అక్కరకు వస్తున్న డ్రోన్లు

కడప ముచ్చట్లు:


మారుతున్న కాలానికి తోడు ఆధునిక వ్యవసాయం వైపు అడుగులు వేసేలా రాష్ట్ర ప్రభుత్వం రైతులను ప్రత్యేకంగా ప్రోత్సహిస్తోంది. ఎప్పటికప్పుడు వ్యవసాయంలో వస్తున్న నూతన విప్లవాత్మక మార్పులను రైతుల ముంగిటకు తెస్తూ అధిక దిగుడులకు కృషి చేస్తోంది. మరోవైపు రైతు భరోసా కేంద్రాలను పల్లె ముంగిటకు తెచ్చి ఎల్లప్పుడూ రైతులకు సలహాలు, సూచనలతోపాటు అవసరమైన సమస్యలు తీర్చేలా కొత్త ఒరవడి సృష్టించారు.ప్రస్తుతం వ్యవసాయ పద్ధతుల్లో సులువైన రీతులను కనుగొంటూ వ్యవసాయాన్ని పండుగ చేసేలా ప్రభుత్వం ముందుకు వెళుతోంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన డ్రోన్లను రైతన్నలకు సబ్సిడీపై అందించి తోడ్పాటును ఇస్తున్నారు. కిసాన్‌ డ్రోన్లు పురుగు మందుల పిచికారీతోపాటు.. విత్తనాలు, ఎరువులు చల్లడం తదితర అనేక ఉపయోగాలు ఉన్నాయి.  అన్నమయ్య జిల్లాలో 30 మండలాలు ఉన్నాయి. ఒక్కొక్క మండలానికి మూడు డ్రోన్లను అందించాలని వ్యవసాయశాఖ ప్రణాళిక రూపొందించింది.

 

 

 

అందులో భాగంగా ఐదుగురు రైతులు గ్రూపుగా ఏర్పడి దరఖాస్తు చేసుకోవాలి. అందులో చదువుకున్న వారు (టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీ) ఒకరు ఉండాలి. ఎందుకంటే డ్రోన్‌ ఆపరేట్‌ చేసేందుకు చదువుకున్న వ్యక్తికి నెల రోజులపాటు శిక్షణ ఉంటుంది. ఆపరేట్‌ చేసే విధానం నేర్పించడంతోపాటు ప్రత్యేకంగా కోర్సుకు సంబంధించి లైసెన్స్‌ సర్టిఫికెట్‌ అందించనున్నారు. 2022–23 సంవత్సరానికి సంబంధించి అన్నమయ్య జిల్లాలో మండలానికి మూడు చొప్పున 90 డ్రోన్లు అందించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.  జిల్లాలో రైతన్నలకు డ్రోన్ల ద్వారా అనేక ప్రయోజనాలు అందనున్నాయి. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఉన్నా ఆపరేట్‌ చేయడానికి అవకాశం ఉంటుంది. తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో పిచికారీ చేయవచ్చు. అలాగే కూలీల అవసరం కూడా తగ్గిపోతుంది. ఎత్తుగా పెరిగే అరటి, చీనీ, జామ, నేరేడు, సపోట తదితర పంటలకు మరింత అనువుగా ఉంటుంది. వర్షం కురిసినా.. తేమ ఉన్నా.. డ్రోన్‌తో పిచికారీ చేయడంగానీ.. చెట్లకు స్ప్రే సత్తువ అందించడానికి డ్రోన్‌ ప్రయోజనకరంగా మారనుంది. ఇంకా విత్తనం చల్లేందుకు కూడా అవకాశం ఉంటుంది.

 

 

 

జిల్లాకు కేటాయించిన డ్రోన్‌ యంత్రాల విషయంలో భారీగా సబ్సిడీ వర్తించనుంది. ఒక్కో డ్రోన్‌ విలువ దాదాపు రూ. 10 లక్షలుగా నిర్ణయించారు. అందులో 10 శాతం రైతుల వాటా చెల్లించాలి. మిగిలిన 90 శాతంలో 40 శాతం సబ్సిడీ వర్తిస్తుంది. అంటే రూ. 10 లక్షలు విలువజేసే డ్రోన్‌ యంత్రంపై రూ. 4 లక్షల వరకు సబ్సిడీ ఉంటుంది. అదే డిగ్రీ, డిప్లొమా (అగ్రికల్చర్‌) చదివిన వారికి 50 శాతం మేర రాయితీని కల్పించారు.  జిల్లాలో మొత్తం 30 మండలాల్లో 400 ఆర్బీకేలు ఉండగా 236 ఆర్బీకేల పరిధిలో రైతులకు సబ్సిడీ ట్రాక్టర్లను అందించారు. అయితే పలు మండలాల్లోని 164 ఆర్బీకేల పరిధిలో సబ్సిడీపై అందించే ట్రాక్టర్లకు దరఖాస్తు చేసుకోలేదు. దీంతో ప్రభుత్వం రైతులకు మరో అవకాశం కల్పించింది. రూ. 15 లక్షల విలువైన ట్రాక్టర్‌తోపాటు పరికరాలు అందించనున్నారు.  రైతు వాటా 10 శా తం పోను 40 శాతం సబ్సిడీ ఉంటుంది.జిల్లాలో రైతులు ఐదుగురు గ్రూపుగా ఏర్పడి ఆర్బీకేల పరిధిలో దరఖాస్తు చేసుకోవాలి. మండలానికి మూడు చొప్పున జిల్లాకు 90 వరకు అందించేందుకు అవకాశం ఉంది. ఈనెల 31వ తేదీలోగా ఆర్బీకేలలో సంప్రదించాలి. ఒక్కొక్క డ్రోన్‌ విలువ రూ. 10 లక్షలు కాగా ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తోంది. డీసీసీ బ్యాంకు ద్వారా డ్రోన్‌కు అందించే రుణాలను తిరిగి కంతుల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది.

 

Tags: Drones coming there

Leave A Reply

Your email address will not be published.