ఉరవకొండలో కరువు ఛాయలు

Date:10/11/2018
అనంతపురం ముచ్చట్లు:
ఉరవకొండ నియోజకవర్గ పరిధిలో కరువు ఛాయలు అలుముకుంటున్నాయి. ఐదు సంవత్సరాల నుంచి వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు పండటం లేదు. దీంతో ఉపాధి కరువై రైతులు, వ్యవసాయ కూలీలు వలసబాట పడుతున్నారు. గ్రామాల్లో వలసలు నివారించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిరుపయోగంగా మారుతోంది. ఎందుకంటే ఈ పథకం కింద పని చేసినా సకాలంలో కూలి డబ్బులు అందడం లేదు. దాదాపు నాలుగు మాసాలవుతున్న బిల్లులు అందకపోవడంతో వలసలు శరణ్యంగా మారాయి.
ఉరవకొండ ఏపీడీ పరిధిలో వజ్రకరూరు మండలంలో 18 గ్రామ పంచాయతీల్లో 16403 జాబ్‌కార్డులు ఉండగా, 4500 మంది కూలీలు పని చేస్తున్నారు. వీరందరికీ నాలుగు నెలల నుంచి రూ.23,6200 బకాయిలు ఉన్నాయి. ఉరవకొండ మండలంలో 17 గ్రామ పంచాయతీలకు సంబంధించి 19914 జాబ్ కార్డులు ఉండగా, 17615 మంది పని చేయగా దాదాపు రూ.22 లక్షలు బకాయిలు ఉన్నాయి. విడపనకల్లు మండలంలోని 17 పంచాయతీల్లో 13489 జాబ్‌కార్డులు ఉండగా 9157 మందికి రూ.6,56,000 బకాయిలు ఉన్నాయి. గుంతకల్లు మండలంలో 13030 జాబ్‌కార్డులు ఉండగా 3122 మందికి రూ.10 లక్షల బకాయిలు ఉన్నాయి.
కష్టపడి చేసినా ప్రభుత్వం సక్రమంగా బిల్లులు చెల్లించకపోవడంతో చేతిలో చిల్లిగవ్వ లేక పస్తులు ఉండాల్సి వస్తోందని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తుంగభద్ర ఎగువ కాలువలో గుంతకల్లు బ్రాంచ్, హెచ్చెల్సీ కింద సాగు చేసిన మిర్చి పంటకు వైరస్ తెగులు సోకడంతో పూర్తిగా తొలగించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో రైతులు లక్షలాది రూపాయలు నష్టపోయారు. ఫలితంగా ఇళ్లలో పూట కూడా గడవని పరిస్థితి. ఈనేపథ్యంలో నియోజకవర్గంలోని ఉరవకొండ మండలంలోని బూదగవి, వ్యాసాపురం, విడపనకల్లు మండలంలో డోనెకల్లు, మాలాపురం,
వేల్పుమడుగు, వజ్రకరూరు మండలంలో ఎన్‌ఎన్‌పీ తండా తదితర గ్రామాల్లోని వ్యవసాయ కూలీలు పది రోజుల నుంచి ఇతర ప్రాంతాలకు వలసలకు వెళ్తున్నారు. బెంగళూరు, తిరుపతి, రైల్వే కోడూరు, గుంటూరు, హోస్పేట్ తదితర ప్రాంతాలకు వలసలు వెళ్లడంతో ఇళ్ల వద్ద వృద్ధులు, చిన్నారులు దర్శనం ఇస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గ్రామీణ ప్రాంతాల్లో సక్రమంగా ఉపాధి పనులు కల్పించడంతోపాటు విధిగా బిల్లులు చెల్లించాలని రైతులు, రైతు కూలీలు కోరుతున్నారు.
Tags; Drought in Uroorongada

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *