Natyam ad

పొత్తులపై సందేహాలు…

విజయవాడ ముచ్చట్లు:


టీడీపీ, జనసేన పొత్తు లాంఛనమేనని కాసేపు అంటారు. పవన్ వ్యాఖ్యలు కొద్దిసేపు పొత్తును చిత్తు చేసేట్లుంటాయి. కింది స్థాయి కార్యకర్తలు కలిసి పోతున్నట్లు చెప్పుకుంటారు. మరికొన్ని చోట్ల పరస్పరం కత్తులు దూసుకుంటుంటారు. ఈ రెండు పార్టీల మధ్యలో బీజేపీ పెద్దన్న పాత్ర పోషిస్తోంది. టీడీపీతో కలిసేది లేదని బీజేపీ నేతలు చెబుతుంటారు. మరోవైపు చంద్రబాబు, పవన్ ఎవరి పాటికి వాళ్లు నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లోని ఆశావహులకు పొత్తు ఉంటుందో లేదో అర్థంగాక తలలు పట్టుకుంటున్నారు. క్షేత్రస్థాయి కార్యకర్తల నుంచి నియోజకవర్గ స్థాయి నేతలదాకా పొత్తు అర్థంగాని బ్రహ్మ పదార్థంలా మారింది. ఈ దోబూచులాట ఇంకెన్నాళ్లంటూ ఇరు పార్టీల శ్రేణుల్లో అయోమయం నెలకొంది. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో పొత్తుల గురించి ఎక్కడా ప్రస్తావించడం లేదు. వారాహి యాత్రకు ముందు ఒకట్రెండు సార్లు పవన్తో కలిసి చర్చించారు. ఉమ్మడి కార్యాచరణతో పనిచేస్తే కింది స్థాయిలో కార్యకర్తలు కలిసేందుకు మార్గం సుగమం అవుతుందని భావించారు. అందుకు అనుగుణంగానే పవన్ కూడా టీడీపీతో పొత్తు అనివార్యమనే సంకేతాలు ఇచ్చారు. సొంతంగా పోటీ చేసి పార్టీ భవిష్యత్తును త్యాగం చేయలేనని చెప్పుకొచ్చారు. అవసరమైతే బీజేపీతో కటీఫ్ చెప్పేస్తాననేదాకా వెళ్లారు. ఆ తర్వాత పవన్ ప్రధాని మోడీని కలిశారు.

 

 

 

అప్పటికీ ఆయన నిర్ణయాల్లో మార్పు రాలేదు.వారాహి యాత్ర నుంచి జనసేనాని వైఖరిలో మార్పు కనిపించింది. పొత్తుల గురించి తానింకా ఆలోచించలేదని స్పష్టం చేశారు. కార్యకర్తలు తనను సీఎం కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. రెండు సార్లు సీఎంగా అవకాశమిస్తే తానేంటో నిరూపించుకుంటానన్నారు. బీజేపీ–జనసేన కూటమి సీఎం అభ్యర్థిగా పవన్ను ప్రకటించడానికి కమలనాథులు అంగీకరించడం లేదు. దీంతో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని.. ఎవరికెన్ని సీట్లు వస్తాయో ఆ ప్రాతిపదికన సీఎం ఎవరనేది నిర్ణయిస్తామని పవన్ ప్రకటించారు. బీజేపీ–టీడీపీ మధ్య కూర్చొని చర్చించుకోవాల్సిన అంశాలున్నట్లు కూడా పవన్ వెల్లడించారు.ఈ పరిణామాలన్నింటినీ నిశితంగా పరిశీలిస్తున్న చంద్రబాబు మాత్రం ఎక్కడా నోరు విప్పడం లేదు. బీజేపీ నిజంగా వైసీపీ సర్కారుపై పోరాడాలనుకుంటే చేతల్లో చూపించాలని ఒకే ఒక్కసారి బయటపడ్డారు. ఇప్పటికీ వైసీపీ సర్కారుకు బీజేపీ పెద్దలు వెన్నుదన్నుగానే నిలుస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాలా సహకరిస్తునారు. రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎంకు మించి అప్పులు చేసిందని పురందేశ్వరి ఆరోపిస్తుంటే.. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం అబ్బే.. అంతగా అప్పులేమీ చేయలేదని వెనకేసుకొచ్చారు. టీడీపీకి బీజేపీతో కలవాలని ఉన్నా అటు నుంచి ఎలాంటి సంకేతాలు వెలువడడం లేదు.

 

 

Post Midle

అసలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పురందేశ్వరిని నియమించింది టీడీపీని దెబ్బతీయడానికేనని తమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారు. జనసేన, బీజేపీతో పొత్తు పార్టీ భవిష్యత్తు కు ప్రమాదమని చంద్రబాబును హెచ్చరిస్తున్నారు.పొత్తుల విషయంలో పవన్, బీజేపీ పెద్దలు ఆడుతున్న గందరగోళం గేమ్ వెనుక అసలు ఉద్దేశం వేరే ఉందని విశ్వసనీయ సమాచారం. ఈ రెండు పార్టీలు పొత్తులో ఎక్కువ సీట్లు దక్కించుకోవడానికే మరింత అయోమయం సృష్టిస్తున్నట్లు తెలుస్తోంది. ఈలోగా ఈడీ, ఐటీ, సీబీఐలాంటి సంస్థలను ఉసిగొల్పి టీడీపీ ఆయువుపట్టు మీద దెబ్బకొట్టే యోచనలో ఉన్నట్లు వినికిడి. ఇలా టీడీపీని మరింత ఆందోళనలోకి నెట్టి పొత్తులను తెరమీదకు తేవాలని కాషాయ పెద్దల ప్లాన్ అయ్యుండొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తద్వారా జనసేన, బీజేపీ వీలైనన్ని ఎక్కువ స్థానాలను దక్కించుకొని పోటీ చేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ ఎత్తుగడను టీడీపీ ఎలా ఎదుర్కొంటుందనేది వేచి చూడాల్సిందే.

 

Tags: Doubts on alliances…

Post Midle