Natyam ad

అవినీతి అధికారులకు చుక్కలు

నిజామాబాద్ ముచ్చట్లు:

నిజామాబాద్ జిల్లాలో పోలీసు అధికారులపై కమిషనర్ కొరడా ఝళిపిస్తున్నారు. గతంలో ఏ పోలీసు బాస్ చేయని విధంగా పోలీసు అధికారుల అవినీతి, వసూళ్లపై కమిషనర్ కె.ఆర్.నాగరాజు నజర్ పెట్టారు. ఫిర్యాదులు వచ్చిన వెంటనే విచారణ జరిపి వేటు వేస్తున్నారు. తాజాగా నిజామాబాద్ జిల్లాలో ముగ్గురు ఎస్సైలను విఆర్‌లకు అటాచ్ చేయడంతో పోలీసు అధికారులకు భయం పట్టుకుంది. దీంతో తర్వాత ఎవరి వంతు అని చర్చించుకుంటున్నారు. గత ఆరు నెలల వ్యవధిలో ఇద్దరు సిఐలు, ఐదుగురు ఎస్సైలు, కింది స్థాయి సిబ్బందిని ఉన్నఫళంగా పదవుల నుంచి తొలగించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రెండ్లీ పోలీసింగ్ అమలు కోసం యత్నిస్తుంటే కొందరు అధికారులు పోస్టింగ్‌లను తెచ్చుకుని స్టేషన్‌లను అడ్డాగా చేసుకుని వసూళ్ళకు తెరలేపుతున్నారు. దీంతో వసూళ్ళు చేస్తూ సెటిల్ మెంట్లు చేస్తున్నారన్నది ప్రధాన ఆరోపణ.నిజామాబాద్ డివిజన్ పరిధిలోని సిరికొండ ఎస్సైని, డిచ్‌పల్లి పీఎస్ -2వ ఎస్సైని, ఆర్మూర్ డివిజన్‌లోని నందిపేట్ ఎస్సైని విఆర్‌కు అటాచ్డ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసు శాఖలో ముగ్గురు ఎస్సైలను విఆర్‌కు అటాచ్డ్ చేయడం కలకలం రేపింది. వారం రోజుల వ్యవధిలో నిజామాబాద్ టాస్క్ ఫోర్స్‌లో ఉన్న ఏఎస్సైని సిసిఆర్ బికి, 1వ టౌన్ పోలీస్ స్టేషన్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్‌కు విఆర్‌కు అటాచ్డ్ చేసిన విషయం తెల్సిందే. బోధన్ రూరల్ సిఐని, నిజామాబాద్ నార్త్ సిఐని రెండు నెలల క్రితం సిద్దిపేట్ పోలీసు కమిషనరేట్‌కు అటాచ్ చేశారు.

 

 

బాల్కొండ నియోజకవర్గంలోని ఇద్దరు ఎస్సైలను నిర్మల్ జిల్లాకు అటాచ్ చేశారు. ఇటీవల కాలంలో సంబంధిత పోలీసు అధికారులపై అవినీతి, బలవంతపు వసూళ్లు, ఇతర ఫిర్యాదులు ఉండడంతో విచారణ చేసి వేటు వేశారు. గత కమిషనర్ కార్తికేయ ఆరు సంవత్సరాలు కమిషనర్‌గా ఉన్న ఒక్కరిపై కూడా వేటు వేయలేకపోయారు. కానీ కమిషనర్ నాగరాజు పోలీసు శాఖలో సిఐలను మొదలుకుని కానిస్టేబుళ్ల వరకు వచ్చిన ఆరోపణలపై వేటు వేస్తుండడం కొందరికి రుచించడం లేదు.పోలీసు కమిషనరేట్ పరిధిలో ఎస్సై నుంచి సర్కిల్ ఇన్స్‌పెక్టర్ పోస్టులన్నీ నాయకుల దయాదాక్షిణ్యాలతో తెచ్చుకుంటూ ఆ తర్వాత అధికారులను బేఖాతారు చేస్తున్నారు. అధికార పార్టీ నేతల అండదండలతో రెచ్చిపోతున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. గతంలో పని చేసిన ఓ ఎస్సై ఏకంగా ఏసీపీని సైతం లెక్క చేయకుండా నేరుగా ఎమ్మెల్యే అండదండలతో రెచ్చిపోయిన చరిత్ర ఉంది. సివిల్ పంచాయతీని, ల్యాండ్ సెటిల్‌మెంట్‌లలోనూ రికార్డు స్థాయిలో కేసులు నమోదు చేసి దండిగా వెనుకేసుకున్నారని ఆరోపణలున్నాయి. తర్వాత కాలంలో నిజామాబాద్‌లో పోస్టింగ్‌ల కోసం యత్నించడం, ఇక్కడ కమిషనర్ కె.ఆర్.నాగరాజు అడ్డుకున్నాడని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. నిజామాబాద్ సబ్ డివిజన్‌లో ప్రస్తుతం కొందరి అధికారుల వ్యవహర శైలిపై ఇప్పటికే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో తర్వాత వంతు ఆ డివిజన్ అధికారులపైననే అని చర్చ పోలీసు శాఖలో నడుస్తుంది.

 

Post Midle

Tags: Dots for corrupt officials

Post Midle

Leave A Reply

Your email address will not be published.