మునిసిపాలిటీలో నకిలీ రశీదులు

Duplicate receipts in municipality

Duplicate receipts in municipality

Date:16/09/2018

భద్రాద్రి ముచ్చట్లు:

కొత్తగూడెం ఇల్లెందు మునిసిపాలిటిలో నకిలీ రశీదుల వ్యవహారం జోరుగా సాగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎవరికి వారే యమునాతీరే అన్నట్లుగా కొంత మంది అధికారులు, సిబ్బంది కుమ్మక్కై నకిలీ రశీదులతో చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న విమర్శలున్నాయి. ఆ కోవకి చెదినదే ఈ సంఘటన. రాజస్థాన్‌కు చెందిన స్వెటర్లు, రగ్గుల వ్యాపారి ఇల్లెందులో అమ్మకాలు చేసేందుకు స్థానిక ఫిల్టర్‌బెడ్‌ సమీపంలోని ప్రధాన రహదారి పక్కన ఫుట్‌పాత్‌పై దుకాణం ఏర్పాటు చేశారు.

 

ఈ దుకాణానికి అనుమతి కోసం మునిసిపల్‌ టౌన్‌ప్లానింగ్‌ విభాగం అధికారులను సంప్రదించగా ఆ విభాగం అధికారులు, సిబ్బంది రగ్గుల వ్యాపారిని బురిడీ కొట్టించారు. రగ్గుల వ్యాపారి వద్ద నుంచి రూ. 12వేలు అమ్మకపు పన్ను కొరకు తీసుకున్న అధికారులు కేవలం రూ.వెయ్యుకి మాత్రమే రశీదు ఇచ్చారు. ఆ రశీదుపై ఎటువంటి సంతకమూ, మునిసిపల్‌ కార్యాలయం ముద్ర లేకపోవడంతో వ్యాపారి అవాక్కయ్యాడు. రూ. 12వేలు తీసుకొని కేవ లం రూ.వెయ్యికి మాత్రమే రశీదు ఇవ్వడంతో సదరు సిబ్బందిని ప్రశ్నించగా అంతే ఉంటుందని తెలిపారని వ్యాపారి పేర్కొన్నారు.

 

ఇటీవల పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో కొంత మంది అధికారులు, సిబ్బంది ఫుట్‌పాత్‌ వ్యాపారుల వద్ద నుంచి భారీగా వసూలు చేసి.. నకిలీ రశీదులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారనే ప్రచారం సాగుతోంది. నకిలీ రశీదులతో మునిసిపల్‌ ఆదాయానికి భారీగా గండిపడుతున్నప్పటికీ ఉన్నతాధికారులు పట్టించుకోవడంలేదని పలువురు వాపోతున్నారు. కాగా ఈ విషయమై మునిసిపల్‌ కమిషనర్‌ జగదీశ్‌గౌడ్‌ను వివరణ కోరగా రశీదు అంశం తమ దృష్టికి వచ్చిందని, తగిన చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. పూరిస్థాయి విచారణ అనంతరం బాధ్యులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు.

లాట్ మొబైల్స్ యజమాని ఇంట్లో చోరీ

Tags:Duplicate receipts in municipality

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *