గంజాయిపై డ్రోన్స్ నిఘా

Date:13/03/2018
రాజమండ్రి ముచ్చట్లు:
విశాఖ అడవుల్లో సాగవుతున్న గంజాయి తోటలపై డ్రోన్స్ కెమెరాల ద్వారా నిరంతర నిఘా పెట్టామని, శాటిలైట్ చిత్రాల ఆధారంగా తోటలను ధ్వంసం చేస్తున్నామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కెఎస్ జవహర్ తెలిపారు. గంజాయి సాగును నిర్మూలించడానికి దట్టమైన అడవుల్లో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. వై రామవరం మండలం పరిధిలో సాగవుతున్న గంజాయిని ఇంకా 20 ఎకరాల వరకు ధ్వంసం చేయాల్సివుందని, మిగిలినదంతా ధ్వంసం చేశామన్నారు. విశాఖ జిల్లా పాడేరు ప్రాంతంలో పదివేల ఎకరాల్లో గంజాయి సాగవుతున్నట్టు గుర్తించామని, ఇందులో 3400 ఎకరాల్లో ధ్వంసం చేశామన్నారు. శాటిలైట్ చిత్రాల ద్వారా సాగు ప్రాంతాన్ని గుర్తించి ధ్వంసం చేస్తున్నామన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 1.62 లక్షల కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారని, అదేవిధంగా 1.18 లక్షల కిలోలు ఎక్సైజ్ శాఖ పట్టుకుందని, ఎక్సైజ్ పట్టుకున్న గంజాయిలో 75 కేజీల వరకు మాత్రమే తగులబెట్టాల్సివుందన్నారు. ఎక్కడైనా ఎంఆర్‌పీ కంటే అధికంగా మద్యం విక్రయాలు జరిగితే తన నెంబర్‌కు ఫిర్యాదు చేయాలన్నారు. రాష్ట్రంలో 94 శాతం బెల్ట్ షాపులు రద్దయ్యాయని రియల్ టైమ్ గవర్నెన్స్ నివేదిక ఇచ్చిందని, మిగిలిన 4 శాతం కూడా త్వరలో నిర్మూలించి బెల్ట్ షాపుల రహిత ప్రాంతాలుగా మారుస్తున్నామన్నారు. నవోదయం పథకంలో సారా రహిత గ్రామాలుగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఇప్పటివరకు 9 జిల్లాల్లో సారా తయారీ, అమ్మకం, సరఫరాను నిరోధించగలిగామన్నారు.
Tags: Drones intelligence on cannabis

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *