కాలువలు కబ్జా 

Date:19/05/2018
హైదరాబాద్‌ ముచ్చట్లు:
జిల్లాలో నిజాం సాగర్ ప్రధానకాలువకున్న సబ్ కెనాల్స్, పంట కాల్వలు ఎక్కువగా ఆక్రమణకు గురవుతున్నాయి… ఇవన్నీ ఒకప్పుడు పట్టణాలు, గ్రామాలకు దూరంగా ఉన్నాయి. క్రమంగా వీటి విస్తీర్ణం పెరగడంతో కాల్వలను కబ్జా చేసి ‘రియల్‌’దందా నడిపిస్తున్నారు. బీర్కూర్‌, నస్రుల్లాబాద్‌, రుద్రూర్‌ మండలాల్లో బోధన్‌, నిజామాబాద్‌ నగరం, ఆర్మూర్‌ పట్టణాల్లో కాల్వలపై కట్టడాలు వెలుస్తున్నాయి.
అంకాపూర్‌ శివారు నుంచి ఆర్మూర్‌ ఒడ్డెరకాలనీ వరకు నిజాంసాగర్‌ ప్రధాన కాల్వ కట్టలపై కొన్ని వందల తాత్కాలిక నివాసాలు, శాశ్వత నిర్మాణాలు వెలిశాయి.  ఆక్రమణల వల్ల కాల్వలు ఇరుకుగా మారాయి. రైతులు  ద్విచక్రవాహనాలు, ట్రాక్టర్లపై వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లడానికి ఇబ్బందికరంగా మారింది.  మొదట్లో కేవలం ఆర్మూర్‌ పట్టణ నడిబొడ్డున ఉన్న ప్రధాన కాల్వలకు ఇరువైపులా ఆక్రమణలు ఉండేవి. ప్రస్తుతం ఏకంగా కొన్ని కిలోమీటర్ల  పొడవునా ఆక్రమణలు వెలిశాయి. ఇంకా వెలుస్తూనే ఉన్నాయి
నిజాంసాగర్‌ ప్రధాన కాల్వ, ఉప కాల్వలపై ఆక్రమణలను ప్రోత్సహించడంలో కొంతమంది నాయకులు పోటీపడుతున్నారు. పేదల వద్ద డబ్బులు తీసుకొని గుడిసెలు వేయిస్తున్నారు. తర్వాత గుట్టుచప్పుడు కాకుండా గృహాల నిర్మాణం చేయిస్తున్నారు. అద్దెలు చెల్లించే స్తోమతలేని పేదలు కాల్వ కట్టపై నివాసముండాలంటే స్థానిక నాయకులకు ఎంతో కొంత ముట్టజెప్పక తప్పని పరిస్థితి ఉంది. ఆర్థికస్థితివంతులు సైతం కాల్వ కట్టలపై కట్టెలు పాతి ఆక్రమించేస్తున్నారు. తర్వాత స్థలాలను ఇతరులకు విక్రయిస్తున్నారు.ఆర్మూర్‌ పట్టణంలో నిజాంసాగర్‌ ప్రధాన కాల్వ నుంచి జిరాయత్‌నగర్‌కు వెళ్లే ఉప కాల్వ ఆనవాళ్లే కనుమరుగయ్యాయి. రిజిస్ట్రేషన్‌ కార్యాలయం పక్క నుంచి జిరాయత్‌నగర్‌కు ఉప కాల్వ ఉండేది. నీళ్లొచ్చినప్పుడు జలకళకళలాడేది. కొందరు ఈ కాల్వను పూడ్చేసి భవనాన్ని నిర్మించారు.ప్రస్తుతం ఈ కాల్వ ఎక్కడుందో కనిపించడం లేదు. ఆర్మూర్‌ పట్టణంలో మామిడిపల్లి వెంకటేశ్వర కాలనీ నుంచి పెర్కిట్‌ చెరువుకు వెళ్లే ఉప కాల్వ ఆక్రమణల కారణంగా నిరుపయోగంగా మారిపోయింది. జాతీయరహదారికి రెండువైపులా భవనాలు, దుకాణ సముదాయాలు నిర్మించి కాల్వను పూడ్చేశారు. చెరువుకు నీరు వెళ్లే పరిస్థితి లేదు. ఉప కాల్వను నిరుపయోగంగా మార్చేసి కాల్వను ఆక్రమించి  భవనాలను నిర్మిస్తున్నారు.ఆర్మూర్‌ పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలో స్థలాల ధరలు ఆకాశాన్నంటాయి. రూ.లక్షలు పెట్టి స్థలాలు కొనుగోలు చేయడం ఎందుకని పలువురు నిజాంసాగర్‌ ఉప కాల్వపై కన్నేశారు. సమీపంలో నివాసముంటున్న కొంతమంది కొద్దికొద్దిగా ఉప కాల్వను ఆక్రమించేసి తమ నివాసాలను విస్తరించుకున్నారు. మరికొంతమంది కొత్త ఇళ్లు నిర్మిస్తున్నారు. ఉప కాల్వతో ఉపయోగం లేదని, ప్రభుత్వ అవసరాలకు వాడుకోవచ్చని నీటిపారుదలశాఖ అధికారులు ప్రభుత్వానికి సూచించినా, ప్రభుత్వపరంగా వినియోగించుకొనే ప్రయత్నం చేయడంలేదు. రూ.కోట్ల విలువైన స్థలాలకు సంరక్షణ కరవై ఆక్రమణలకు గురవుతున్నాయి. భవిష్యత్తులో ప్రభుత్వ అవసరాలకు అందకుండా పోతున్నాయి.  ఆర్మూర్‌ జర్నలిస్ట్‌కాలనీనుంచి పెర్కిట్‌ చెరువుకు వెళ్లే కాల్వను స్థిరాస్తి వ్యాపారులు, కొందరు ఇళ్ల యజమానులు ఇష్టారాజ్యంగా దారిమళ్లిస్తున్నారు. జర్నలిస్ట్ కాలనీ శివారులో గృహనిర్మాణదారులు కాల్వను ఇరుకుగా మార్చేశారు. దీని వల్ల ప్రధాన కాల్వ నుంచి నీటిని విడుదల చేసినప్పుడు చెరువుకు నీళ్లు చేరడం కష్టంగాఉంది. ఆదిలోనే ఆక్రమణలను అరికట్టాల్సిన బాధ్యత నీటిపారుదలశాఖ అధికారులపై ఉండగా, శాశ్వత కట్టడాలు నిర్మించే వరకు పట్టించుకోవడం లేదు. తర్వాత సర్వే చేసి కట్టడాలను గుర్తించి ప్రభుత్వానికి నివేదిస్తున్నారు. రెవెన్యూ అధికారులు, పురపాలకశాఖవారు వాటిని కూల్చేయాలని పేర్కొంటున్నారు. నీటిపారుదల, రెవెన్యూ, పురపాలక, పోలీసుశాఖల మధ్య సమన్వయలోపం కారణంగా ఆక్రమణల జోలికి వెళ్లడంలేదు. నిజాంసాగర్‌ ప్రధాన కాల్వకు ఆర్మూర్‌ ప్రాంతం చివరి ఆయకట్టు.. ప్రాజెక్టు నుంచి నీరు రాక కాల్వలు శిథిలావస్థకు చేరి గతంలో ఆక్రమణలకు గురయ్యాయి. గుత్ప ఎత్తిపోతల పథకంద్వారా ప్రస్తుతం గోదావరి జలాలు కాల్వల ద్వారా వస్తున్నాయి. పాత ఆక్రమణలను తొలగించాల్సింది పోయి కొత్తగా విచ్చలవిడిగా జరుగుతున్న ఆక్రమణలను సైతం అధికారులు పట్టించుకోకపోవడం విస్మయం కలిగిస్తుంది. ఉప కాల్వలు కనుమరుగైపోతే భవిష్యత్తు అంధకార బంధురంగా మారే ప్రమాదం కనిపిస్తోంది.
Tags: Drains canvas

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *