నత్తనడకన డబుల్ బెడ్ రూమ్ నిర్మాణ పనులు

Double bedroom construction work

Double bedroom construction work

 Date:10/09/2018
వరంగల్ రూరల్ ముచ్చట్లు:
వరంగల్ రూరల్ జిల్లాలో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం నత్తనడకన సాగుతున్నట్లు స్థానికులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. పలు ప్రాంతాల్లో పునాదుల స్థాయిలోనే నిర్మాణాలు నిలిచిపోయాయని చెప్తున్నారు. మొత్తంగా ఈ పథకం పనుల్లో పురోగతి లేని పరిస్థితి నెలకొందని అంటున్నారు. పలు ప్రాంతాల్లో అయితే మంజూరైన ఇళ్లు కేవలం పత్రాలకే పరిమితమయ్యాయన్న విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. ఓ వైపు నివేశన స్థలాల సమస్య, మరో వైపు పెరిగిన ధరలతో కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని అందుకే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పనులు వడివడిగా సాగడంలేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఆశించిన స్థాయిలో పథకం అమలు కాకపోవడంతో స్థానిక నేతలు కూడా అయోమయంలో పడ్డారని చెప్తున్నారు. ఇప్పటి వరకు కేవలం వంద మాత్రమే పూర్తి కాగా మరో 48 చివరి దశలో ఉన్నాయి. మిగిలినవి పునాది, ఫిల్లర్ల స్థాయిలోనే నిలిచిపోయాయి. ఇందిరమ్మ పథకం ద్వారా లబ్ధిదారులకు న్యాయం జరగలేదని, అన్ని సౌకర్యాలతో  రెండు పడక గదుల ఇళ్లను నిర్మిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ ఇచ్చారు. ఆ మేరకు గత నాలుగేళ్లలో 9454 గృహాలను కేటాయించారు. ఇప్పటి వరకు 3804 మంజూరు చేసి 1522 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఒక్కో  ఇంటి నిర్మాణానికి రూ. 5.50 లక్షలు ఇవ్వనున్నారు. టెండర్‌ ద్వారా నిర్మాణాలను ప్రారంభించాలి. అయితే ఈ నిర్మాణాలు వేగంగా సాగితేనే లబ్ధిదారులకు త్వరితగతిన గృహాలు అందే అవకాశం ఉంటుంది. వాస్తవానికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం చెల్లిస్తున్న మొత్తంపై కాంట్రాక్టర్లలో కొంత అసంతృప్తి ఉంది. ఈ పనులు నిర్వహిస్తే నష్టపోతామని పలువురు గుత్తేదార్లు భావిస్తున్నారు. అందుకే వారు పెద్దగా ఆసక్తి చూపడంలేదు. కొన్ని నెలల క్రితం టెండర్‌ సమయంలో ఐరన్‌ క్వింటాల్‌కు 3,700 ఉండేది. ప్రస్తుతం ధర ఏకంగా రూ. 5,300 వరకు పెరిగింది. సిమెంట్‌ ధరలూ పెరిగాయి. నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చే డబ్బులు సరిపోవట్లేదని, అదనంగా రూ. లక్షకుపైగా పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని పలువురు కాంట్రాక్టర్లు అభిప్రాయపడుతున్నారు. ఈ కారణాల వల్లే పథకం ఆశించిన స్థాయిలో ముందుకు సాగట్లేదని స్థానికులు అంటున్నారు. ఇదే సమయంలో ఎమ్మెల్యేలు, పలువురు అధికార పార్టీ నేతలు ప్రత్యేక దృష్టి సారించి లబ్ధిదారులకు సమస్యను వివరించారు. నివేశన స్థలం, అదనపు ఖర్చును కొంత భరించేలా చేయడంతో పలు చోట్ల టెండర్లు నిర్వహించారు. ఈ క్రమంలో అలా వర్ధన్నపేట నియోజకవర్గంలోని మూడు, పరకాల నియోజకవర్గంలోని ఐదు మండలాల్లోని 19 గ్రామాల్లో  నిర్మాణాలు ప్రారంభించారు. వీటి పనులు కూడా వేగంగా జరగడంలేదు. దీంతో లబ్ధిదారుల్లో ఆవేదన వెల్లువెత్తుతోంది. ప్రభుత్వం స్పందించి ఇళ్ల నిర్మాణాలు వేగంగా సాగేలా చర్యలు తీసుకోవాలని అంతా కోరుతున్నారు.
Tags:Double bedroom construction work

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *