దిక్కుతోచని అన్నదాత

Date:18/08/2018
మెదక్ ముచ్చట్లు:
మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా మారింది ఉమ్మడి మెదక్‌ జిల్లాలో అన్నదాతల పరిస్థితి. ఇప్పటికే తీవ్ర వర్షాభావంతో అల్లాడుతున్న తరుణంలో కత్తెర పురుగు ఉరుము లేని పిడుగులా మారింది. ముఖ్యంగా అత్యధిక విస్తీర్ణంలో మొక్కజొన్న సాగు చేసిన సిద్దిపేట జిల్లాలో కత్తెర పురుగుతో భారీ విస్తీర్ణంలో పంటకు నష్టం వాటిల్లే ప్రమాదముంది.
మెదక్‌, సంగారెడ్డి జిల్లాలకూ పురుగు విస్తరించే అవకాశం ఉంది. మొత్తంగా ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాలో మొక్కజొన్నపై పెట్టిన పెట్టుబడి రూ. 300 కోట్లకు ఎక్కడ ‘కత్తెర’ పడుతుందోనని రైతన్నలు ఆందోళన చెందుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో ప్రస్తుత సీజన్‌లో మొత్తం 2,45,232 ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగైంది. సిద్దిపేట జిల్లాలోనే ఏకంగా 1,72,452 ఎకరాల్లో పంట వేశారు. మొక్కజొన్న పంటకు ఇప్పటివరకు రైతులు సగటున రూ. 12 వేల వరకు పెట్టుబడి పెట్టారు.
ఈ లెక్కన ఉమ్మడి జిల్లాలో రూ.300 కోట్ల వరకు అవుతోంది. ప్రస్తుతం కత్తెర పురుగు సోకిన పంట దాదాపు తుడిచి పెట్టుకుపోతోంది. మందులు కొట్టినా ప్రయోజనం లేకపోగా అన్నదాతలపై ఆర్థిక భారం మరింత పెరుగుతోంది. పురుగు ఉద్ధృతి కారణంగా చాలామంది రైతులు పంటను అలాగే వదిలేస్తున్నారు. కొందరు రైతులు ఇప్పటికే పొలాన్ని దున్నేశారు.
మొక్కజొన్న పంటకు సహజంగానే పురుగుల బెడద తక్కువగా ఉంటుంది. ఎప్పుడైనా మొగి పురుగు ఆశిస్తే గుళికలు వేస్తే సరిపోతుంది. మరీ కాదంటే ఒక్కసారి మందులు పిచికారీ చేస్తే చాలు. ఈసారి మాత్రం పరిస్థితి (మొదటి పేజీ తరువాయి) అందుకు భిన్నంగా ఉంది.
మొక్కజొన్న మొలకెత్తినప్పటి నుంచి ఒకటే తీరుగా పురుగు సోకుతోంది. మొక్కలు చిన్నవిగా ఉన్నప్పటి నుంచే మొగిలో గుళికల మందు వేయటం, మందులు పిచికారీ చేయాల్సి వస్తోంది. అయినా నియంత్రణలోకి రాలేదు.
ఒక్కో రైతు నాలుగు నుంచి ఐదుసార్లు మందులు పిచికారీ చేశారు. ఒకట్రెండు రోజులకే మళ్లీ పురుగు ఉద్ధృతి కనిపించడంతో దిక్కుతోచని పరిస్థితిలో తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే వేల ఎకరాల్లో పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది.
ఇది మరింత విస్తరించి ఈసారి మొక్కజొన్నపై పెట్టిన పెట్టుబడులు మొత్తం తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం పొంచి ఉండటం రైతులను కలచివేస్తోంది.
Tags: Dude prince (melak)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *