Do not repeat the 1987 politics

 1987 రాజకీయాలు మళ్లీ వద్దు

Date:13/07/2018
శ్రీనగర్ ముచ్చట్లు:
జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ బీజేపీపై విరుచుకుపడ్డారు. పీడీపీని చీల్చితే తీవ్ర పరిణామాలుంటాయని శుక్రవారం బీజేపీకి తీవ్ర హెచ్చరికలు జారీచేశారు. 1987 తరహా రాజకీయాలు ఇప్పుడు చేయాలని బీజేపీ ప్రయత్నం చేస్తే.. అప్పుడు సలావుద్దీన్, యాసిన్ మాలిక్ వచ్చినట్లుగానే ఇప్పుడు మరింత మంది పుట్టుకువస్తారన్నారు. పీడీపీలో వర్గాలను ప్రోత్సహిస్తూ, చీల్చాలని చూస్తే భారత రాజ్యాంగంపై కశ్మీరీలకు నమ్మకం పోతుందని ఆమె అన్నారు. ప్రతి ఇంట్లో సమస్యలు ఉన్నట్లుగా.. పార్టీలోనూ కొన్నిసార్లు ఇబ్బందులుంటాయని, కూర్చుని మాట్లాడుకుంటే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని ఆమె అన్నారు. పీడీపీకి బీజేపీ మద్దతు ఉపసంహరించిన తర్వాత బీజేపీపై ముఫ్తీ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి. జూన్ 19న సంకీర్ణ ప్రభుత్వం నుంచి బీజేపీ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో అక్కడ గవర్నర్ పాలన విధించారు. జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీలో మొత్తం 87 స్థానాలున్నాయి. వీటిలో పీడీపీకి 28, బీజేపీకి 25 మంది ఎమ్మెల్యేలున్నారు. నేషనల్ కాన్ఫరెన్స్‌కు 15, కాంగ్రెస్‌కు 12, జమ్మూకశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్‌కు రెండు, సీపీఎంకు ఒక ఎమ్మెల్యే, పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్‌కు ఒక ఎమ్మెల్యే, ముగ్గురు ఇండిపెండెంట్లు ఉన్నారు. ఇదిలా ఉండగా.. పీడీపీ నుంచి కొంత మంది ఎమ్మెల్యేలు బయటికి వచ్చి బీజేపీకి మద్దతిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో.. ఇటీవల ముఫ్తీ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేయగా 21 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు.మిగతా ఏడుగురు హాజరుకాలేదు. దీంతో వీరంతా బీజేపీకి మద్దతు తెలిపేందుకు సిద్దంగా ఉన్నారన్న అనుమానాలు బలపడ్డాయి.
 1987 రాజకీయాలు మళ్లీ వద్దు https://www.telugumuchatlu.com/do-not-repeat-the-1987-politics/
Tags:Do not repeat the 1987 politics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *