17 ఏళ్లలో రెట్టింపైన ఫ్లోరైడ్ సమస్య

Date:16/03/2018
నల్లగొండ ముచ్చట్లు:
నల్లగొండ ఉమ్మడి జిల్లాలో 16 లక్షల మంది ఫ్లోరైడ్‌ ప్రభావానికి గురై వివిధ రకాల వ్యాధులతో బాధపడుతున్నట్టు 2001 నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఈ 17 ఏండ్ల కాలంలో ఆ సంఖ్య రెట్టింపు అయిందని ఫ్లోరైడ్‌ సమస్యపై పోరాడుతున్న సంస్థలు చెబుతున్నాయి. సుమారు 30 లక్షల మంది వరకు ఫ్లోరైడ్‌ వల్ల ఇబ్బందులు పడుతున్నట్టు సమాచారం. వీరిలో 7500 మందికి కాళ్లు, చేతులు వంకర్లు తిరిగి జీవశ్చవాల్లా బతుకీడుస్తున్నారు. మరో 6.50 లక్షల మంది శరీరం దృఢంగా మారి నొప్పులు, రోగాలతో బాధిస్తున్న పరిస్థితి. 9 లక్షల మంది వరకు పండ్ల సమస్యతో బాధపడుతున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ సర్వేలో తేలింది. ఉమ్మడి జిల్లాలో 3477 ఆవాస గ్రామాలుండగా, వీటిల్లో 1150 గ్రామాల్లో 2.50 పీపీఎం నుంచి 13.0 పీపీఎం వరకు ఫ్లోరైడ్‌ ప్రభావం ఉన్నట్టు గుర్తించారు. ఈ గ్రామాలకు ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించిన తాగునీటి పథకాల ద్వారా కృష్ణా జలాల్ని సరఫరా చేస్తున్నారు. అవి జనాభా అవసరాలకు సరిపోకపోవడం, వారంలో ఒకటి రెండుసార్లు మాత్రమే రావడంతో స్కీమ్‌ బోరు నీళ్లను తాగి బతుకుతున్నారు. కొందరు అనివార్యంగా క్యాన్‌ నీళ్లను కొనుగోలు చేసి తాగాల్సిన పరిస్థితి. మునుగోడు, దేవరకొండ ఫోరైడ్‌ ప్రభావిత గ్రామాల్లో నాలుగు దశల్లో మిషన్‌ కాకతీయ కింద చెర్వుల్ని పూడిక తీశారు. సుమారు 900 చెర్వుల వరకు పూడిక తీసినట్టు రికార్డులు చెబుతున్నాయి. పూడిక తీయడం ద్వారా చెరువుల్లో నీరు నిల్వ ఉండి, చుట్టుపక్కల గ్రామాల్లో భూగర్భ జలాలు పెరుగుతాయి. కానీ..! పూడికతీత పనుల్లో నాణ్యత లేకపోవడం, వర్షాలు సంవృద్ధిగా కురవకపోవడంతో ఎక్కువ చెరువుల్లో నీరు లేదు. మునుగోడు మండలంలో కొంపెల్లి చెర్వు తప్ప 10 చెర్వుల్లో పూడిక తీసినప్పటికీ చుక్క నీరు నిల్వలేదు. నాంపల్లి మండలంలో అతిపెద్ద చెర్వుగా ఉన్న పసుపులేటి చెర్వుకు కోటీ రూపాయల వరకు ఖర్చు చేసి పనులు చేసినా చుక్క నీరు లేదు. మర్రిగూడం, నారాయణపురం మండలాల్లోనూ ఇదే పరిస్థితి. ఫ్లోరైడ్‌ సమస్యకు మిషన్‌ భగీరథ పథకమే పరిష్కారం అని ప్రభుత్వం చెబుతోంది. ఫ్లోరైడ్‌ ప్రాంతాలుగా ఉన్న దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల్లో భగీరథ పనులు పూర్తవ్వలేదు. నల్లగొండ జిల్లాలో 31 మండలాల్లో 1,492 వాటర్‌ ట్యాంకుల్ని నిర్మించాల్సి ఉండగా, 1,062 పనులే ప్రగతిలో ఉన్నాయి. 2,766 కిలోమీటర్ల పైప్‌లైన్లు వేయాల్సి ఉండగా, 110 కిలో మీటర్లు మాత్రమే పూర్తయింది. జిల్లాలో 3,26,609 ఇండ్లు ఉండగా ఇప్పటి వరకు 1,222 ఇండ్లకు మాత్రమే నల్లా కనెక్షన్‌ ఇచ్చారు. దేవరకొండ, పీఏపల్లి, కొండమల్లెపల్లి, చింతపల్లి, నేరేడుగొమ్మ, చందంపేట మండలాల్లో 655 ఆవాస గ్రామాలకు 403 వాటర్‌ ట్యాంకులు కట్టాల్సి ఉండగా 267 ట్యాంకుల పనులు మాత్రమే నడుస్తున్నాయి. 411 కిలోమీటర్ల పైప్‌లైన్లకుగాను 21 కిలో మీటర్లే పూర్తయింది. 61,617 ఇండ్లకుగాను 995 ఇండ్ల్లకే నల్లా కనెక్షన్లు ఇచ్చారు. మునుగోడు, చండూరు, మర్రిగూడ, నాంపల్లి మండలాల్లోని 208 ఆవాస గ్రామాల్లో 179 వాటర్‌ ట్యాంకులు నిర్మించాల్సి ఉండగా, 135 పనులే ప్రగతిలో ఉన్నాయి. ఇక్కడ 50,280 ఇండ్లుండగా ఒక్క కనెక్షన్‌ ఇవ్వలేదు. ఫ్లోరైడ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలంటే రక్షిత తాగునీరే కాదు రక్షిత సాగునీరూ ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. ఫ్లోరైడ్‌ గ్రామాలకు పాత స్కీమ్‌ల ద్వారా కొత్తగా మిషన్‌ భగీరథ ద్వారా రక్షిత కృష్ణా జలాల్ని సరఫరా అవుతుంది. రక్షిత నీరు తాగినప్పటికీ తినే ఆహార పదార్థాలన్నింటిలోనూ ఫ్లోరైడ్‌ విషం చేరుతుండటంతో సమస్య నుంచి విముక్తులు కాలేకపోతున్నారు. ఎస్సెల్బీసీ సొరంగం, డిండి లిప్టు పథకాల్ని పూర్తి చేసి సాగు నీరూ ఇవ్వడం ద్వారా ఫ్లోరైడ్‌ సమస్య నుంచి విముక్తి పొందొచ్చు. టీఆర్‌ఎస్‌ నాలుగేండ్ల పాలనలో మూడేండ్లు సొరంగం పనులే చేయలేదు. ఇటీవలే మొదలయ్యాయి. డిండి పనులు ప్రారంభించిన మొదట్లో తప్ప తర్వాత వేగం లేదు. నిర్వాసితులకు పరిహారం ఇవ్వకుండా నాన్చుడు వల్ల పనులు జరగట్లేదు. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తవ్వాలంటే మరో ఐదారేండ్లు పట్టే అవకాశం ఉంది.
Tags: Double Fluoride problem in 17 years

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *