డబుల్ కష్టాలు

Date:10/08/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
నిరుపేదల సొంతింటికి అడ్డంకులు తప్పట్లేదు. తరచూ చుట్టు ముడుతున్న వివాదాలు ఉన్నత లక్ష్యాన్ని ప్రశ్నార్ధకంగా మార్చాయి. పరిష్కారంలేని సమస్యగా మారటంతో గుత్తేదారు సైతం పనులు చేపట్టలేనని చేతులెత్తేసినట్లు సమాచారం. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు సొంతమవుతుందని ఆశలు పెట్టుకున్న లబ్ధిదారులు సాయం చేయమంటూ ఉన్నతాధికారుల వైపు దీనంగా చూస్తున్నారు. ఇదీ భోజగుట్ట గుడిమల్కాపూర్‌లో ఇళ్ల నిర్మాణంపై నెలకొన్న పరిస్థితి.గుడిమల్కాపూర్‌ భోజగుట్ట ప్రాంతం. చుట్టూ కొండలు. రాత్రివేళ అటువైపు వెళ్లాలంటేనే వెనుకంజ వేసేవారు. తలదాచుకునేందుకు గూడులేని అభాగ్యులు, కూలిపనులు చేసుకునేవారు క్రమంగా అక్కడకు చేరారు. ఎండా, వాన నుంచి రక్షణగా గుడిసెలు వేసుకున్నారు. 2000-3000 కుటుంబాలకు పైగా నివాసం ఉంటున్నాయి. కొందరు సొసైటీలుగా ఏర్పడి స్థలాలు పొందారు. మిగిలిన 13 ఎకరాల విస్తీర్ణంలో గుడిసెలు వేసుకున్న కుటుంబాలు తమకు పట్టాలివ్వాలంటూ అధికారులను ఆశ్రయించారు. 2007లోనే సర్వే నిర్వహించిన అప్పటి ప్రభుత్వం పట్టాలిచ్చేందుకు సిద్ధమైంది.కొందరు ప్రయివేటు వ్యక్తులు ఈ స్థలం తమదేనంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించటంతో అది అటకెక్కింది. 2008లో రెవెన్యూ అధికారులు ఆ స్థలాన్ని జీహెచ్‌ఎంసీకు అప్పగించారు. పేదలకు గృహాలు నిర్మించేందుకు సన్నద్ధమయ్యారు. స్థలం కాజేసేందుకు కన్నేసిన ఓ న్యాయవాది మరోసారి వివాదాల్లోకి నెట్టాడు. ప్రజాప్రతినిధి సాయంతో సొంతం చేసుకునేందుకు పక్కా ప్రణాళికతో దస్త్రాలు సృష్టించారు. దీనిపై రెండేళ్ల క్రితం ఆసిఫ్‌నగర్‌ తహసీల్దార్‌ సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ దస్త్రాలన్నీ నకిలీవిగా నిర్ధారించారు. అడ్డంకులన్నీ తొలగటంతో ప్రభుత్వం గుడిసెవాసులను ఖాళీ చేయించి ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు సిద్ధమైంది. 1824 కుటుంబాలను అర్హులుగా నిర్ధారించారు. కొందరు మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పేదలకు ఉపయోగపడే ఇంటి నిర్మాణానికి అనువుగా న్యాయస్థానం ఆదేశించింది.గతేడాది భోజగుట్ట, జియాగూడ ప్రాంతాల్లో ఒకేసారి రెండుపడకగదుల ఇళ్ల నిర్మాణం పనులు ప్రారంభించారు. జియాగూడలో నిర్మాణాలు పూర్తయి మరో నెలరోజుల్లో గృహప్రవేశం చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. భోజగుట్టలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. కొన్నిచోట్ల పునాది దశ దాటలేదు. ఇబ్బందుల రీత్యా నిర్మాణం చేయలేకపోతున్నట్లు అధికారులకు కాంట్రాక్టర్ తెలిపినట్లు సమాచారం. అధికారులు మాత్రం తమకు గుత్తేదారు నుంచి నోటీసులు అందలేదంటున్నారు. భోజగుట్టలో నిర్మాణ పనులకు కేటాయించిన సమయం ముగియటంతో మరో స్థలాన్ని చూపమంటూ కాంట్రాక్టర్లు కోరినట్లు అధికారులు చెబుతున్నారు. కొందరి స్వార్థం కోసం సృష్టిస్తున్న అడ్డంకులను అధిగమించి తమకు సొంతగూడు అందితే చాలంటూ లబ్ధిదారులు కోరుకుంటున్నారు.
Tags: Double difficulties

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *