ఈ తిండి తినేదెట్టా..?  

Date:10/11/2018
రాజమహేంద్రవరం ముచ్చట్లు:
జిల్లాలో మధ్యాహ్న భోజన పథకం నవ్వులపాలవుతోంది. రోజూ మధ్యాహ్నం పిల్లలకు పెట్టే భోజనం, కూరలు అధ్వానంగా ఉంటున్నాయి. ముతక బియ్యంతో వండిన అన్నం, నీళ్ల సాంబారు పిల్లలకు పెడుతున్నారు. ఆ భోజనం తినలేక పిల్లలు ఇంటి నుంచి క్యారేజీలు తెచ్చుకుంటున్నారు. పాఠశాల సమీపంలో ఇళ్లున్న పిల్లలు భోజన విరామ సమయంలో ఇంటికెళ్లి తిని వస్తున్నారు. ఇక వారంలో ఐదు రోజులపాటు పిల్లలకు ఉడికించి ఇస్తున్న కోడిగుడ్డు పిట్టగుడ్డును తలపిస్తోంది.
జిల్లాలోని 4,260 ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో సగటున 2.80 లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు 175 గ్రాముల ఆహారం పెట్టి 480 కేలరీల శక్తి, 13 గ్రాముల ప్రోటీన్లు అందివ్వాలి. ఉన్నత పాఠశాలవిద్యార్థులకు ఇచ్చే 262.5 గ్రాముల ఆహారంలో 720.5 కేలరీల శక్తి, 20.6 గ్రాముల ప్రొటీన్లు ఉండాలి.
అయితే ప్రభుత్వం పెడుతున్న ఆహారం ద్వారా ఇవి అందడం అసాధ్యమని పిల్లలకు అందిస్తున్న ఆహారాన్ని పరిశీలిస్తే తెలుస్తోంది. సన్నబియ్యం అందిస్తున్నామంటూ ప్రభుత్వ గణాంకాలు చెబుతుండగా క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. అన్నం, నీళ్ల సాంబారు మూడు రోజులు, మిగతా మూడు రోజులూ మార్కెట్‌లో తక్కువ ధరకు లభించే కూరగాయలు తీసుకొచ్చి వండి వడ్డిస్తున్నారు. ప్రభుత్వం ఇస్తున్న నగదు చాలడం లేదని భోజన పథకం నిర్వాహకులు చెబుతున్నారు.
నగరాలు, పట్టణాలు గ్రామీణ ప్రాంతాలనే తేడా లేకుండా ఆయా పాఠశాలల్లో దాదాపు సగంమంది విద్యార్థులు ఇంటి నుంచే భోజనం తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా 8, 9, 10 తరగతుల విద్యార్థులు పాఠశాలల్లో పెట్టే మధ్యాహ్న భోజనం తినేందుకు ఆసక్తి చూపడంలేదు. ఉదాహరణకు రాజమహేంద్రవరం నగరంలోని దానవాయిపేట ఉన్నత పాఠశాలలో దాదాపు సగంమంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేయడం లేదు.
విద్యార్థులకు వారంలో ఐదు రోజులపాటు మధ్యాహ్న భోజనంతోపాటు కోడిగుడ్డు ఇస్తున్నారు. ఆ గుడ్లు పిట్టగుడ్లను తలపిస్తున్నాయి. ఉడికించక ముందు గుడ్డు 45 గ్రాములుండాలి. అలా ఉంటేనే తీసుకోవాలని అధికారులు చెబుతున్నా గుడ్డు బరువును తూచేందుకు పాఠశాలల్లో ఎలాంటి పరికరాలూ లేవు. రాజమహేంద్రవరం అర్బన్‌ పరిధిలో దాదాపు 50 ప్రాథమిక, ఉన్నత పాఠశాలలకు భోజనం సరఫరా చేస్తున్న ఏజెన్సీ.. గుడ్లు ఉడకబెట్టి సరఫరా చేసే బాధ్యతను అనపర్తికి చెందిన పౌల్ట్రీ వ్యాపారులకు అప్పగించింది. ఉడకబెట్టక ముందు 45 గ్రాములు ఉండాల్సిన కోడిగుడ్డు ఉడకబెట్టిన తర్వాత కూడా 45 గ్రాములు ఉండడం లేదు.
ఉడకబెట్టిన గుడ్డు బరువు నీరు పీల్చుకోవడం ద్వారా పచ్చి గుడ్డు కన్నా పెరుగుతుంది. కానీ పాఠశాలలకు సరఫరా చేసే గుడ్లు ఉడకబెట్టిన తర్వాత కూడా 34, 40, 52 గ్రాములు చొప్పున ఉంటున్నాయి. 50 శాతం గుడ్లు 34 గ్రాములు, 30 శాతం గుడ్లు 40 గ్రాములు, మిలిగిన 20 శాతం గుడ్లు 50 గ్రాముల చొప్పున ఉడకబెట్టిన తర్వాత ఉండడం గమనార్హం. గుడ్లు సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్లు… మార్కెట్‌కు పెద్ద గుడ్లు ఏరి తరలించగా మిగిలిన చిన్న సైజు గుడ్లను పాఠశాలలకు పంపిస్తున్నారు.
విద్యాశాఖ అధికారులు తరచూ తనిఖీలు చేయడం ద్వారా పిల్లలకు నిర్దేశించిన బరువులో ఉన్న గుడ్లు అందే వీలుంటుంది. కాగా, మూడు రోజులపాటు గుడ్లు అందించి, మిగతా రెండు రోజులూ గుడ్ల తాలూకు నగదును కూరగాయలకు కేటాయిస్తే కాసింత మెరుగైన ఆహారం పెట్టేందుకు వీలుంటుందని నిర్వాహకులు అంటున్నారు. లేదంటే మధ్యాహ్న భోజనం కోసం ప్రతి విద్యార్థికీ ఇచ్చే నగదును పెంచితే నాణ్యమైన ఆహారం అందుతుందని వివరిస్తున్నారు.
Tags: Do you eat this food?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *