అంతటా తాగునీటి ఎద్దడి

Drinking water throughout

Drinking water throughout

Date:24/11/2018
మచిలీపట్నం ముచ్చట్లు:
జిల్లాలోని పల్లెల్లో తీవ్రతాగునీటి ఎద్దడి నెలకొంది. ఎక్కడా గుక్కెడు నీళ్లు దొరికే పరిస్థితి కనిపించడం లేదు. ఎండనపడొచ్చిన చుట్టానికి కాలుకడుక్కున్న తర్వాత కాసింత మంచితీర్థం ఇవ్వడం పల్లెటూరి సంప్రదాయం.. ఆ తర్వాతే భోజనం.. బంధువు ఆకలి తీరాకే మాటామంతీ.. మరి అలాంటి ఊళ్లలో ప్రజలు దాహం కేకలు పెడుతున్నారు. దూర ప్రాంతాల నుంచి కొనుక్కొని తెచ్చుకుంటున్నారు.. గొంతు తడపాల్సిన పథకం అలంకారమయ్యింది.. గుక్కెడు మంచి నీళ్లు దొరక్క ఊరు అల్లాడిపోతోంది.. నిర్మాణాలకు ప్రజాధనం ఖర్చయిపోతోంది.. శుద్ధ జలం చుక్క రాలనంటోంది..
కృత్తివెన్ను మండలం సీతనపల్లిలోని మెగా రక్షిత పథకం 14 పంచాయతీలకు  తాగునీరందించాలి. రూ. 24 కోట్లు ఖర్చు చేసి 2014లో ప్రారంభించారు. జనం అరకొర జలంతోనే సరిపెట్టుకుంటున్నారు. నిడమర్రు పంచాయతీ ఎస్సీ వాడకు ఫలితం దక్కలేదు. పడతడిక పంచాయతీ అడవిదొడ్లు గ్రామానికి పైపులైను కనెక్షన్లే లేవు. లక్ష్మీపురం  పల్లెపాలెం, మాట్లం గ్రామాలకు సక్రమంగా నీరు రావడంలేదు. తరకటూరు సామూహిక రక్షిత నీటి పథకం 110 గ్రామాల ప్రజలతోపాటు బందరు, పెడన పురపాలక సంఘాలకూ  ఆధారం..  1.80 లక్షల జనాభా ఉన్న జిల్లా కేంద్రం బందరులో రోజు విడిచి రోజు అదీ గంటపాటు నీరొస్తోంది..
విస్సన్నపేట మండలం తెల్లదేవరపల్లిలో రూ. 20 కోట్లతో పథకం ఏర్పాటయ్యింది. 13 గ్రామాలకు తాగునీరివ్వాలి. నిధులు ఖర్చయ్యాయి. నీటి నిల్వ చేసే ట్యాంకులు కట్టారు. ఒక్క చుక్క నీరు ఇవ్వలేదు.   ఇబ్రహీంపట్నం ఫెర్రీ నుంచి జి.కొండూరు, మైలవరం, ఎ.కొండూరు మీదుగా తిరువూరు పైపులైన్లు వేసి 60 వేల మందికి తాగునీరందించేందుకు ఏర్పాటయ్యింది. నిధులైతే మంజూరయ్యాయి. పనులు చేపట్టలేదు. తిరువూరు నగర పంచాయతీకి రోజు విడిచి రోజు, కొన్ని కాలనీలకు రెండురోజులకోసారి  గంటపాటు నీరిచ్చి సరిపుచ్చుతున్నారు. ప్రతి ఊళ్లో రక్షిత నీటి పథకం.. దానికి అనుసంధానంగా సంపు, ఫిల్టర్‌ బెడ్‌, పంప్‌హౌస్‌ తదితరాలతోపాటు నిండా కుళాయిలు.. మరి ఇవి ప్రజల దాహాన్ని తీరుస్తున్నాయా అంటే అదీ లేదు. ఇటీవల బంటుమిల్లి మండలం చోరంపూడి గ్రామంలో నిర్వహించిన గ్రామవికాసం కార్యక్రమంలో  తాగునీటి సమస్యపై స్థానికులు ప్రజాప్రతినిధికి మొరపెట్టుకున్నారు. జిల్లాలోని చాలా గ్రామాల్లో ఇదే  పరిస్థితి నెలకొంది. బంటుమిల్లి మండలంలోని చోరంపూడి, మల్లంపూడి,  నాగన్నచెరువు తదితర గ్రామాలకు నెలల తరబడి నీరు అందడం లేదని ఆయా గ్రామాల ప్రజలు  మొరపెట్టుకున్నారు. అయినా ఇంతవరకు సమస్య పరిష్కారం కాలేదు.  గూడూరు మండలంలోని మేజర్‌ పంచాయతీ మల్లవోలులో సక్రమంగా నీరు అందక పోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తరచుగా సమస్య  ఏర్పడటంతో కలెక్టర్‌కు  మొరపెట్టుకున్నారు. సామూహిక రక్షిత పథక నిర్మాణానికి నిధులు మంజూరైనా ఇంతవరకు పనులు ప్రారంభం కాలేదు. ముదినేపల్లి మండలంలోని వైవాక, వణుదుర్రు తదితర గ్రామాల్లో నీళ్లు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శింగరాయపాలెం, చేవూరు, గురజ, వడాలి తదితర గ్రామాల్లో  పథకాలున్నా ఉపయోగపడడంలేదు. మండవల్లి, కైకలూరు, కలిదిండి మండలాల్లో ఇదే పరిస్థితి.  ‌పెడన మండలంలోని చెన్నూరు, చేవెండ్ర, ఉరివి, నడుపూరు, ముచ్చర్ల కొంగంచర్ల తదితర గ్రామాల్లో పథకాలున్నా చుక్కనీరు తాగడానికి పనికిరావడంలేదు. ఇక్కడ నేల బావులే ఆధారం. చేవెండ్ర గ్రామంలో  పథకం ఉంది. దానికి అనుసంధానంగా ఏర్పాటు చేసిన చెరువు గుర్రపుడెక్కతో నిండి పాడైపోవడంతో వేరే చెరువు తవ్వారు.  అది కూడా ఉపయోగపడడంలేదని స్థానికులు వాపోతున్నారు. పంచాయతీ పరిధిలోని చేవెండ్రపాలెం గ్రామానికి నీళ్లు వచ్చి ఏళ్లు గడిచిపోయాయి. కుళాయిలు పాడైపోతున్నాయి.  జిల్లా వ్యాప్తంగా 38 సామూహిక పథకాలు ఉన్నాయి. వీటి నిర్వహణ సక్రమంగా లేదు. మల్లేశ్వరం, ఉప్పలకలవగుంట, ముక్కొల్లు ఇలా వివిధ ప్రాంతాల్లో నిర్మించినవాటి నిర్వహణ సక్రమంగా ఉంటే ఉపయోగం.
Tags:Drinking water throughout

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *