డొక్కుబస్సులే దిక్కే

Date:18/09/2018
నల్లగొండ ముచ్చట్లు:
జిల్లాలో పల్లెవెలుగు సర్వీసులకు డొక్కు బస్సులే దిక్కవుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోని ఏడు డిపోల పరిధిలో 766 బస్సులు సేవలు అందిస్తున్నాయి. వీటి ద్వారా సంస్థకు రోజుకు సుమారు రూ.92 లక్షల ఆదాయం సమకూరుతోంది. లక్షలాది రూపాయల ఆదాయంవస్తున్నా కాలం చెల్లి ప్రమాదకరంగా తయారైన బస్సులను ఉపసంహరించడంలో అధికారులు నిర్లిప్తత ప్రదర్శిస్తున్నారు.
వాటి స్థానంలో కొత్తవి రాకపోవడమే కారణంగా చెబుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 84 వరకు కాలం చెల్లిన బస్సులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇవి విపరీతమైన శబ్దాలతో నడుస్తుంటాయి. అందులో ఎక్కువగా పల్లెవెలుగు బస్సులే. రోడ్లు సరిగా ఉండవనే సాకుతో ఆదాయం రావడంలేదని వాటిని పల్లెబాట పట్టిస్తున్నారు. ఎక్స్‌ప్రెస్‌ బస్సులు దారి మధ్యలో మొరాయించినట్లు ప్రత్యామ్నాయంగా వేరే బస్సుల్లో ప్రయాణికులను పంపిస్తున్నారు.
కానీ పల్లెవెలుగు బస్సులు మధ్యలో ఆగిపోతే అంతే సంగతులు.గత ఆగస్టు 5న సూర్యాపేట డిపోనకు చెందిన కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు పెన్‌పహాడ్‌ మండలంలో అదుపుతప్పి రోడ్డు పక్కకు వెళ్లింది. సూర్యాపేట నుంచి మిర్యాలగూడ వెళ్తుండగా పెన్‌పహాడ్‌ మండలం మాచారం సమీపంలో బస్సు స్టీరింగ్‌ రాడ్డు పట్టేసింది.
చోదకుడు వాహనాన్ని రోడ్డు పక్కన పొలాల్లోకి తీసుకెళ్లారు. ఆ సమయంలో బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ఉన్నారు. రోడ్డు పక్కన లోయ ఉంటే పెను ప్రమాదమే సంభవించేది. పొలాలు ఉండటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రెండేళ్ల క్రితం నూతనకల్‌ మండలం పెద్దనెమిల గ్రామ శివారులో మహబూబాబాద్‌ డిపో ఆర్టీసీ బస్సు స్టీరింగ్‌ కంట్రోల్‌ రాడ్డు విరిగింది. ఆ సమయంలో బస్సులో 23 మంది ఉన్నారు. చోదకుడు చాకచక్యంగా వ్యవహరించడంతో ఎవ్వరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.
సూర్యాపేట డిపోలో మొత్తం ఆర్టీసీ బస్సులు 74 ఉన్నాయి. అద్దె బస్సులు 45 ఉన్నాయి. ఈ ఏడాది కాలంచెల్లిన 26 బస్సులను సర్వీసు నుంచి తొలగించారు. నిబంధనల ప్రకారం సుమారు 15 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించిన బస్సులను తొలగించాలి. వాస్తవంగా 12 లక్షల వరకు తిరిగిన బస్సులు ఎక్కువగా మొరాయిస్తుంటాయని చోదకులు పేర్కొంటున్నారు.
ప్రస్తుతం సూర్యాపేట డిపోలో సుమారు పదిహేను బస్సులు 12 లక్షల కిలోమీటర్లకుపైగా తిరిగి సర్వీసులను కొనసాగిస్తున్నాయి. వీటన్నింటినీ పల్లె వెలుగు బస్సులుగా తిప్పుతున్నారు. ఆర్టీసీ గ్యారేజీలో ప్రతి రోజూ చిన్న చిన్న మరమ్మతులు చేపడుతూ నెట్టుకొస్తున్నారు. మంగళవారం జగిత్యాల జిల్లా కొండగట్టులో జరిగిన ప్రమాదంతోనైనా ఆర్టీసీ అధికారులు అప్రమత్తం కావాల్సి ఉంది. ఇలాంటి కాలం చెల్లిన బస్సులను తొలగించి, ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సి ఉంది.
Tags; Duck bikes

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *