పొమ్మనకుండా పోగపెడ్తున్నారా

-రేవంత్ పై సీనియర్ల ఫైర్

Date:21/09/2019

హైద్రాబాద్ ముచ్చట్లు:

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఆదిపత్య పోరు పీక్ స్టేజికి చేరుకుంటోంది ఎన్నికలకు ముందు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన రేవంత్ రెడ్డికి సొంత పార్టీ నేతలు ఒక్కొక్కరుగా షాక్ ఇస్తున్నారు. హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నికకు పోటీ చేసే అభ్యర్ధి విషయంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పార్టీలో నిప్పు రాజేశాయి. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను పార్టీ క్రమశిక్షణ సంఘం కూడా తీవ్రంగా పరిగణిస్తుంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు దుమారం లేపుతున్నాయి. పార్టీలో చేరిన తక్కువ సమయంలోనే తన వాగ్దాటితో ప్రత్యేక ముద్ర వేసుకున్న రేవంత్ రెడ్డి ప్రవర్తనపై పార్టీ నేతలు అంతర్గతంగానే కాకుండా బహటంగా సెటైర్లు వేస్తున్నారు.

 

 

 

 

హూజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉపఎన్నిక నేపత్యంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తన సతీమణి పోటీ చేస్తారని చేసిన ప్రకటనపై రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేయడమే కాకుండా హూజూర్ నగర్ నుంచి కిరణ్ రెడ్డి పోటీ చేస్తారంటూ చెప్పడంపై నేతలు మండిపడ్డారు.రేవంత్ మాటలపై నల్గొండ జిల్లా కాంగ్రెస్ నేతలను ఆగ్రహానికి గురిచేశాయి. ఇటీవల పార్టీలోకి వచ్చిన వాళ్ల సలహాలు అవసరం లేదంటూ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సెటైర్లువేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డిని చిరకాలంగా వ్యతిరేకిస్తున్న కోమటిరెడ్డి హూజూర్ నగర్ టికెట్ విషయంలో రేవంత్ కు వ్యతిరేకంగా మాట్లాడటమే కాకుండా పద్మావతిని అభ్యర్ధిగా నిలబెట్టి గెలిపించుకుంటామన్నారు.

 

 

 

గతంలో విభేదాలు ఉన్నా జానారెడ్డి, ఉత్తమ్, తాను ఒక్కటయ్యామంటూ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్‌ కూడా రేవంత్ రెడ్డిపై ఫైరయ్యారు. కాంగ్రెస్ కోర్ కమిటీలో చర్చించాకే హుజుర్‌నగర్ కాంగ్రెస్ అభ్యర్ధిగా పద్మావతిని ప్రకటించారని ఆ మీటింగ్‌లో రేవంత్ కూడా ఉన్నారని గుర్తుచేశారు. ప్రాంతీయ పార్టీలో పహిల్వాన్‌గిరి నడవొచ్చేమో గానీ, కాంగ్రెస్‌లో నడవదని పరోక్షంగా రేవంత్‌పై వీహెచ్ సెటైర్లు వేశారు. మరో వైపు రేవంత్ వ్యాఖ్యలపై తాను చింతిస్తున్నానన్నారు మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్. పవన్‌తో సెల్ఫీ దిగాల్సిన అవసరం తనకు లేదన్నారు. తనతోనే సెల్ఫీలు దిగేవారు చాలా మంది ఉన్నారన్నారు.

 

 

 

 

యురేనియంపై కాంగ్రెస్ ఎంపీగా ఉంటూ పవన్ కు రిపోర్టు ఇవ్వడమేంటని సంపత్ ప్రశ్నించారు. మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డికి నల్లమల అడవుల్లో పనేముందన్నారు. విద్యుత్ సమస్యపై అసెంబ్లీలో ప్రస్తావించడం లేదంటూ రేవంత్ చేసన వ్యాక్యలు క్రమశిక్షణా సంఘం దృష్టికి వెళ్లాయి. ఈ వ్యవహారంపై క్రమశిక్షణ కమిటీలో చర్చించామని క్రమశిక్షణ సంఘం చైర్మన్ కోదండరెడ్డి చెప్పారు.

 

 

 

 

అసెంబ్లీ లో కాంగ్రెస్ ఎమ్మెల్యే లు మాట్లాడిన తీరు పార్టీ గ్రాఫ్ పెంచుకుంటే రేవంత్ వచ్చి విద్యుత్ సమస్యపై మాట్లాడలేదని అని పార్టీ గ్రాఫ్ తగ్గించారని ఎప్పుడు ఎం మాట్లాడాలనేది సభ్యులు నిర్ణయించుకుంటారని, ఆ విషయంలో రేవంత్ జోక్యం అనవసరం అని కోదండరెడ్డి కాస్త ఘాటైన కామెంట్లే చేశారు. మొత్తానికి మొదట్నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలంతా రేవంత్ రెడ్డికి చెక్ పెట్టేందుకు, ఆయన దూకుడుని తగ్గించేందుకు వ్యూహాలు రచిస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. మరి రేవంత్ రెడ్డి వ్యూహమేంటో వేచి చూడాలి.

కరీంనగర్ లో గ్రానైట్ మంటలు

Tags: Do not worry

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *