మీకు భూమి ఉందా….!!!! ?? మీకు గల భూమి పేర్లు రెవిన్యూ బాషలో ఎలా పిలుస్తారో తెలుసుకుందాం….

Date:26/10/2020

అమరావతి ముచ్చట్లు:

రెవెన్యూ భాషలో గ్రామంలో వీఆర్‌ఏలు, వీఆర్వోలు, రెవిన్యూ ఇన్స్పెక్టర్లు గిర్ధావర్‌.. తహసీల్దార్లు మాట్లాడే పదాలు. ఈ పదాలు వినగానే అన్నీ తెలిసిన పదాల మాదిరిగానే ఉంటాయి. అయితే వాటికి అర్థం మాత్రం చాలా మందికి తెలియదు. ముఖ్యంగా వీఆర్వోలు రోజువారీగా ఉపయోగించే పుస్తకాల్లో ఈ భాషే ఎక్కువగా ఉంటుంది. ప్రసుతం మిగతా ప్రభుత్వ శాఖలు దాదాపు ఆంగ్ల పదాలు ఉపయోగిస్తూ మార్పు చెందినా కీలకమైన రెవెన్యూశాఖ మాత్రం అధికారికంగా ఆ పదాలే ఇప్పటికీ వాడుతోంది. ఎందుకంటే రెవెన్యూ శాఖలో భూముల రికార్డులకు సంబంధించి పహాణీ వంటివి శాఖకు ఒక గ్రంథం లాంటిది. దీంట్లో ఈ భాషలోనే పదాలు ఉంటాయి. అందుకే ప్రస్తుతం కొత్తగా ఉద్యోగంలోకి వచ్చిన వారు కూడా ఆ పదాలు నేర్చుకోక తప్పదు. ఈ పదాల్లో కొన్ని మొఘల్‌ చక్రవర్తుల కాలం నుంచి వాడుకలో ఉన్నవి కాగా… ఎక్కువ మాత్రం నైజాం కాలం నాటివి. రెవెన్యూ రికార్డుల్లో ఉండే పదాలు… దానికి అర్థాలు ఏమిటో తెలుసుకుందాం.భూ యజమానులకు అవగాహన ఎంతో అవసరంనేటి కాలంలో రైతులకు యజమానులు భూములు గురించి అవగాహన లేకపోవడం వలన ఏది పడితే అది కొనుగోలు చేసి ఆన్లైన్ చేపించుకోలేక చాలామంది బాధపడుతున్నారు.

 

భూముల గురించి కొంతయినా పరిజ్ఞానం అవసరం. ఎలాంటి భూమిని ఏమంటారనేది చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.ఆసక్తితో కొందరు, వృత్తి రీత్యా తప్పనిసరిగా మరికొందరు వీటి వివరాలను తెలుసుకుంటుంటారు. వ్యవహారికంగా, ప్రభుత్వ పరంగా రెవెన్యూ యంత్రాంగం వ్యవసాయ, నివాస యోగ్యమైన భూములను ప్రత్యేక విభాగాలుగా విభజించి వాటికి పేర్లు ఖరారు చేసింది.ఇదేమీ ఇప్పుడు జరిగిందేమీ కాదు. తాతల కాలం నుంచీ వస్తున్న అధికారిక పరిభాష. భూ సంబంధిత ఆంశాలపై సమాచారం, రెవెన్యూ యంత్రాంగ విధివిధానాలు, చట్టాలు-నిబంధనల క్రమాలపై అవగాహన రైతులకు, భూ యజమానులకు ఎంతైనా అవసరం.అడంగళ్‌ / పహాణీగ్రామంలో సాగు భూముల వివరాలను నమోదు చేసే రిజిస్టరు. దీనిని ఆంధ్ర ప్రాంతంలో అడంగళ్‌, తెలంగాణ ప్రాంతంలో పహాణీ అని పిలుస్తారు. ఈ రిజిస్టరును గ్రామ లెక్క నెంబరు 3 అని కూడా అంటారు. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఈ- ఆడంగల్ /పహాణీలు జారీ చేస్తున్నారు. ఈ రిజిస్టరులో గ్రామంలోని అన్ని భూముల వివరాలను ప్రతి సంవత్సరం నమోదు చేస్తారు.బంచరాయి/పంచరాయిగ్రామంలో పశువుల మేతకు ఉద్దేశింపబడిన ప్రభుత్వ భూమి. గ్రామీణ ప్రాంతాలలో రైతులు, పశువుల పెంపకంపై ఆధారపడి జీవించేవారు అధికంగా ఉంటారు. వారి పశువులకు నిత్యం మేత అవసరం. కాబట్టి నివాసాలకు దూరంగా పచ్చిక ఉన్న ప్రాంతాన్ని పశువులు మేత మేయడానికి ప్రత్యేకంగా ప్రతీ గ్రామంలో గుర్తిస్తారు. ఇది పూర్తిగా ప్రభుత్వ భూమి. ఎవరికీ అధికారాలు ఉండవు.హోమ్‌స్టెడ్‌హోమ్‌స్టెడ్‌ అంటే గ్రామంలో, పట్టణంలో భూమి లేని రైతులు, వ్యవసాయ కూలీలు, వృత్తిపనుల వారు ఇతరులకు సంబంధించిన భూములపై తేదీ 14.8.1975 నాటికి నివాసం ఏర్పర్చుకున్న స్థలాన్ని హోమ్‌స్టెడ్‌ అంటారు. అలాంటి భూముల్లో నివాసం ఉన్నవారికి తాత్కాలికంగా స్థానిక అధికారులు అనుమతులు ఇస్తారు.

 

 

ఆయకట్టు
ఒక జలాధారం కింద సాగవుతున్న వ్యవసాయ భూమి. చెరువులు, కాలువల కింద సాగవుతున్న భూములను ఆయకట్టు అంటారు. ఆయకట్టు భూమిలో వ్యవసాయం మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఆ భూమిలో ఇతర కట్టడాలు, అభవృద్ధి పనులు చేయడానికి ప్రభుత్వం అంగీకరించదు.

ఎకరం భూమి విస్తీర్ణానికి కొలమానము… ఒక ఎకరం 4,840 చదరపు గజములకు సమానము. 100 సెంట్లు లేదా 40 కుంటల భూమిని ఎకరం అంటారు.

అడ్‌వర్స్‌ పొసెషన్‌ : ప్రతికూల స్వాధీనం, ప్రతికూల ఆధీనం… వాస్తవంగా భూమిపై హక్కు ఉన్న వ్యక్తి అనుమతి పొందకుండా ఆ భూమిని వాస్తవంగా, శాంతియుతంగా, నిరవధికంగా, బహిరంగంగా స్వాధీనంలో ఉంచుకొని దానిపై నియంత్రణాధికారాన్ని కలిగి ఉండటాన్ని అడ్‌వర్స్‌ పొసెషన్‌ అంటారు. పట్టా భూమిని 12 సంవత్సరాలు, ప్రభుత్వ భూమిని 30 సంవత్సరాలు స్వాధీనంలో ఉన్నట్లయితే సివిల్‌ కోర్టు ద్వారా యాజమాన్య హక్కులు పొందవచ్చు. జస్టిస్ నాగార్జున రెడ్డిగారి తీర్పు చూడండి

అగ్రహారం : బ్రాహ్మణులకు శిస్తు లేకుండా, తక్కువ శిస్తుతో గ్రాంటుగా ఇచ్చిన గ్రామం లేదా గ్రామంలోని కొంత భాగం.

అజమాయిషీ : సరిగా ఉన్నదీ లేనిదీ తనిఖీ చేయుట… భూమికి సంబంధించి గ్రామ రెవెన్యూ అధికారి నిర్వహించే గ్రామ లెక్కలను తనిఖీ చేయడాన్ని అజమాయిషీ అంటారు. మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌, గ్రామ రెవెన్యూ అధికారి రాసిన లెక్కల్లోని వివరాలను గ్రామంలో తనిఖీ చేసిన భూముల్లో కొన్నింటిని తహసీల్దార్‌ లేదా డిప్యూటీ తహసీల్దార్‌ తనిఖీ చేయాలి. అలా తనిఖీ చేసిన వివరాలను గ్రామ లెక్క నం.3 లో రాస్తారు. అజమాయిషీని ప్రతి సంవత్సరం నిర్వహించాలి.

ఎలియనేషన్‌ : భూమి ఎలియనేషన్‌ అంటే ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వ భూమిని కేటాయించడం. ఎలియనేషన్‌ను వ్యక్తులకు, సంస్థకు, స్థానిక సంస్థలకుచేయవచ్చు. ఎలియనేషన్‌ను ఉచితంగాగాని, కొద్దిపాటి రుసుముతో గాని చేస్తారు.

ఆబాదీ/గ్రామకంఠం : గ్రామంలో ప్రజలు నివసించడానికి ఉద్దేశించిన భూమి. గ్రామ ఉమ్మడి స్థలం. ప్రభుత్వ సభలు, సమావేశాలు ఇక్కడ నిర్వహిస్తుంటారు.వీటికి సర్వే నెంబర్లు కూడా చూసించబడలేదు.

ఆబ్సెంటీల్యాండులార్డు : పరోక్ష భూస్వామి… ఒక గ్రామంలో భూమి ఉండి వేరొకచోట నివాసముంటూ భూమిని సొంతంగా సాగుచేయని భూ యజమాని. భూమిపై హక్కులన్నీ అతడిచే చెందుతాయి.

అసామిషిక్మీ : భూ యజమానికి పన్ను చెల్లించే నిబంధనపై భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్న వ్యక్తి.

అసైన్డ్‌భూమి : భూమి లేని నిరుపేదలకు సాగు చేసుకోవడానికిగాని, ఇళ్లు నిర్మించుకోవడానికి గాని ప్రభుత్వం మంజూరు చేసిన భూమి. ఈ భూమిని వారసత్వంగా అనుభవించాలి. ఇతరులకు అమ్మరాదు, ఏ విధమైన బదిలీ చేయరాదు.

ఏడబ్య్లూడీభూములు : శిస్తును నిర్దారించిన ప్రభుత్వ భూములు, లేదా అసైన్డ్‌ వెస్ట్‌ ల్యాండ్‌ అంటారు. ఏడబ్య్లూడీ భూములు మెట్ట భూములయితే డైల్యాండ్‌ భూములని అంటారు. వీటిని భూమి లేని నిరుపేదలకు అసైన్‌ చేయవచ్చు.

బి మెమో : ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని సాగు చేసుకుంటున్న వ్యక్తికి శిస్తు చెల్లించమని ఆదేశిస్తూ ఇచ్చే నోటీసు.

బందోబస్తు : వ్యవసాయ భూముల సర్వే, వర్గీకరణ.

బంజరు : ఖాళీగా, వ్యర్థంగా ఉన్న ప్రభుత్వ భూమి.

భూమిలేని నిరుపేద : రెండున్నర ఎకరాల పల్లం(నీటి పారుదల భూమి) లేదా ఐదు ఎకరాల మెట్ట భూమికంటే తక్కువ భూమి ఉండి, సంవత్సరాదాయం రూ.11 వేల కంటే తక్కువగా ఉన్నవారు భూమి లేని నిరుపేదలు. వీరు మాత్రమే ప్రభుత్వ భూమిని పొందడానికి అర్హులు.

అసైన్డ్ భూమి
భూమిలేని నిరుపేదలకు సాగు చేసుకోవడానికి, ఇళ్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం మంజూరు చేసిన, కేటాయించిన భూమిని అసైన్డ్‌ భూమి అంటారు. ఈ భూమిని వారసత్వంగా అనుభవించాలి. ఇతరులకు అమ్మడం, బదిలీ చేయడం చేయకూడదు.

భీఘా : భీఘా అంటే 30 కుంటల భూమి. 36.30 చదరపు గజాలతో సమానం.

బిల్‌మక్తా : సాధారణ శిస్తుకంటే తక్కువ శిస్తు నిర్ణయించిన భూమి, గ్రామా న్ని గాని బిల్‌మక్తా అంటారు.

బోర్డు స్టాండింగ్‌ ఆర్డర్లు : రెవెన్యూ పరిపాలనలో విధివిధానాలను సూచిస్తూ అప్పటి బోర్డు ఆఫ్‌ రెవెన్యూ జారీ చేసిన ఉత్తర్వులు. ఇవి ఇప్పటికీ ఉన్నాయి.

చెల్కా : మట్టిలో ఎక్కువ భాగం ఇసుకతో కూడుకున్న భూమి. సాధారణంగా ఈ భూముల్లో నీరు తక్కువగా అవసరం ఉండే పంటలు పండిస్తుంటారు.

చలానా : ఇర్సాలునామా అనగా గ్రామ లెక్క నెంబరు 7. దీనినే చలానా అంటారు. దీని ద్వారానే ప్రభుత్వానికి చెల్లించాల్సిన భూ మి శిస్తు, వగైరాలను వసూలు చేసి నిర్ణీత తేదీల్లో ప్రభుత్వ ఖజానాకు జమ చేస్తారు.

చిట్టా :- చిట్టా అంటే రోజువారీ వసూళ్లు తెలిపే రిజిస్టర్‌. దీనినే గ్రామ లెక్క నెంబర్‌–6అంటారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన నీటిపన్ను, భూమిశిస్తు వగైరా సామి వారీగా వసూలు చేసి ఈ రిజిస్టర్‌లో నమోదు చేస్తారు.

అసామి షిక్మీ :- భూ యజమానికి పన్ను చెల్లించే నిబంధనపై భూమిని కౌలుకు తీసుకుని చేసుకుంటున్న వ్యక్తి.
చౌపస్లా :- పట్టాదారుకు ఉన్న భూముల వివరాలను తెలియజేసే రిజిస్టర్‌. ఇందులో భూ వర్గీకరణ, విస్తీర్ణం,
పట్టాదారు పేరు తదితర వివరాలు ఉంటాయి.

దస్తావేజు :-భూమికి సంబంధించిన కొనుగోలు, అమ్మకాలు, ఇతర లావాదేవీలను తెలియజేయు పత్రం… భూ బదలాయింపు జరిగినపుడు ఈ దస్తావేజును చట్టపరంగా తప్పక రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి.

డైగ్లాట్‌ :-రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో సర్వే సెటిల్‌మెంట్‌ కార్యకలాపాలు పూర్తిచేసి ప్రతి గ్రామంలో భూముల వివరాలను నమోదు చేస్తారు. ఇందులో అన్నిరకాల భూముల సర్వే నంబర్లు, విస్తీర్ణం, అవి సర్కారా, ఇనాం భూములా, మాగాణియా, మెట్ట భూములా, వాటి వర్గీకరణ, శిస్తు మొదలగు వివరాలుంటాయి. ఈ రిజిష్టర్‌ను ఆంగ్లంలో, తెలుగులో రాస్తారు. అందుకే ‘డైగ్లాట్‌’ అంటారు. దీనినే శాశ్వత ఏ రిజిస్టర్‌గా పరిగణిస్తారు. ఈ రిజిస్టరు మిగిలిన గ్రామ రెవెన్యూ రికార్డులన్నిటికీ మూలస్తంభంలాంటిది.

ఎన్‌డార్స్‌మెంట్‌ :- గ్రామంలోని ప్రజలు, ప్రభుత్వ అధికారులకు ఏదైనా దరఖాస్తు చేసుకుంటే దానిపై నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయాన్ని తెలియజేయు విధానం.

ఇజారా :-ప్రభుత్వానికి చెందిన బంజరు భూములను వ్యవసాయానికి గానీ, నివా సం ఉండడానికి గానీ కొంత నిర్ధిష్టమైన పన్ను చెల్లించే పద్ధతిపై లీజుకిచ్చుటను ‘ఇజారా’ అంటారు.

ఫసలీ :-ఫసలీ అంటే ప్రతి సంవత్సరం జులై, 1 నుంచి తరువాతి సంవత్సరం జూన్‌, 30వ తేదీ వరకు ఉన్న 12 నెలల కాలం. దీనిని పంట కాలాన్ని బట్టి రూపొందించారు. ఈ పదం మొగలు చక్రవర్తుల కాలం నుంచి వాడుకలో ఉంది.

ఎఫ్‌ఎంబీ టిప్పన్‌ :-ఇది గ్రామ రెవెన్యూ రికార్డుల్లో ఒకటి. గ్రామంలో ఉన్న అన్ని సర్వే నంబర్ల పటములు ఉంటాయి. వాటి నిర్ధిష్ట కొలతలు కూడా ఉంటాయి.

గట్‌ నంబర్‌/బీడుభూమి :- సాగు భూమిని నిరుపయోగంగా వదిలి వేయడం. దీనిని బీడు భూమి అని కూడా అంటారు.

గుంట(కుంట) :- కుంట అంటే 121 చదరపు గజములు. 40 కుంటలు కలిస్తే ఒక ఎకరా.

జమాబందీ :- జమాబందీ అంటే ప్రభుత్వానికి రావలసిన భూమి పన్ను, నీటి పన్ను, ఇతర బకాయిలు. సక్రమంగా లెక్క కట్టుట, రెవెన్యూ లెక్కల్లోకి తీసుకురాబడినవా లేదా అని నిర్ధారించుటకు గ్రామ, మండల రెవెన్యూ లెక్కల విస్తృత తనిఖీనే జమాబందీ అంటారు. ఈ ప్రక్రియ ద్వారా గ్రామంలో ప్రభుత్వానికి రావలసిన మొత్తం డిమాండ్‌ నిర్ధారింపబడుతుంది. అంతేగాక.. మండలస్థాయి అధికారులందరూ వారు నిర్వర్తించాల్సిన విధులు, సక్రమంగా నిర్వహిస్తున్నారోలేదో పరిశీలించేందుకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా రైతులు తమ సాదకబాధలను రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి ఇది దోహదపడుతుంది. జమాబందీని ఏడాదికి ఒకసారి జిల్లా కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌, జిల్లా రెవెన్యూ అధికారి, ఇతర డిప్యూటీ కలెక్టర్లు నిర్వహిస్తారు.

గిరిజనులకు ఏజెన్సీ : గిరిజనులు నివసించే ప్రాంతం… గిరిజనులు నివసించే ప్రాంతాలను షెడ్యూల్డు ప్రాంతాలుగా ప్రకటించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. ప్రస్తుతం షెడ్యూ ల్డు ప్రాంతాలుగా పిలువబడే ప్రాంతాలను ఏజెన్సీ అంటారు. ఈ ప్రాంతాల్లో ప్రత్యేక పరిపాలన యంత్రాంగం ఉంటుంది.

భూములపై అవగాహన తప్పనిసరి రెవెన్యూలో కీలకమైనది భూములు. అయితే భూములపై ప్రజలకు అవగాహనలేకపోవడంతో ప్రభుత్వ భూములను కొని మోసపోతున్నారు. అందుకే ప్రజలకు భూములపై అవగాహన తప్పనిసరి. పహణీలలో తమ పేరు ఉందోలేదో కచ్చితంగా తెలుసుకోవాలి. రెవెన్యూ వ్యవస్థ ఆన్‌లైన్‌ కావడంతో ప్రజలు ఏవిషయమైనా తెలుసుకునే అవకాశం ఉంది అయితే ప్రజలు దీనిని పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ భూములు సర్కారీ, బంచరాయి, పోరంబోకు అసైన్డు తదితర భూములుంటాయి. అయితే ఈ భూములపై ప్రజలకు అవగాహనలేదు. వీటిని కోనుగోలు చేసి పట్టాదారుదారు పాసుపుస్తకం చేపించుకోలేక తహసీల్దార్ కార్యాలయాలు చుట్టూ 20 సంవత్సరాల నుంచి తిరుగుతున్నారు. భూమిలేని నిరుపేదలు అసైన్డ్ భూములు కోనుగోలు చేసి ఈ పసుపుస్తకం పొందలేదు పోతున్నారు. కొనుగోలు చేసిన రైతులు మధ్యవర్తులతో /బడా బాబులతో డబ్బు అప్పచెప్పుతున్నారు నాకు తహసీల్దార్ తెలుసు నేను పాసు పుస్తకం చేపిస్తానని చెప్పడంతో నమ్మి మోసపోతున్నారు ఇవి ప్రభుత్వ ఆస్తి. కొంతమంది మోసం చేసి ఈభూములు అమ్ముతుంటారు. కనుక ప్రజలు భూములపై అవగాహన పెంచుకోవాలి. ఒక వేళ కోనుగోలు చేసి ఉంటే మీరు సివిల్ కోర్టుకు వెళ్ళి జస్టీస్ నాగార్జున రెడ్డి తీర్పు మేరకు కోనుగోలు చేసినవారు పూర్తిగా (టైటిల్ డిడ్) హక్కులు పొందవచ్చు. కానీ అమ్మడానికి వీలుకాదు. అసైన్డ్ భూములు 1954 సంవత్సరం ముందు ప్రభుత్వం పంపిణీ చేసిన భూములు కొనుగోలు చేయండి.ఎలాంటి ఇబ్బందులు లేవు.

భూసేకరణ_అంటేఏమిటి…?

Tags: Do you have land …. !!!! ?? Let us know how to call the land names you have in Revenue language ….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *