నీటి కటకటకు చెక్ పడుతుందా?

Date:22/03/2018
కరీంనగర్‌  ముచ్చట్లు:
వేసవి వచ్చిందంటే చాలు..తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో తాగు నీటికి సమస్యలు తలెత్తుతున్నాయి. బిందెడు నీటి కోసం ప్రజలు కిలోమీటర్ల మేర నడవాల్సిన పరిస్థితి. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టి ప్రతీ ఇంటికీ సురక్షిత తాగునీరు అందించేందుకు కృషిచేస్తోంది. మిషన్ భగీరథ పేరుతో ప్రతిష్టాత్మక ప్రోగ్రాం చేపడుతోంది. ఈ ప్రాజెక్ట్ పనులు దాదాపు చివరి దశకు చేరుకున్నాయి. కరీంనగర్ లోనూ మిషన్ భగీరథ ద్వారా తాగు నీరు అందించాలని లక్ష్యం ఉన్నా.. పూర్తి స్థాయిలో నెరవేరకపోవచ్చన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. వేసవిలో నీటి కటకట తొలగించేందుకు వివిధ గ్రామాల్లో గ్రామీణ నీటి సరఫరా అధికారుల ప్రణాళికలు రూపొందించారు. అయితే ఈ ప్లాన్స్ కాగితాలకే పరిమితమయ్యాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మిషన్‌ భగీరథ ద్వారా నీటి ఎద్దడి ఉన్న గ్రామాలకు ముందుగా జలాశయాల నుంచి నీటిని నేరుగా గ్రామాలకు చేర్చి తాగునీటి ఎద్దడి నివారించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఏప్రిల్‌లోనే ఈ కార్యక్రమం ప్రారంభించాలని భావిస్తోంది. అయితే ఈ ప్రోగ్రాం ఏ మేరకు ఫలితాన్నిస్తుందో తెలీని పరిస్థితి. వేసవి తీవ్రత క్రమంగా పుంజుకుంటోంది. దీంతో ఇప్పటికే ఉమ్మడి జిల్లా పరిధిలోని పలు గ్రామాల్లో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో తాగునీటికి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 1,555 గ్రామాల పరిధిలో మూడు లక్షలకుపైగా తాగునీటి నల్లా కనెక్షన్లు ఉన్నాయి. ఇవి కాకుండా బోరుబావుల ద్వారా నీరందించే పథకాలు ఉన్నాయి. నీటి సమస్యలు తొలగించేందుకు అధికారులు ప్రత్యామ్నాయ ప్రణాళికలు రూపొందించారు. అయితే ప్రభుత్వం నిధులు ఇచ్చే విషయంలో స్పష్టత ఇవ్వలేదని సమాచారం. గతేడాది బావుల లీజు, రవాణ ద్వారా నీటి సౌకర్యం కల్పించినా వాటికి బిల్లులు చెల్లించలేదని కొందరు అంటున్నారు. పాత తాగునీటి పథకాల నిర్వహణకు సంబంధించిన గుత్తేదారులకు చెల్లించాల్సిన బకాయిలు రెండేళ్లుగా రూ.కోట్లల్లోనే ఉన్నాయని చెప్తున్నారు. మొత్తంగా నీటి కొరత నివారణకు సంబంధించి నిధుల కొరత ఉన్నట్లు తెలుస్తోంది. అత్యవసర పరిస్థితి ఉన్న గ్రామాల్లో గ్రామానికి విడుదలైన 14వ ఆర్థిక సంఘం నిధులను ఖర్చుచేసి తాగునీటి సమస్యను నివారించే ఏర్పాట్లు చేస్తామని అధికారులు చెప్తున్నారు. మరోవైపు తమ వద్ద నిధులు లేవని సర్పంచులు అంటున్నారు. ఏదేమైనా తాగునీటికి ప్రజలు పడుతున్న ఇక్కట్లు గుర్తించి సమస్యను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అంతా ప్రభుత్వం, అధికార యంత్రాంగానికి విజ్ఞప్తిచేస్తున్నారు.
Tags: Does the water tie a check

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *