వేటగాళ్లకు అడ్డేది..? 

Date:14/04/2018
ఆదిలాబాద్ ముచ్చట్లు:
జిల్లాలో వేలాది వణ్యప్రాణులు వేటగాళ్ల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నాయి. అధికారుల నిర్లక్ష్యమా, వేటగాళ్ల తెలివి తేటలా, కోర్టు వరకు వెళ్లినా ఎందుకు శిక్షలు పడడం లేదు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 7.06 లక్షల హెక్టార్లలో అడవులు విస్తరించి ఉన్నాయి. ఇందులో ఎన్నో రకాల వన్యప్రాణులు జీవిస్తున్నాయి. అడవిలో సంచరించే మూగజీవాల్లో అత్యంత ప్రత్యేకత కలిగిన వన్యప్రాణి కృష్ణ జింక. ఇక్కడ అడవుల్లో తరచుగా కనిపిస్తున్న వీటిని పెద్దపులి ఆహారంగా తీసుకునేందుకు అమితంగా ఇష్టపడుతుంది. కవ్వాల్‌ అభయారణ్యాన్ని 2012లో పులుల సంరక్షణ కేంద్రంగా గుర్తించిన తరువాత ఎందరో వేటగాళ్లను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 2016లో ఏడుగురు యువకులు కలిసి మెకాన్ని హతమార్చారు. అటవీ ప్రాంతంలో దాని కలేబరాన్ని కోస్తుండగా అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. జంతువు మాంసంతో సహా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పంచనామా నిర్వహించి వేటగాళ్లను కోర్టులో హాజరు పరిచారు. కానీ వారికి ఎలాంటి శిక్ష పడలేదు. బెయిల్‌ మీద బయటకు వచ్చిన వారంతా తిరిగి అదే వృత్తిని కొనసాగిస్తున్నారు.2017లో ఒక దుప్పిని వేటాడిన వ్యక్తిని సైతం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపించారు. కానీ 14 రోజుల్లోనే బయటకు వచ్చిన ఆయన పాత పద్ధతినే కొనసాగిస్తూ అధికారులకు చిక్కకుండా జాగ్రత్త పడుతున్నాడు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం మొర్రిగూడ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి 1999లో పెద్దపులి చర్మం లభించిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉండడంతో జైలు శిక్ష పూర్తి చేసుకొని బయటకు వచ్చి ఇప్పుడు నిజాయతీగా బతుకున్నారు. నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మండలం పాత ఎల్లాపూర్‌కు చెందిన ఇద్దరు అన్నదమ్ములు వన్యప్రాణిని వేటాడిన కేసులో జైలుకు వెళ్లి వచ్చారు. ఇలా శిక్షలు అనుభవించిన వారంతా చక్కటి జీవితాన్ని గడుపుతున్నారు. శిక్షలు అమలుకాని వారంతా అదే వృత్తిని కొనసాగిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఎక్కడో ఒకటి రెండు తప్ప అన్నీ కేసుల్లోనూ వేటగాళ్లు తెలివిగా తప్పించుకోగలుగుతున్నారు.ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 1984 నుంచి 2018 వరకు ఎన్నో పెద్దపులులు వేటగాళ్ల పంజాకు బలైపోయాయి. కానీ ఏ ఒక్కడికీ శిక్షపడిన దాఖలాలు కనిపించడం లేదు. పెద్దపులులు మృతి చెందిన వివరాలు  1984-85 సంవత్సరంలో సిర్పూర్‌(టి) నుంచి మాకోడి రైల్వే ట్రాక్‌పై పెద్దపులి చనిపోయి కనిపించింది. కానీ అప్పట్లో రైలు ఢీకొనడం వల్లనే పులి మృతి చెందిందని అధికారులు చెప్పారు.  