Does TRS Graf Fall?

టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతుందా?

Date:08/11/2018
హైదరాబాద్‌ముచ్చట్లు:
ఎవరు అవునన్నా కాదన్నా ఇది నిజం. ఆత్మవిశ్వాసమో.. అతివిశ్వాసమో. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలన్న గులాబీ దళపతి కేసీఆర్ ఆలోచన తిరగబడ్డట్టు కనిపిస్తోంది. అసెంబ్లీ రద్దు చేసి సరిగ్గా రెండు నెలలు పూర్తైంది. సెప్టెంబర్ 6న శాసనసభను రద్దు చేస్తూ నిర్ణయం ప్రకటించారు సీఎం కేసీఆర్. అదే రోజు అనూహ్య మలుపులు. రాజీనామా సమర్పించడం.. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్ కోరడం.. దానికి ఆయన అంగీకరించడం… ఆ వెంటనే టీఆర్ఎస్ భవన్ లో అభ్యర్థులను ప్రకటించారు. అయితే అంతకుముందే సెప్టెంబర్ 2న జరిగిన కొంగర కలాన్ ప్రగతి నివేదన సభ నుంచే ఈ రాజకీయ ప్రకటన చేయాలని చూసినా…
అక్కడ బెడిసికొట్టింది. 25 లక్షల మంది జనం వస్తారని టీఆర్ఎస్ వర్గాలు అంచనా వేసినా… దాంట్లో పావు వంతు జనం కూడా రాలేదు. దీంతో డిసప్పాయింట్ అయిన కేసీఆర్.. ఎదో మాడ్లాడేసి వెళ్లిపోయారు. ఓ విధంగా చెప్పాలంటే కొంగరకలాన్ సభే రాష్ట్ర రాజకీయాలను మలుపుతిప్పింది. ప్రగతి నివేదన దేనికోసమో జనానికి అర్థం కాలేదు. అక్కడినుంచే టీఆర్ఎస్ పై వ్యతిరేకత మొదలయింది. ఆ సభ తర్వాత నాలుగు రోజులు గ్యాప్ తీసుకుని అసెంబ్లీని రద్దు చేశారు కేసీఆర్.
ఆ రోజైనా ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందో సహేతుక కారణాలు చెప్పలేక పోయారు. నిజానికి నలుగున్నారేళ్లు కెసీర్ రాష్ట్రాన్ని నిరంకుశంగా పాలించారని ప్రతిపక్షాల ఆరోపణ. అలాంటిది ప్రతిపక్షాలను బూచిగా చూపి రద్దు చేయడమెంటన్న ప్రశ్న జనంలో మొదలైంది.ఇక పోతే అసెంబ్లీని రద్దు చేసి రెండు నెలలు గడిచింది. అప్పుడున్న కారు వేగం ఇపుడు లేదు.
50 రోజుల్లో వంద సభలన్నారు. వాటి ఊసులేదు. క్షేత్రస్థాయిలో అభ్యర్థులపై జనం తిరగబడుతున్నారు. సోషల్ మీడియాలో ప్రభుత్వ పథకాలను పోస్టుమార్టం చేస్తున్నారు. ఒకటేమిటి చెప్పుకుంటూ పోతే టీఆర్ఎస్ వైఫల్యాలపై డిజిటల్ మీడియా పోటెత్తుతోంది. అప్పటిదాకా కిక్కుమనని జనం… ఫీల్డ్ లో తమ ప్రతాపం చూపించడం.65 శాతానికి పైగా జనామోదం ఉందని అసెంబ్లీ రద్దు రోజు ప్రకటించారు కేసీఆర్. కానీ గతవారం ఓ నేషనల్ ఛానెల్ సర్వేలో టీఆర్ఎస్ గ్రాఫ్ 35 శాతానికి పడిపోయినట్టు తేల్చింది. అంటే 30 శాతానికి పైగా పడిపోయిందన్నమాట. రెండు నెలల క్రితం అసలు పోటీలో లేని కాంగ్రెస్… టీఆర్ఎస్ తో నెక్ టు నెక్ ఫైట్ చేసే స్థాయికి ఎదిగింది. సర్వేలను నమ్మాల్సిన పనిలేకపోయినా..
రాష్ట్రవ్యాప్తంగా కారు గుర్తుపై పోటీ చేస్తున్న అభ్యర్థులపై వ్యతిరేకత కళ్ల ముందు కనిపిస్తోంది. అసలు ఏ సంక్షేమ పథకాలైతే తమను గెలిపిస్తాయని క్షేత్రస్థాయికి వెళ్తున్నారో… వాటినే అభ్యర్థుల ముందు పెట్టి నిలదీస్తున్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్లేవి..? మిషన్ భగీరథ నీళ్లేవి..? గిరిజనులకు మూడెకరాల భూమి ఏడిచ్చిన్రు..? ఉద్యోగాలేడ ఇచ్చిన్రు..? కేజీ టూ పీజీ విద్య ఏడ అమలైతున్నది..? ఇట్ల జనం నుంచి బుల్లెట్ల లెక్క దూసుకొస్తున్న క్వశ్చన్స్ తో అభ్యర్థుల దగ్గర సమాధానం లేకుండాపోయింది. అసలు ఏదైనా సమస్యపై స్పందిద్దామన్నా…
ఇంకేదైనా హామీ ఇద్దామన్నా ధైర్యం చాలట్లేదు అభ్యర్థులకు. అంతలా జనం నుంచి రియాక్షన్స్ వస్తుండటంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయింది టీఆర్ఎస్.ఇవి చాలవన్నట్టు… గతంలో టీఆర్ఎస్ అధిష్టానం.. హరీష్ రావు లాంటి ట్రబుల్ షూటర్ అమలు చేసిన వ్యూహాలు.. రివర్స్ లో వాడుతోంది మహాకూటమి. కేసీఆర్ ఫామ్ హౌజ్ కు పరిమితమై వ్యూహాలు రచిస్తుంటే.. ఆయన్నలా వదిలేసి… హరీష్ రావుతో మైండ్ గేమ్ ఆడుతున్నాయి ప్రతిపక్షాలు. హరీష్ రావును అలా ఫిక్స్ చేయడంతో ఆయన గజ్వేల్-సిద్ధిపేటలాంటి నియోజకవర్గాల్లో తప్ప ఎక్కడా పెద్దగా కనిపించట్లేదు. ఫీల్డ్ లో వర్క్ చేస్తున్నది ఒక్క కేటీఆర్ మాత్రమే. టీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్లను అలా ఫిక్స్ చేశాయి ప్రతిపక్షాలు.
టీఆర్ఎస్ నేతలు పదే పదే చెప్పే డైలాగ్ ఒకటుంది కదా. దేశ చరిత్రలోనే.. ప్రపంచ చరిత్రలోనే అని ప్రతీదానికి వల్లెవేసే డైలాగ్. దాన్ని సింప్లిఫై చేసి.. టీఆర్ఎస్ కు అప్లై చేస్తే…. దేశ చరిత్రలోనే ఓ ప్రభుత్వం రెండు నెలల్లో ఇంతలా వ్యతిరేకత మూటగట్టుకున్న చరిత్ర లేదు. ఎన్నికలకు ముందు ఓ అధికార పార్టీ గ్రాఫ్ ఇంత డ్రాస్టికల్ గా పడిపోయిన దాఖలాలూ లేవు. రెండు నెలల్లోనే అస్త్రాలన్నీ వాడేసింది టీఆర్ఎస్.
ఇప్పటికే ఒకటి రెండు విడతలు డబ్బు పంపకాలు కూడా జరిగిపోయాయని.. రాబోయే నెలరోజుల్లో అభ్యర్థుల ఆర్థిక వనరులపైనా ప్రభావం పడనుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.ఇపుడు మహాకూటమి సీట్ల పంపకం… ప్రతిపక్ష అభ్యర్థులకు వ్యతిరేకంగా రెబల్ అభ్యర్థులను రంగంలోకి దించి లాభపడటం అన్న ఒకే ఒక్క వ్యూహం తప్ప కేసీఆర్ అండ్ కో ముందు మిగిలిందేం లేదన్నది విశ్లేషకుల మాట. ఎన్నికలకు ఇక మిగిలింది నెల మాత్రమే. చూద్దాం నెలరోజుల్లో ఏం జరగనుందో. అసలే కేసీఆర్ కు ఓ బిరుదు ఉంది.
ఆయన ఓ స్వయంభూ. తనకు తానే పడిపోగలడు. తనకు తానే ఫినిక్స్ లా లేవగలడు. చరిత్ర చెప్పిన నిజం ఇది. మరి ఈ నెలరోజుల్లో కేసీఆర్ ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తారో చూద్దాం.
Tags: Does TRS Graf Fall?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *