార్టీల పద్ధతులను, ప్రభుత్వాల అభివృద్ధి తీరును కూడా గమనిస్తూ ఉంటారని, సందర్భం వచ్చినప్పుడు వారి తీర్పును ఇస్తూ ఉంటారని గుర్తుపెట్టుకోవాలని మంత్రి సూచించారు.
ఆసక్తికరంగా జమ్మలమడుగు పంచాయితీ
Tags: Do not provoke people by talking insane: Minister Errabelli