గంగకు గ్రహణం 

Date:19/05/2018
కడప ముచ్చట్లు:
జిల్లాలో తెలుగుగంగ అనుబంధ కాల్వల నిర్మాణానికి గ్రహణం పట్టుకుంది. భూసేకరణ, అటవీ భూములతో సమస్యలు తలెత్తుతుండటంతో కాంట్రాక్టార్లు చేతులెత్తేస్తున్నారు. తెలుగుగంగ పథకంలో అంతర్భాగమైన బ్రహ్మంసాగర్‌ జలాశయాన్ని 2006లో అప్పటి ప్రభుత్వం జాతికి అంకితమిచ్చింది.  అంతకు ఏడాది ముందే అసంపూర్తిగా ఉన్న తెలుగుగంగ పనులను వేగవంతం చేసే క్రమంలో రూ.412 కోట్లు కేటాయించి పనుల్లో కదలిక తెచ్చారు. కీలకమైన కాల్వల నిర్మాణం జరగకపోవడంతో ఆయకట్టు రైతుల వ్యధ వర్ణనాతీతం. బ్రహ్మంసాగర్‌ జలాశయం కింద కుడి, ఎడమ కాల్వలు ఏర్పాటు చేసి 93,660 ఎకరాలకు నీరివ్వాలన్నది లక్ష్యంగా నిర్దేశించారు. ఆ లక్ష్యాన్ని మాత్రం ఇప్పటికీ సాధించలేకపోతున్నారు. జలాశయం పరిధిలోని చెరువులకు నీటిని వదిలి 10 వేల ఎకరాల వరకు పంటను పరిరక్షించడం మినహా ఫలితం లేకపోయింది. 17 టీఎంసీల నిల్వసామర్థ్యం  ఉన్న బ్రహ్మంసాగర్‌లో పన్నెండేళ్లుగా పూర్తిస్థాయి సామర్థ్యానికి చేరుకున్న దాఖలాలు లేవు.
కాల్వ పనులకు సంబంధించి భూసేకరణ, అటవీ అభ్యంతరాలు ప్రధాన సమస్యగా తయారయ్యాయి. ఆ శాఖ నుంచి అనుమతులు రాని కారణంగా కొన్నిచోట్ల ప్రధాన కాల్వల పనులు ఆగిపోయాయి. గోపవరం మండలం పెద్దపోలుకుంట వద్ద 16 హెక్టార్లకు అనుమతులు రావాల్సి ఉండగా గుండరాజుపల్లె వద్ద 1.7 హెక్టార్లకు మూడేళ్ల కిందట అనుమతులు వచ్చినా పనులు పూర్తిస్థాయిలో ఊపందుకోలేదు. బద్వేలు డివిజన్‌లో కాల్వ పనులకు 58 ఎకరాల భూమి కావాల్సి ఉందని ఇంజినీర్లు భూసేకరణ అధికారులను కోరినా ఇప్పటికీ ఆ కథ కొలిక్కి రాలేదు. ప్రస్తుతం 115 ఎకరాల సేకరణ పరంగా సమస్యలున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో కాల్వల నిర్మాణం ఆరంభం కాలేదు. ఆయకట్టు రైతులు అల్లాడిపోతున్నారు. వేలాది ఎకరాలు ఏళ్లుగా ముళ్లపొదలు, పిచ్చిమొక్కలతో నిండిపోయి బీళ్లుగా కనిపిస్తున్నాయి. ఇక్కడ భూగర్భ జలానికీ కష్టం కావడంతో అరకొరగా పంట పెట్టిన రైతులు వదిలేసుకుంటున్నారు. కొన్నిచోట్ల అరకొరగా పనులు జరిగినా లైనింగ్‌ వేయలేదు. మరికొన్నిచోట్ల నాసిరకం నిర్మాణాలతో చిన్నపాటి వర్షానికే కొట్టుకుపోతున్న దుస్థితి ఉంది.మూడేళ్ల కిందట  ముఖ్యమంత్రి చంద్రబాబు బ్రహ్మంసాగర్‌ సమస్యపై స్పందించారు. జలాశయంలో పూర్తిస్థాయి నీటిసామర్థ్యాన్ని సాధించి.. ఆయకట్టుకు నీరిస్తామని చెప్పినా అది కేవలం మాటలకే పరిమితమైంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలని రైతులు వేడుకుంటున్నారు.
Tags: Eclipse

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *