వాహానాలపై బాదుడు

హైదరాబాద్ ముచ్చట్లు:

ఖజానా నింపుకోడానికి రాష్ట్ర ప్రభుత్వం మరో పన్ను వడ్డింపు నిర్ణయం తీసుకున్నది. బైక్ మొదలు బస్సు వరకు అన్ని వాహనాల లైఫ్ టాక్స్ ను పెంచుతూ జీవో జారీ చేసింది. కొత్త, పాత వాహనాలన్నింటికీ ఈ మార్పు వర్తించనున్నది. డీజిల్ సెస్, బస్సు చార్జీలు, విద్యుత్ చార్జీలు, రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచిన ప్రభుత్వం ఇప్పుడు లైఫ్ టాక్స్ ను కూడా పెంచడంపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి తీసుకున్న నిర్ణయం మేరకు రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమవారం జీవో జారీ చేశారు. లైఫ్ టాక్స్ పెంపు నిర్ణయం ద్వారా ప్రభుత్వానికి సుమారు రూ. 1400 కోట్ల మేర అదనపు ఆదాయం సమకూరనున్నది. పాత తేదీ (మే 7)తో జీవోను  తక్షణం  అమల్లోకి వస్తున్నట్లు పేర్కొన్నారు.లైఫ్ టాక్స్ ను పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు  చేస్తోంది.ఆ ప్రకారమే ఇప్పుడు జీవో వెలువడింది. తెలంగాణ మోటార్ వెహికల్స్ టాక్సేషన్ యాక్ట్ (1963)లో పేర్కొన్న చార్జీలను పెంచుతూ దానికి అనుగుణంగా మూడవ, ఆరవ, ఏడవ షెడ్యూళ్ళను సవరించాలని నిర్ణయించింది. పాత చట్టంలోని శ్లాబ్ సిస్టమ్‌లోనూ రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మార్పులను చేశారు. కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ సమయంలో చెల్లించే లైఫ్ టాక్స్ స్ట్రక్చర్‌లో మార్పులు చేసి వీలైనంత ఎక్కువ ఆదాయం సమకూరేలా జీవో రూపొందించారు. త్వరలో గ్రీన్ టాక్స్, రోడ్ సేఫ్టీ సెస్ లాంటి పేర్లతో అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోడానికి ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది.రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జారీ చేసిన జీవో ప్రకారం కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్ చేస్తున్న సమయంలోనే లైఫ్ టాక్స్ ను రవాణా శాఖ అధికారులు వసూలు చేయనున్నారు. పాత వాహనాలు అయినట్లయితే ఇతరుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తే ఆ సమయంలో సవరించిన లైఫ్ టాక్స్ ను చెల్లించాల్సి ఉంటుంది.

 

 

దివ్యాంగులు ప్రత్యేకంగా సమకూర్చుకున్న క్యారేజీకి తగిన అనుమతి తీసుకోనట్లయితే వాటికి కూడా అదనంగా చెల్లించాల్సి ఉంటుందని ఆ జీవోలో ఆయన పేర్కొన్నారు. బైక్‌లను రూ. 50 వేల లోపు, ఆ పైన అనే రెండు శ్లాబ్‌లుగా విభజించారు. త్రీ వీలర్, ఫోర్ వీలర్ మొదలు మినీ బస్సు వరకు గతంలో ఉన్న రెండు శ్లాబ్‌లను నాలుగు శ్లాబ్‌లుగా విభజించారు.కొత్త వాహనాలైనట్లయితే రూ. 5 లక్షల లోపు ధర ఉండే వాహనాలకు అందులో 13%, రూ. 10 లక్షల లోపు అయితే 14%, రూ. 20లక్షల లోపు అయితే 17%, రూ. 20 లక్షలు దాటితే 18% చొప్పున పెంచారు. పాత వాహనాలను కొత్త వ్యక్తుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లయితే వాటి వయసుకు అనుగుణంగా లైఫ్ టాక్స్ లో సవరణలు చేశారు. సరుకు రవాణా కాకుండా ప్యాసింజర్లను తీసుకెళ్ళే కమర్షియల్ వెహికల్స్ కు కూడా లైఫ్ టాక్సులో మార్పులు చేశారు. 10 మంది కంటే ఎక్కువ ప్రయాణీకులను తీసుకెళ్ళే వాహనాలకు అదనంగా 2% టాక్సును విధించారు.

 

Tags: Duck on vehicles

Leave A Reply

Your email address will not be published.