చుక్కేస్తేనే డ్రైవింగా? డిసెంబర్‌లోనే అధికం!

drunk and drive cases bangalore commissioner punishments  

drunk and drive cases bangalore commissioner punishments  

సాక్షి

Date :20/01/2018

ఐటీ సిటీలో భారీగా డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు

2017లో రికార్డుస్థాయిలో 73వేల నమోదు

డిసెంబర్‌లోనే 10 వేల కేసులు

పనిచేయని పోలీసు హెచ్చరికలు

ఐటీ సిటీ డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసుల్లో దూసుకుపోతోంది. సాయంత్రం కాగానే బార్లు, పబ్బులు కిటకిటలాడిపోతుండగా, చీకటిపడేకొద్దీ మందుబాబులు మత్తులో డ్రైవింగ్‌ చేస్తూ వారితో పాటు ఇతరుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నారు. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నప్పటికీ డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు తగ్గడం లేదు, ఇంకా పెరుగుతూనే వస్తున్నాయి.

సాక్షి, బెంగళూరు: సిలికాన్‌ సిటీ రోడ్లపై మందుబాబులు రెచ్చిపోతున్నారు. తాగి వాహనాలను నడుపుతూ కేసుల్లో ఇరుక్కుపోతున్నారు. ఇలా ఏకంగా గతేడాది 73,741 డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర పోలీసు విభాగం చరిత్రలో ఇదొక రికార్డు. 2016తో పోలిస్తే 25 శాతం అధికంగా కేసులు పెరిగాయి. పోలీసు శాఖ ఎన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నా మందుబాబులు వాటిని బేఖాతరు చేస్తున్నారు.

మద్యం సేవించి వాహనం నడిపితే డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు చేస్తాం, జైలుకు పంపిస్తామని హెచ్చరిస్తున్నా పరిస్థితిలో ఎలాంటి మార్పు రావడం లేదు. మందు తాగాక క్యాబ్‌లలో ఇంటికెళ్లాలని, డ్రైవర్‌ సహాయం తీసుకోవాలని పోలీసు శాఖ మార్గదర్శకాలు సూచిస్తున్నా పట్టించుకునేవారు లేరు. ఆశ్చర్యకరంగా అధిక సంఖ్యలో స్కూల్‌ బస్సులు, అంబులెన్సుల డ్రైవర్లు సైతం మద్యం సేవించి పోలీసులకు దొరికిపోతున్నారు.

డిసెంబర్‌లోనే అత్యధిక కేసులు…

  • మూడేళ్లుగా డిసెంబర్‌ నెలలోనే అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. కొత్త సంవత్సరం ఊపుతో మద్యం వినియోగం భారీగా పెరుగుతోంది. 2017లో నమోదైన కేసుల్లో 10,517 ఒక్క డిసెంబర్‌ నెలలో నమోదైనవే. 2016, డిసెంబర్‌లో 6,666 మంది, 2015 డిసెంబర్‌లో 9,461 మంది పట్టుబడ్డారు.
  • ఇక డిసెంబర్‌ 30వ తేదీన నమోదయ్యే కేసుల సంఖ్య మరొక ఎత్తు. కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ ఆ రోజు మద్యం అమ్మకాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. 2016 డిసెంబర్‌ 30న 1,090 డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు, 2017 డిసెంబర్‌ 1,187 కేసులు రికార్డు చేశారు.

కేసులు
2015 : 62,576
2016 : 59,028
2017 : 73,741

కఠిన శిక్షలు ఉంటేనే మార్పు 
బెంగళూరు అదనపు ట్రాఫిక్‌ కమిషనర్‌ ఆర్‌.హితేంద్ర మాట్లాడుతూ.. 2017లో రికార్డు స్థాయిలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు నమోదయ్యాయని తెలిపారు. ‘ఇప్పటివరకు ఇదే అత్యధికం. తనిఖీలను విస్తృతంగా చేపట్టడం వల్ల ఇంత భారీ మొత్తంలో కేసులు వెలుగుచూశాయి. నిందితుల డ్రైవింగ్‌ లైసెన్సులను రవాణా శాఖ రద్దు చేస్తేనే వారిలో పరివర్తన వచ్చే అవకాశముంది. పట్టుబడితే రూ. 2 వేల జరిమానా కట్టి ఇళ్లకు వెళ్లిపోతున్నారు. మూడు నెలల తర్వాత తిరిగి లైసెన్స్‌ తెచ్చుకుంటున్నారు. కఠిన శిక్షలు అమలు చేస్తేనే మార్పు వస్తుంది’.   

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *