దివిసీమ నిశిరాత్రికి 41 ఏళ్లు

Dwizima is 41 years old

Dwizima is 41 years old

Date:20/11/2018
విజయవాడ ముచ్చట్లు:
అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న తీరం ఒక్కసారిగా అల్లకల్లోలమయింది. అకస్మాత్తుగా వచ్చిన ఉప్పెనతో ఎన్నో ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. భారీగా ఆస్థి నష్టం వాటిల్లింది. ప్రకృతి విలయతాండవానికి గ్రామాలకు గ్రామాలే రాకాసి కెరటాలకు విలవిల్లాడాయి. ఎటు చూసినా శవాల గుట్టలు, పక్షుల కళేబారాలు. దివ్యసీమగా భాసిల్లిన దివిసీమను శవాల గుట్టగా మార్చిన ఆ విపత్తుకు సరిగ్గా 41 ఏళ్లు పూర్తయ్యాయి.
1977 నవంబర్ 20వ తేదీన అర్థరాత్రి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం పెను తుఫాన్‌గా మారి దివిసీమ ముఖ చిత్రాన్ని సర్వనాశనం చేసింది. చరిత్ర పుటల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న దివిసీమ వాసులు తరాలు మారినా, యుగాలు మారినా 1977 ఉప్పెనను మాత్రం మరువలేరు. నేటికీ దివిసీమ వాసులకు నవంబర్ మాసం వచ్చిందంటే వెన్నులో వణుకు పుడుతూనే ఉంటుంది.
నిశిరాత్రిలో దివిసీమను సర్వనాశనం చేసిన ఉప్పెన ఛాయలు నేటికీ దివిసీమ వాసులను హెచ్చరిస్తూనే ఉంటాయి. 10వేల మంది ప్రాణాలను బలికొన్న ఈ ఉప్పెనను నాడు జాతీయ విపత్తుగా పరిగణించారు. కళ్ల ముందే అయినవాళ్లు కడలిలో కొట్టుకుపోతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. ఎవరికి వారు వారి ప్రాణాలను కాపాడుకోవడమే సరిపోయింది. చెట్టుకొకరు పుట్టకొకరుగా చెల్లాచెదురయ్యారు.
తల్లిదండ్రులను కోల్పోయి ఒకరు, కన్న బిడ్డలను కోల్పోయి మరొకరు. చల్లగాలులతో మొదలై అంతకంతకూ పెరిగిన ఈదురు గాలులు, భారీ వర్షం చివరకు ఉప్పెనై ఊళ్లకు ఊళ్లను మింగేసే రాకాసిగా మారింది. కోడూరు, నాగాయలంక మండలాలను నామరూపాలు లేకుండా చేసింది. విపత్తులో నిరాశ్రయులుగా మారిన బాధితులను ఆదుకునేందుకు దయార్ధ్ర హృదయులంతా కదిలారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు దేశ, విదేశాలకు చెందిన ఎన్నో సంస్థలు ఉప్పెన బాధితులను అక్కున చేర్చుకున్నాయి. ఎవరికి తోచిన సాయం వారు చేశారు. నాటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వం, కేంద్రంలో అధికారంలో ఉన్న జనతా ప్రభుత్వం సంయుక్త పర్యవేక్షణలో యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. ఈ సంఘటనకు చలించిన దివిసీమకు చెందిన నాటి విద్యా శాఖ మంత్రి మండలి వెంకట కృష్ణారావు అప్పటికప్పుడే తన పదవికి రాజీనామా చేసి బాధితులకు బాసటగా నిలిచారు.
ఆప్తులను కోల్పోయిన ఆర్తులను పరామర్శించేందుకు ఆయన పాదయాత్ర నిర్వహించి తాను కూడా ఓ బాధితుడుగా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. దివిసీమ పునః నిర్మించే విషయంలో నాటి ప్రభుత్వం 50 శాతాన్ని, స్వచ్ఛంద సంస్థలు 50శాతం నిధులను సమకూర్చి కార్యాచరణ చేపట్టారు. ఈ సంఘటనను జాతీయ విపత్తుగా పరిగణించటంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 200 స్వచ్ఛంద సంస్థలు వెంకట కృష్ణారావుకు అండదండగా నిలిచి ఆపన్నులను ఆదుకున్నాయి.
ఈ క్రమంలో గుట్టలు గుట్టలుగా పడి ఉన్న పశు, మానవ కళేబరాలకు ఎక్కడికక్కడే సామూహిక దహన సంస్కారాలు నిర్వహించాల్సిన దుస్థితి ఏర్పడింది. సముద్రపు నీటితో నిండిపోయిన దివిసీమ తీర గ్రామాలన్నీ తిరిగి సాధారణ స్థితికి చేరుకోవటానికి సుమారు 10 సంవత్సరాలు పట్టిందంటే అతిశయోక్తి కాదు. అస్థవ్యస్థమైన రహదారులను పునః నిర్మించటం, తెగిపోయిన, పడిపోయిన విద్యుత్ లైన్‌లను తిరిగి ఏర్పాటు చేయటం, బాధిత గ్రామాలలో తాత్కాలిక ఆవాసాలను ఏర్పాటు చేయటం, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, దేవాలయాలు, కార్యాలయాలు, సామాజిక భవనాల్లో తుఫాన్ బాధితుల కోసం సహాయ పునరావాస చర్యలను పెద్ద ఎత్తున చేపట్టారు.
ఉప్పెన బాధితులకు సహాయ పునరావాస కార్యక్రమాలకు అవనిగడ్డలోని గాంధీ క్షేత్రం వేదికైంది. ఈ క్రమంలో ఇంకా నాగాయలంక మండలంలోని ఎదురుమొండి, ఈలచెట్లదిబ్బ గ్రామాల్లో నివశిస్తున్న 10వేల మంది ప్రజల రాకపోకలకు అవసరమైన రహదారి వంతెనను (ఏటిమొగ-ఎదురుమొండి) మధ్య నిర్మించటం ద్వారా ప్రకృతి విపత్తుల సమయంలో సురక్షిత ప్రాంతాలకు అవకాశం ఏర్పడుతుంది.
Tags:Dwizima is 41 years old

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *