కాలువలకు కావాలి ప్రణాళిక (కృష్ణాజిల్లా)

Date:17/09/2018
మచిలీపట్నం ముచ్చట్లు:
జిల్లాలో ఇటీవల వరకు పంట పొలాలు ముంపు బారిన పడ్డాయి. ఇప్పుడు నీళ్లు లేక ఎండిపోతున్నాయి. అంతంత మాత్రంగా వస్తున్న నీటిని ఒడిసి పట్టేందుకు మోటారు ఇంజిన్లతో కుస్తీ పడుతున్నారు. ఎగువన కురిసిన వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజీకి వరద రావడంతో గేట్లన్నీ  ఎత్తివేసి సముద్రంలోకి వదిలేశారు. జలాశయాలు నిండడంతో ఖరీఫ్‌తోపాటు రబీ సాగుకు ఇబ్బందులు లేవని భావించారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఖరీఫ్‌ పంటకైనా సక్రమంగా నీరు అందుతుందా? అన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
తూర్పు, పోల్‌రాజ్‌కాలువలతోపాటు బల్లిపర్రు, ఆకుమర్రు, గుడ్లవల్లేరు లాకుల కింద కాలువలకు తక్కువ నీరు సరఫరా అవుతోంది. వచ్చిన నీటిని ఎగువ ప్రాంతాల రైతులు మోటారు ఇంజిన్ల ద్వారా తోడేసుకుంటున్నారు. శివారు భూములకు నీరు చేరడంలేదు.
జిల్లా వ్యాప్తంగా ఈ ఖరీఫ్‌లో 2.32 లక్షలకుపైగా వరి పంట సాగు కావాల్సి ఉండగా ఇప్పటికి 2.29 లక్షల హెక్టార్లు సాగయ్యింది. బందరు మండలంలోని హుస్సేన్‌పాలెం తదితర ప్రాంతాలతోపాటు పలు మండలాల్లోని శివారు పొలాల్లో ఇంకా కొన్ని చోట్ల నాట్లు వేస్తూనే ఉన్నారు. పుష్కలంగా నీళ్లు ఉన్నాయని మెట్ట ప్రాంతాల రైతులు కూడా నారు కొనుగోలు చేసి నాట్లు వేయడానికి సిద్ధమవుతున్నారు.
సాగర్‌ జలాలు వస్తే అక్కడ నుంచి పులిచింతల్లో నిల్వచేసి పట్టిసీమ నీటితో కలిసి అన్నింటి సమన్వయం చేసుకుంటూ సరఫరా చేయాలని అధికారులు భావించారు. ఇప్పుడు పట్టిసీమ నీటినే అన్ని ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ నీటి మట్టం 12 అడుగులు  ఉండగా ప్రస్తుతం 10 అడుగులకు పడిపోయింది. దీంతో పట్టిసీమే ఆధారంగా మారింది.
జిల్లా అవసరాల మేరకు పట్టిసీమ ద్వారా 8,500 క్యూసెక్కులకుపైగా నీటిని విడుదల చేయాలని యోచిస్తున్నారు. ‌జిల్లాలో ప్రధాన కాలువల ద్వారా వచ్చే నీటిని వంతుల వారీ విధానం ద్వారా అన్ని ప్రాంతాలకు అందించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.  మధ్యలో తలెత్తుతున్న సమస్యల కారణంగా శివారుకు నీరు చేరడంలేదు.
బందరు కాలువకు ప్రతిరోజూ 1200 క్యూసెక్కుల నీరు వస్తోంది. ఆ నీటిని వివిధ సెక్షన్ల వారీగా పంచుకోవాల్సి ఉంటుంది. కంకిపాడు లాకుల వద్ద 200 క్యూసెక్కులు, వీరంకి లాకుల వద్ద 500 క్యూసెక్కులు, నిడుమోలు సెక్షన్‌కు  250 క్యూసెక్కులు, బందరు సెక్షన్‌కు 280 క్యూసెక్కులు వినియోగించుకోవాల్సి ఉంటుంది. వంతుల వారీగా వినియోగించుకునేలా చర్యలు తీసుకున్నారు.
వీరంకి లాకుల వద్ద వారికి ఇచ్చే నీటికంటే ఎక్కువ  వినియోగించుకుంటున్నారని అధికారులు తెలిపారు.  500 క్యూసెక్కులు వాడుకోవాల్సి ఉండే 600 క్యూసెక్కులకుపైగా వాడేస్తున్నారు. నిడుమోలు వద్ద కూడా అదే పరిస్థితి. బంటుమిల్లి తదితర కాలువల్లో ముందుగా ఎగువన ఉన్న భూములకు సాగునీటిని వాడేస్తుంటే దిగువన ఉన్నవారు ఇబ్బందులు పడుతున్నారు.
రామరాజుపాలెం కాలువకు 200 క్యూసెక్కులు, బందరు కాలువకు 250 క్యూసెక్కుల చొప్పున నీటిని వదులుతున్నట్లు చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఆ మాత్రం ఉండటం లేదు. ఆకుమర్రు లాకుల నుంచి మల్లవోలుకు వెళ్లే కాలువ నీటిమట్టం 120 నుంచి 150 క్యూసెక్కులు మాత్రమే ఉంటుంది.  250కిపైగా క్యూసెక్కులు విడుదల అయితేనే శివారు ప్రాంతాల వరకు నీళ్లు వెళ్తాయి.
లాకుల వద్ద షట్టర్లు మరమ్మతులకు గురవడంతో నీరు వృథాగా పోవడంతోపాటు అన్ని ప్రాంతాలకూ సక్రమంగా అందడంలేదు. గుడ్లవల్లేరు లాకుల నుంచి పెడన, బంటుమిల్లి, కృత్తివెన్ను, ముదినేపల్లి తదితర మండలాలకు నీరు సరఫరా అవుతోంది. వచ్చిన నీరు ఆయా కాలువల పరిధిలోని ఎగువ ప్రాంతాలకే సరిపోతుంది. దిగువకు వెళ్లపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అధికారుల సహకారంతో  లాకులను దించేసి ఎగువన ఉన్న ప్రాంతాలవారు వాడేసుకుంటున్నారని దిగువ రైతులు వాపోతున్నారు. మల్లేశ్వరం లాకులకే  నీళ్లు రావడం లేదని  వాపోతున్నారు. ఇక్కడే నీళ్లు లేకపోతే కృత్తివెన్నుకు ఎలా వెళ్తాయో తెలియడంలేదు.
మల్లేశ్వరం, కమలాపురం లాకుల వద్ద షట్టర్లు పాడైపోయాయి.  ప్రకాశం బ్యారేజీ నుంచి వచ్చే నీరు దిగువకు చేరడానికి అనేక ఆటంకాలు, పలు సమస్యలు   ఏర్పడుతున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి వచ్చిన నీటిని సక్రమంగా అన్ని ప్రాంతాలకు అందించేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది.
Tags:Drainage Planning (Krishna Ganesala)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *