లోన్ యాప్ లపై ఈడీ దృష్టి
హైదరాబాద్ ముచ్చట్లు:
మొబైల్ ఫోన్ లోన్ యాప్ కంపెనీలపై ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టర్ కొరడా ఝళిపించింది. పన్నెండు యాప్‌లకు సంబంధించిన నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు చెందిన రూ. 105.32 కోట్లను జప్తు చేసింది. గత నెల 7 నాటికి రూ. 1,589 కోట్లను స్వాధీనం చేసుకున్నది. ఇప్పటివరకు రూ.4,430 కోట్లను వినియోగదారులకు లోన్ యాప్‌ల ద్వారా జారీ చేసినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. మంజూరు చేసిన రుణాల మీద ఇప్పటికే రూ. 819 కోట్ల మేర లాభాలను ఆర్జించినట్లు గుర్తించింది. రాష్ట్రంలో లోన్ యాప్ బాధితుల సమస్య తీవ్రంగా ఉండడంతో రిజర్వు బ్యాంకుకు రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు గత నెలలోనే రాతపూర్వకంగా విజ్ఞప్తి చేశారు. చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. ఇప్పుడు మరింత దూకుడు పెంచిన ఈడీ.. ఒక్క రోజులోనే పన్నెండు యాప్‌లకు సంబంధించిన బ్యాంకు ఖాతాల్లోని అమౌంట్‌ను జప్తు చేసింది.
తాజాగా జప్తు చేసిన డబ్బు ఇండీట్రేడ్ ఫిన్‌కార్ప్ లిమిటెడ్, ఆగ్లో ఫిన్‌ట్రేడ్ ప్రైవేట్ లిమిటెడ్ తదితరాలకు చెందిన బ్యాంకు ఖాతాల్లో ఉన్నదే కాక పేమెంట్ గేట్‌వే ఖాతాల్లోనూ మరికొంత ఉన్నట్లు ఈడీ పేర్కొన్నది. చైనాతో పాటు పలు దేశాలకు చెందిన నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలతో లోన్ యాప్‌లకు అవగాహనా ఒప్పందాలు ఉన్నట్లు ఈడీ ఒక ప్రకటనలో పేర్కొన్నది. ఆండ్రాయిడ్ ఆధారిత గూగుల్ ప్లే స్టోర్‌లో ఇవి అందుబాటులో ఉన్నాయి. నిబంధనలను ఉల్లంఘించినట్లు ఫిర్యాదులు రావడంతో కొన్నింటిపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. గత నెలలో నాలుగు యాప్‌లకు చెందిన బ్యాంకు అకౌంట్ల నుంచి ఈడీ జప్తు చేసింది. తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లోనూ లోన్ యాప్ బాధితులు ఉన్నారుతెలంగాణ కేంద్రంగా సుమారు 80 లోన్ యాప్‌లు పనిచేస్తున్నాయంటూ రిజర్వు బ్యాంకుకు గత నెలలో రాష్ట్ర ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ చేసిన విజ్ఞప్తిలో వివరించారు.

గతేడాది 61 ఫిర్యాదులు వస్తే వాటిపై సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ చేపట్టారు. ఐదుగురు బాధితులు ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు ఈ లోన్ యాప్ యాజమాన్యంపై ఐపీసీ సెక్షన్ల కింద, ఐటీ యాక్టు కింద ఎఫ్ఐఆర్‌లు కూడా నమోదు చేశారు. ఈ ఏడాది జూన్ చివరి నాటికే 900 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో ప్రాథమిక విచారణ పూర్తిచేసిన పోలీసులు.. 46 ఎఫ్ఐఆర్‌లను నమోదు చేశారు. ముగ్గురు బాధితులు ఈ ఏడాది సూసైడ్ చేసుకున్నారు. ఆర్బీఐ నిబంధనలకు విరుద్దంగా గూగుల్ ప్లే స్టోర్‌లో లోన్ యాప్‌లు అందుబాటులో ఉన్నాయని రామకృష్ణారావు ఆ విజ్ఞప్తిలో వివరించారు.ఏ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీతో ఈ లోన్ యాప్‌లు అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయో వెల్లడించలేదని పేర్కొన్నారు. కొన్ని లోన్ యాప్‌లు ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఫలానా ఎన్‌బీఎఫ్‌సీ సంస్థతో ఎంవోయూ కుదుర్చుకున్నట్లు చెప్పుకుంటున్న విషయాన్ని గుర్తుచేశారు. తెలంగాణ కేంద్రంగా పనిచేస్తున్న 80 నాన్ బ్యాంకింగ్ పైనాన్స్ కార్పొరేషన్లలో 33 మాత్రమే రిజర్వు బ్యాంకుతో రిజస్ట్రేషన్ పూర్తిచేసుకున్నాయని, మిగిలిన 47 నిబంధనలకు విరుద్దంగానే పనిచేస్తున్నట్లు వివరించారు. ఇల్లీగల్‌గా నడుస్తున్న ఎన్‌బీఎఫ్‌సీ, లోన్ యాప్‌లపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆర్బీఐను రామకృష్ణారావు ఆ విజ్ఞప్తిలోనే కోరారు. నెల రోజుల తర్వాత ఈడీ అధికారులు రంగంలోకి దిగి పన్నెండు యాప్‌ల ఖాతాల్లోని డబ్బును జప్తు చేయడం గమనార్హం.
Tags: ED focus on loan apps