2006లో బెజ్జూరు మండలం పాపన్‌పేట అడవిలో వేటగాళ్లు ఉచ్చువేసి పులిని హతమార్చారు. అప్పట్లో ఏడుగురు వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. కానీ శిక్షలు మాత్రం పడలేదు.  2011లో కాగజ్‌నగర్‌ మండలం ఊట్‌పల్లి చెరువు సమీపంలో పెద్దపులిని చంపారు. అనంతరం దాని చర్మాన్ని మహారాష్ట్రలో విక్రయించేందుకు సన్నాహాలు చేయగా అటవీశాఖ అధికారులు పట్టుకొని చర్మాన్ని స్వాధీనం చేసుకున్నారు. అందుకు సూత్రధారులైన ఇద్దరు వ్యక్తులపై కేసులు నమోదు చేశారు.ఇందులో పురోగతి లేదు. 2016 నవంబర్‌లో బెజ్జూర్‌ మండలం గూడెం నుంచి కాగజ్‌నగర్‌కు ద్విచక్రవాహనం మీద పులి చర్మాన్ని తరలిస్తుండగా అటవీ అధికారులు మాటు వేసి పట్టుకున్నారు. ఇందులోనూ ఇద్దరు వ్యక్తులను అప్పట్లో అదుపులోకి తీసుకున్నారు.  2016 డిసెంబర్‌ నెలలో కోటపల్లి మండలం పిన్నారం అటవీ ప్రాంతంలో విద్యుత్తు తీగలు తగిలి పెద్దపులి మృతి చెందిన ఘటన అప్పట్లో అటవీశాఖలో కలకలం సృష్టించింది. ఇవే కాకుండా జింకలు, దుప్పులు, మెకాలు, సాంబార్లు, కుందేళ్లు ప్రతి రోజు వేటగాళ్ల ఉచ్చులో చిక్కికొని ప్రాణాలు కోల్పోతున్నాయి. కానీ ఎక్కడ ఏ ఒక్కరికి శిక్ష పడకపోవడంతో వాళ్లు వేటను కొనసాగిస్తూనే ఉన్నారు.సాక్ష్యం చెప్పేందుకు ఎవరూ ముందుకు రాకపోవడమే నిందితులకు శిక్షలు పడకపోవడానికి అసలు కారణం. ఒక అటవీ జంతువును వేటాడిన తర్వాత అధికారులకు చిక్కితే పంచనామా నిర్వహించి నిందితులను కోర్టులో హాజరు పరుస్తుంటారు. కానీ తీరా కోర్టుకు వెళ్లాక సాక్షులు లేకపోవడంతో కేసు నీరుగారి పోతుంది. అదే జోథ్‌పూర్‌లో కృష్ణజింకలను వేటాడిన కేసులో భిష్టోయ్‌ తెగ గిరిజనులు గట్టి సాక్ష్యం చెప్పారు. వన్యప్రాణులను ప్రాణప్రదంగా ప్రేమించే భిష్టోయ్‌ తెగకు చెందిన పూనంచంద్‌ భిష్ణోయ్‌ అనే వ్యక్తి సల్మాన్‌ఖాన్‌ కృష్ణ జింకలను తుపాకీతో కాల్చుతుండగా ప్రత్యక్షంగా చూశారు. సాధారణంగా పెద్ద వారి కేసుల్లో సాక్ష్యాలు తారుమారై కేసులు కొట్టుకు పోతుంటాయి. కానీ భిష్ణోయ్‌ తెగవారికి అడవులే దేవాలయాలు, వన్యప్రాణులే పరమపవిత్రం దాంతో ఏ మాత్రం వెనుకంజ వేయకుండా సాక్ష్యం చెప్పడంతో సల్మాన్‌ఖాన్‌కు శిక్ష విధిస్తూ కోర్టు తీర్చు వచ్చింది. మన దగ్గర జరుగుతున్న నేరాల్లోనూ సరైన సాక్ష్యాలను ప్రవేశపెడితే కచ్చితంగా శిక్షలు అమలవుతాయి. ఒకసారి శిక్ష అనుభవించిన వ్యక్తి మరోసారి ఇలాంటి నేరాలకు పాల్పడే అవకాశాలూ తక్కువగానే ఉంటాయి.
Tags: Do you advise hunters?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *