కరవు ఛాయలు 

 Date:14/09/2018
మహబూబ్ నగర్ ముచ్చట్లు:
పాలమూరు ఉమ్మడి జిల్లాలో మరోమారు కరవు ఛాయలు నెలకొన్నాయి. వర్షాకాలం మొదలై మూడు నెలలు గడిచిపోయినా ఇప్పటి వరకు సరైన వర్షాలు కురవలేదు. కర్ణాటకలో కురిసిన భారీ వర్షాలకు కృష్ణ, తుంగభద్ర నదులకు వరదలు వచ్చి జలాశయాలు నిండినా.. ఉమ్మడి జిల్లాలో వర్షాల్లేక చెరువులు, కుంటలు నిండలేదు. విస్తారంగా వర్షాలు కురిస్తేనే భూగర్భ జలాలు పెరుగుతాయి.
అలాంటిది ప్రస్తుతం భూగర్భ జలాల పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. మరోపక్క కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ తాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భూగర్భ జల మట్టాలు పూర్తి తగ్గిపోవడంతో బోర్లల్లో నీళ్లులేక వేేసిన వరినారును రైతులు నాట్లు వేయకుండానే వదిలేస్తున్నారు.
పత్తి, ఆముదం, కంది తదితర పంటలు వాడుపడుతున్నాయి. నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులంబ గద్వాల జిల్లాలో ఎత్తిపోతల పథకాలు, సాగునీటి కాల్వల పుణ్యమా అంటూ అక్కడి పరిస్థితి కొంత పరవా లేదనిపించినా.. మహబూబ్‌నగర్‌ జిల్లాలో మాత్రం ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి. జూన్‌ మొదటి వారం, జులై రెండో వారంలో కురిసిన జల్లులతో మెట్ట పంటలు కొంత పచ్చగా కనిపిస్తున్నా.. దిగుబడి వచ్చేది ప్రశ్నార్థకమేనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలు మండలాల్లో వర్షాల్లేక.. పంటల పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండటంతో అప్పుడే వలసలు మొదలయ్యాయి. పశుగ్రాసం సమస్య కూడ తలెత్తుతోంది.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో జూరాల, నెట్టెంపాడు, కోయిలసాగర్, కేఎల్‌ఐ, భీమా ఫేస్‌-1, ఫేస్‌-2 కింద కొన్ని ప్రాంతాలకు సాగునీరు అందుతోంది. వాటి కింద మాత్రమే ఈ ఖరీఫ్‌లో వరి పంటను సాగుచేశారు. మెట్ట ప్రాంతాల్లో అప్పుడప్పుడు కురిసిన వర్షాలకు వేసిన పంటలు ప్రస్తుతం వాడుపడుతున్నాయి. ఏటా బోర్లకింద సాగుచేసే వరిని ఈసారి సాగు చేయలేదు.
అక్కడక్కడ నారు మళ్లు సైతం వాడుపట్టి రైతులు వాటిని అర్ధంతరంగా వదిలేశారు. ప్రధానంగా నారాయణపేట, కోస్గి, మద్దూర్, నవాబుపేట, గండీడ్, భూత్పూర్, బాలానగర్‌ తదితర ప్రాంతాల్లో వేసిన మొక్కజొన్న, కంది, ఆముదం, పత్తి పంటలు సైతం ఎండిపోతున్నాయి. వాటికితోడు మొక్కజొన్నకు కత్తెర పురుగు, పత్తికి గులాబి పురుగు ఆశించింది. ఆయకట్టు కింద సాగుచేసిన వరికి కాండం తొలుచు పురుగు సోకింది. ఒక్క జొన్నపంట తప్ప ఇతర పంటలు ఆశజనకంగా లేవు.
ఉమ్మడి జిల్లాలో గడిచిన ఆరేళ్లలో నాలుగు ఏళ్లు కరవు అన్నదాతలను వెంటాడింది. గతేడాది జూన్‌లో వర్షాల్లేక మొక్కజొన్న, పత్తి పంటలు దెబ్బతిన్నాయి. అక్టోబర్‌లో కురిసిన వర్షాలు కాస్త ఆశలు కలిగించినప్పటికీ కరవు కోరల నుంచి జిల్లా రైతులను గట్టెక్కించలేకపోయాయి. ఉమ్మడి జిల్లాలో 690 నోటిఫైడ్‌ చెరువులు, 4 వేలు నాన్‌నోటిఫైడ్‌ చెరువులు ఉన్నాయి. ఇవి దాదాపు ఆరేళ్ల నుంచి పూర్తిగా నిండటం లేదు. కొన్ని ప్రాంతాల్లో నిండితే మరి కొన్ని ప్రాంతాల్లో నిండలేదు.
Tags:Drought shade

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *